Share News

నేడే వెలిగొండ పండగ

ABN , Publish Date - Aug 31 , 2026 | 04:23 AM

ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు.

నేడే వెలిగొండ పండగ
VELIGONDA

  • ప్రాజెక్టు ఫేజ్‌-1 ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • సాకారం కానున్న 30 ఏళ్ల కల.. ప్రజల్లో హర్షాతిరేకం

  • మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా కార్యక్రమం

  • ఫీడర్‌ కాలువ ద్వారా నల్లమలసాగర్‌లోకి నీటి విడుదల

  • కృష్ణమ్మకు నేడు సీఎం జలహారతి.. పైలాన్‌ ఆవిష్కరణ

  • అనంతరం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగం

  • ఆదివారం ట్రయల్‌ రన్‌ విజయవంతం

  • నేడు మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర: సీఎం ట్వీట్‌

అమరావతి/ఒంగోలు/మార్కాపురం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ముప్పై ఏళ్ల కల సాకారం కాబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా ప్రాజెక్టు తొలిదశను ఆవిష్కరిస్తారు. ఫీడర్‌ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటిని నల్లమలసాగర్‌ జలాశయంలోకి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నవ్యాంధ్ర సీఎంగా అదే ప్రాజెక్టును జాతికి అంకితం చేయనుండటం విశేషం. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్‌ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాదు... ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి, ప్రధాన కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. 53 టీఎంసీల సామర్థ్యం గల వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలలోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలతో సహా సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకూరనుంది.


తొలిదశతో కొత్త అధ్యాయం

ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేయనున్నారు. తొలి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో దశ పూర్తయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. వెలిగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. 1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ పరమైన సవాళ్లు ఎదురయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని పనులను వేగవంతం చేసింది. టన్నెల్‌ పనులు, ఫీడర్‌ కాలువలు, హెడ్‌ రెగ్యులేటర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, పరిహారం చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలో నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం చెల్లించింది. అంతేకాకుండా గెజిట్‌, జాబితాలో పేర్లు లేని వారికోసం మరో రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు సాకారమవుతుండటంతో నాలుగు జిల్లాలలో ముఖ్యంగా మార్కాపురం ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కాపురం జిల్లా గడ్డపై సోమవారం కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ సీఎం చంద్రబాబు ఆదివారం ట్వీట్‌ చేశారు. నల్లమలకొండలను చీల్చుకుంటూ నల్లమలసాగర్‌లోకి వెళ్లే కృష్ణా జలాలు ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించే అవకాశం తనకు రావడం తన మనసుకు ఎంతో సంతోషానిస్తోందన్నారు.


ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం 10.15గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండ లం గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను ప్రారంభించి పైలాన్‌ ఆవిష్కరిస్తారు. అనంతరం గంటవానిపల్లిలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.


కరువు, వలసలకు పరిష్కారం: అచ్చెన్న

వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభంతో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో కొత్త వెలుగు రాబోతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో కరువు, వలసలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. కరువుతో పోరాడిన రైతన్నకు భరోసా. ఫ్లోరైడ్‌ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత. వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు. పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం. ఈ మహాయజ్ఞం కోసం తమ భూములు, ఇళ్లు, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేటితో మొదలయ్యే వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. వెలిగొండ పండగ వద్ద కలుద్దాం.

- చంద్రబాబు


ట్రయల్‌ రన్‌ విజయవంతం

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం దీన్ని నిర్వహించారు. శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న కొల్లంవాగు వద్ద ప్రాజెక్టు గేట్లు ఎత్తి సొరంగ మార్గంలోకి కృష్ణా జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో విడుదల చేశారు. అనంతరం గేట్ల పనితీరు, సొరంగంలోకి నీటి ప్రవాహ వేగాన్ని, నీటి తరలింపు ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలించారు. సొరంగ మార్గం నుంచి కృష్ణా జలాలు ఫీడర్‌ కాలువ వైపు పరుగులు తీశాయి. ఈ శుభఘడియలను చూసేందుకు ప్రజలు తరలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. సొరంగం ద్వారా వచ్చిన జలాలను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడర్‌ కాలువ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు విడుదల చేస్తారు.


