Share News

సాగు క్యాలెండర్‌ ముందుకు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:17 AM

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సాగు క్యాలెండర్‌ ముందుకు!

  • ఖరీఫ్‌ నుంచి ముందుగానే వ్యవసాయ పనులు: సీఎం

  • తుఫాన్ల ప్రభావం పంటలపై పడకుండా చూడాలి

  • పంట నష్టాల నివారణకు సాగు విధానాల్లో మార్పులు

  • ఉద్యాన రంగంలో పెట్టుబడులకు ప్రత్యేక సదస్సు

  • ప్రకృతి వ్యవసాయంపై వరి రైతులకు అవగాహన కల్పించాలి

  • 2027-28 నాటికి 26.5 లక్షల మంది ప్రకృతి సాగులోకి రావాలి

  • రసాయన ఎరువుల వాడకం తగ్గాలి

  • కేంద్ర ప్రోత్సాహకాలను వాడుకోవాలి

  • ప్రతి రైతూ బీమా పరిధిలోకి రావాలి

  • వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం నిర్దేశం

రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెంచాలి. మేకలు, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించి, పశుసంపదను పెంచాలి. వీబీజీ రామ్‌జీ పథకాన్ని పశుసంపద అభివృద్ధికి ఏమేరకు వినియోగించుకోవచ్చో అధ్యయనం చేయాలి. ఉద్యాన పంటల సాగుతో కరువును అధిగమించే చర్యలు చేపట్టాలి. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి. వర్షపు నీటి వినియోగం, భూగర్భ జలాల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి

- సీఎం చంద్రబాబు


అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫాన్ల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా పంటల సాగు క్యాలెండర్‌ను ముందుకు జరపాలన్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి సాగును ముందుగానే ప్రారంభించి.. తుఫాన్ల ప్రభావం పంటలపై పడకుండా చూడాలని నిర్దేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్‌లో పంట నష్టాన్ని నివారించేలా సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం అన్నారు.

‘ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన వరి పంటకు ఇటీవలి తుఫాన్లతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. దీనిపై వరి రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రతి పంట సీజన్‌ ప్రారంభానికి ముందే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగు కాలం వంటివి పరిగణనలోకి తీసుకుని, ప్రణాళిక రూపొందించాలి’ అని స్పష్టంచేశారు. ప్రకృతి సాగును మరింత విస్తరించాలని.. 2027-28 నాటికి 26.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ అంశానికి సంబంధించి, కేంద్రప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉటంకిస్తూ, మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.


సమర్థ నీటి నిర్వహణ..

కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం అన్నారు. జలధార-2 పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని.. అవసరమైతే జలధార-3 కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం ఎంత నమోదవుతోంది? భూగర్భ జలాల లభ్యత ఎంత ఉందనే అంశాలపై కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు, స్పష్టమైన ఫలితాలు, అధిక లాభాలు కనిపించాలని ఆకాంక్షించారు.

త్వరలో హార్టికల్చర్‌ హబ్‌ పనులు

ఉద్యాన పంటల్లో కొత్త రకాలకు ప్రాధాన్యమివ్వాలని.. ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. హార్టికల్చర్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం, ప్రపంచబ్యాంకు సహకారంతో రూ.40 వేల కోట్లు సమీకరించాలన్నారు. ‘మిగిలిన రూ.60 వేల కోట్లను ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవాలి. వీలైనంత త్వరలో హార్టికల్చర్‌ హబ్‌ పనులు ప్రారంభించాలి. ప్రతి నెలా పురోగతిపై సమీక్షించాలి. ఇందులో ప్రకృతి వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి.

ఉద్యాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘హార్టికల్చర్‌ సమ్మిట్‌’ను నిర్వహించాలి. అలాగే ఫుడ్‌ ప్రొసెసింగ్‌ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. పంటల ఉత్పత్తి నుంచి ప్రొసెసింగ్‌, మార్కెటింగ్‌ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఆధునిక పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు కొత్త రకాల పంటలను పరిచయం చేసి, భూసార పరిరక్షణకు పెద్ద పీట వేయాలి’ అని కోరారు. రైతులతో పాటు కౌలు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాలని సూచించారు. ఉద్యాన పంటల సాగులో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని అధికారులు చెప్పారు.


పశుసంపదకు జీరామ్‌జీ అనుసంధానంపై అధ్యయనం

వ్యవసాయ, ఉద్యాన, ఆక్వాకల్చర్‌ రైతుల కోసం సేవలన్నింటినీ ఒకే యాప్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. వారికి అవసరమైన సమాచారం, సాగు సూచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఒకే వేదిక ద్వారా అందుబాటులోకి తేవాలన్నారు. రైతుసేవా కేంద్రాల నుంచి క్షేత్ర స్థాయి సమాచారం సేకరించి, ఏడాది పొడవునా రాష్ట్రంలో పచ్చదనం ఉండేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అగ్రివాచ్‌పై ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. డిజి రైతుబజార్‌ ప్రారంభించాక ఇప్పటికి లక్షకు పైగా ఆర్డర్లకు కూరగాయలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఫిబ్రవరికల్లా మరో 40 మొబైల్‌ రైతుబజార్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

12.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం..

ఈ ఏడాది ఖరీ‌ఫ్‌లో ఎల్‌నినోతో వర్షాభావం, కరువు పరిస్థితులు.. అర్నబ్‌, మురసు తుఫాన్లతో భారీ వర్షాల కారణంగా 26 జిల్లాల్లో మొత్తం 12.64 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 9.67 లక్షల హెక్టార్లలో పంటలు కరువు వల్ల దెబ్బతినగా.. అర్నబ్‌ తుఫాన్‌కు 13 జిల్లాల్లో 3.82 లక్షల మంది రైతుల పంటలు, మురసు తుఫాన్‌కు 9 జిల్లాల్లో 52,402 మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు.


దెబ్బతిన్న పంట నష్టం వివరాలతో నివేదికను కేంద్రానికి అందించినట్లు వివరించారు. ప్రకృతి విపత్తుల కారణంగా దెబ్బతిన్న పంటలకు మొత్తం రూ.2,743 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 11.55 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పంటల బీమా పరిధిలో ఉందని చెప్పారు. నష్టపోయిన పంటలకు రూ.1,732 కోట్ల బీమా క్లెయిమ్‌లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సీఎం స్పందిస్తూ.. ప్రతి రైతూ బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీమా కింద ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు బీమా పరిహారం అందే అంశంపై సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 03:24 AM