Veterinary: వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరికో?
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:45 AM
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరిని వరిస్తుందోనన్నది ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ జేవీ రమణ 62 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ ఈనెలాఖరుతో ముగియనుంది.
తిరుపతి రూరల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరిని వరిస్తుందోనన్నది ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ జేవీ రమణ 62 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో ఇన్‌చార్జి పదవి కోసం పలువురు ఆశావహ ప్రొఫెసర్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుత వీసీ జేవీ రమణ 65ఏళ్ల ప్రొఫెసర్ సేవల కొనసాగింపునకు తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈయన్నే ఇన్‌చార్జిగా కొనసాగిస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
మూడేళ్లుగా ఇన్‌చార్జిలే..
గత వైసీపీ ప్రభుత్వంలో రెగ్యులర్ వీసీ పదవీకాలం 2023 ఆగస్టు4వ తేదీతో ముగిసింది. అప్పట్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వీసీని పునర్నియమించడానికి ఉత్తర్వులు వెలువరించారు. దీనిపై కొందరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పునర్నియామక నిబంధనలపై హైకోర్టు ప్రభుత్వాన్ని స్పష్టత కోరడంతో బ్రేక్ పడింది. చేసేదేమీలేక యానిమల్ హజ్బెండరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై 19వ తేదీన వర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ జేవీ రమణను ఇన్‌చార్జి వీసీగా నియమించారు. అంటే మూడేళ్లుగా ఇన్‌చార్జి వీసీ పాలనలోనే వర్సిటీ నడుస్తోంది. అలాగే దాదాపు నాలుగేళ్లకుపైగా పూర్తిస్థాయి పాలకమండలి(ఈసీ) లేకుండానే పాలన సాగిస్తున్నారు. దాంతోపాటు కీలకమైన రిజిస్ర్టార్, వెటర్నరీ సైన్స్ డీన్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(డీఆర్), డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్(డీఎ్‌సఏ), డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్(డీఈ), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(సీవోఈ), కంప్ర్టోలర్ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే ఉన్నారు. ఇకనైనా రెగ్యులర్ వీసీతోపాటు పూర్తిస్థాయి పాలక మండలి నియామకం చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.