Share News

తక్షణం ఆదుకోండి

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:23 AM

వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం వాటిల్లిందని.. తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

తక్షణం ఆదుకోండి

  • 2 భారీ తుఫాన్లతో రూ.7 వేల కోట్లకు పైగా నష్టం

  • ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ

  • చేతికందే పంట నీటిపాలైంది

  • రైతులు తీవ్రంగా నష్టపోయారు

  • తీర మౌలిక వసతులకు భారీ దెబ్బ

  • విద్యుత్‌ వ్యవస్థకు అత్యధిక నష్టం

  • కేంద్ర బృందాలూ పర్యటించాయి

  • సత్వరం చేయూతనిస్తే కోలుకుంటాం

  • సీమ హార్టికల్చర్‌ హబ్‌కూ నిధులివ్వండి

  • విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌కు తోడ్పడండి

  • ‘పూర్వోదయ’ నిధులూ విడుదల చేయండి

  • నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వినతి

  • సీఎం నిర్ణయాలు విప్లవాత్మకం

  • పారిశ్రామికవేత్తల్లో మరింత నమ్మకం

  • విశాఖ సదస్సు సక్సెస్‌పై నిర్మల ప్రశంసలు

న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం వాటిల్లిందని.. తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మంగళవారం ఢిల్లీలో ఆమెతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, హార్టికల్చర్‌ హబ్‌, పూర్వోదయ నిధులు, ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై చర్చించారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు, అక్కడ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్నబ్‌, మురసు తుఫాన్లతో ప్రాథమిక అంచనా ప్రకారమే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్నారు. చేతికందే పంట నీటిపాలైందని తెలిపారు.


ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. రైతులను గట్టెక్కించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారాకొన్ని ప్రాంతాలకు సాగు నీరు అందించామని.. కానీ తుఫాన్లకు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తీర ప్రాంతంలో మౌలిక వసతులు బాగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా విద్యుత్‌ వ్యవస్థ ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించాయన్నారు. త్వరలోనే నివేదికలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ ఆర్థిక సాయం అందిస్తే.. వేగంగా కోలువడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తుఫాన్ల ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యలనూ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయ, పునరుద్ధరణ పనుల గురించి కూడా తెలిపారు.

ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు..

విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల వారీగా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని నిర్మలా సీతారామన్‌కు సీఎం తెలియజేశారు. ఇందులో భాగంగా రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు ఆమే స్వయంగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హార్టికల్చర్‌ హబ్‌లో భాగంగా వివిధ స్థాయుల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని.. గ్రామాలకు రోడ్‌ నెట్‌వర్క్‌, ఇరిగేషన్‌ అభివృద్ధి పనులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటివాటిపై దృష్టి సారించామని వివరించారు.

అలాగే విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రీజియన్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇప్పటికే కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో సహకారం అందుతోందని చెప్పారు. అదనంగా మరింత సాయం అందించగలిగితే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయన్నారు. పూర్వోదయ పథకం నిధులూ విడుదల చేయాలని కోరారు.


పెట్టుబడుల సదస్సు భేష్‌: నిర్మల

విశాఖలో సీఐఐ భాగస్వామ్యంతో ఇటీవల నిర్వహించిన రెండ్రోజుల పెట్టుబడుల సదస్సు విజయవంతంపై కేంద్ర ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు. పెట్టుబడుల రక్షణ చట్టం ప్రతిపాదన, పారిశ్రామిక రాయితీలు/ప్రోత్సాహకాల కోసం ఎస్ర్కో ఖాతాలు తెరవడం విప్లవాత్మకమైనవని తెలిపారు. ఇవి పెట్టుబడుల ఎకోసిస్టమ్‌లో గణనీయమైన మార్పులు తెస్తాయని.. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం మరింత బలపడుతుందని.. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహడపడతాయని చెప్పారు. సదస్సులో వచ్చిన పెట్టుబడులు, జరిగిన ఒప్పందాలు, తీసుకున్న నిర్ణయాలు, వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబు ఆమెకు వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 03:30 AM