కల అనుకున్నాం.. కళ్లెదుటకొచ్చింది

చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు

30 ఏళ్ల కలను నిజం చేశారు.. మార్కాపురం వాసులు హర్షం

కార్యక్రమానికి తరలివస్తున్న రైతులు

‘అదిగో వెలిగొండ.. ఇదిగో వచ్చేస్తోంది.. అని చెబుతుంటే కల అనుకున్నాం. కానీ ఈ రోజు కళ్లేదుట కనిపిస్తుంటే ఆ ఆనందానికి హద్దుల్లేకుండా పోతోంది. మేము చూడలేం, మా పిల్లలకైనా వెలిగొండ జలాలు వస్తాయా? అని అనుకున్నాం. కానీ మా హయాంలోనే కృష్ణా జలాలు బిరబిరా వస్తున్నాయి’.. మార్కాపురం ప్రాంతంలో ఎక్కడ చూసినా రైతుల నోట వినిపిస్తున్న మాటలివి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే వెలిగొండ తొలిదశ పూర్తిచేసి 2026 ఆగస్టు నాటికి నీళ్లు ఇస్తామని చెబుతూ వచ్చింది. పనులు పరుగులు పెట్టించేలా ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సూచనలతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు వద్దకు వచ్చి కార్మికులతో కలిసి సొరంగాల్లో కలియతిరుగుతూ పనులు చేయించారు. అయితే అందరిలాగే హడావుడి చేస్తున్నారులే అని భావించామని కొందరు రైతులు చెబుతున్నారు. నిర్వాసితులు కూడా ఇంత త్వరగా ఖాళీ చేయాల్సి వస్తుందని అనుకోలేదని, 2026 ఆగస్టులో తొలిదశ పనులు పూర్తికావటం, నీళ్లు విడుదల చేయటం జరిగే పనికాదని భావించామని చెప్పుకొచ్చారు. కానీ చెప్పిన గడువుకు తొలిదశ పనులు పూర్తిచేశారు. వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ట్రయల్‌ రన్‌ ద్వారా వస్తున్న నీటిని చూస్తుంటేనే ఒళ్లు పులకరించిందని రైతులు అంటున్నారు. గతంలో ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే జగన్‌ జాతికి అంకితం అని చేసిన మోసాన్ని చర్చించుకుంటున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.


చూస్తామనుకోలేదు

మా హయాంలో వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు చూస్తామని అనుకోలేదు. ఎంతోమంది పాలకులు మాటలు చెప్పి తప్పారు. కానీ సీఎం చంద్రబాబు చెప్పినమాట ప్రకారం 2026 ఆగస్టులో నీళ్లు వదలటం ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు తప్ప పూర్తవుతుందన్న ఆశ లేదు. కానీ మా ఆశను సీఎం చంద్రబాబు నిజం చేశారు. చాలా సంతోషంగా ఉంది.

-పెట్ల లాజరు, రైతు, బోడపాడు, మార్కాపురం మండలం

చంద్రబాబు జీవం పోశారు

మేం ఆశలు వదులుకున్న ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు జీవం పోశారు. 30 ఏళ్ల కలను నిజం చేశారు. వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు మా ప్రాంతానికి వస్తున్నాయని ఊహించుకుంటేనే ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఇంతటి మంచి కార్యక్రమం చూసి మదిలో జ్ఞాపకంగా నిలుపుకోవాలని రైతులంతా ఉత్సాహంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. -కంచర్ల నరసింహం, రైతు, కొత్తపల్లి, పీసీ పల్లి మండలం


జగన్‌కు చిత్తశుద్ధి లేదు

వెలిగొండ పూర్తి చేయకుండా జాతికి అంకితం

కూటమి వచ్చాక పూర్తి చేశారు: కొలుసు

ప్రజలకు మేలు చేయకుండా దొంగ క్రెడిట్‌లతో ఊహల్లో బతికే పార్టీ వైసీపీ అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ప్రజల జీవితాలు బాగుచేయాలన్న ఆలోచన లేని గొడ్డలి పార్టీ నాయకుడు జగన్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. మార్కాపురం కలెక్టరేట్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్‌తో కాళ్లూచేతులూ వంకర తిరిగి ఇబ్బందులు పడుతుంటే కనీసం కనికరం కూడా లేకుండా జగన్‌ వ్యవహరించారన్నారు. వెలిగొండ నిర్వాసితుల సమస్యను పట్టించుకోలేదని, ఆర్‌అండ్‌ఆర్‌, పునరావాస చర్యలు ఏమీ తీసుకోకుండా కేవలం జాతికి అంకితం అంటూ ఆయన చేసిన మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. జగన్‌ హయాంలో వెలిగొండ కోసం బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు కేటాయించి ఐదేళ్లలో రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు కేవలం రెండేళ్లలో రూ.2,400 కోట్లకు పైన ఖర్చు పెట్టి వెలిగొండ తొలిదశ పూర్తి చేశారన్నారు. ఇదీ చిత్తశుద్ధి అంటే అని అన్నారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించి రూ.910 కోట్లు ఇవ్వడమే కాకుండా అదనంగా మరో రూ.169 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై నిర్వాసితులు తనతో మాట్లాడారని, వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఇంతటి చరిత్రాత్మక ఘట్టం వెలిగొండ ప్రారంభోత్సవం అని, దీనికి జిల్లా నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.


వెలిగొండ విశేషాలు

అంచనా వ్యయం : రూ.10,200 కోట్లు

సామర్థ్యం : 53.85 టీఎంసీలు

ప్రయోజనం : ప్రకాశం, మార్కాపురం,

నెల్లూరు, కడప జిల్లాలలోని

30 మండలాల ప్రజలకు

సాగునీరు : 4.47 లక్షల ఎకరాలకు

తాగునీరు : 23 లక్షల మందికి

తొలి దశలో

నల్లమలసాగర్‌ జలాశయానికి 10.70

టీఎంసీల కృష్ణా జలాల విడుదల

సుమారు 1.19 లక్షల

ఎకరాలకు సాగునీరు

4 లక్షల మందికి తాగునీరు

అరుదైన ఘట్టం

1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన

2026 ఆగస్టు 31న నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం


ఈ వార్తలు కూడా చదవండి

‘నైరుతి’ మూడో నెలలోనూ నిరాశే

Veterinary: వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరికో?

Updated Date - Aug 31 , 2026 | 04:40 AM