అంతకుమించి గెలవాలి!
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:58 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. గురువారం పరిషత్ ఎన్నికల్లోనూ ప్రతి ఒక్కరూ పూర్తి సమన్వయంతో పనిచేయాలి. కూటమి ఐక్యత ఎంత మాత్రం చెడిపోకూడదు. - ముఖ్యమంత్రి చంద్రబాబు
పరిషత్ ఎన్నికల్లోనూ మనమే: చంద్రబాబు
‘పుర’పోరులాగే సమన్వయంతో పనిచేయాలి
సీట్లు పొందలేని నేతలకు నామినేటెడ్ పదవులు
మన కష్టాన్ని ప్రజలు గుర్తించారు
మున్సిపోల్స్‌లో అండగా తీర్పు ఇచ్చారు
94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించాం: సీఎం
కూటమి శ్రేణులతో టెలికాన్ఫరెన్స్
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక ఎన్నికలను మించి జడ్పీటీసీలు.. ఎంపీటీసీ స్థానాలను గెలవాలని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. చిన్నపాటి పొరపాటు కూడా జరగకూడదని కూటమి పార్టీలకు స్పష్టం చేశారు. బుధవారం పట్టణ ఎన్నికల ఫలితాలపై పాలక కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పీవీఎన్ మాధవ్ కూడా ఇందులో పాల్గొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయానికి కృషిచేసిన నేతలు, కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించామన్నారు.
స్థానికంగా ఉన్న చిన్నపాటి సమన్వయ లోపాలతో కొన్ని స్థానాలు కోల్పోయామని.. అక్కడ కూడా కూటమి పార్టీలకు చెందిన రెబల్సే గెలిచారని గుర్తుచేశారు. కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థి అయినా మన అభ్యర్థే అన్నట్లుగా పనిచేయాలని మూడు పార్టీల శ్రేణులనూ కోరారు. మిత్రపక్షాలను గౌరవించుకోవలసిన అవసరం ఉందన్నారు. ‘కుటుంబంలోనూ.. పార్టీలోనూ.. సంస్థల్లోనూ భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి పనిచేయాలి.. కూటమి ధర్మాన్ని పాటించాలి. పొత్తు ధర్మం పాటించని వారిని వదులుకోవడానికి కూడా సిద్ధం’ అన్నారు. ఎన్నికల్లో సీట్లు ఆశించి.. పొందలేని కూటమి నేతలకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రేణులతో సీఎం ఇంకా ఏమన్నారంటే..
అనుకున్న విధంగానే పట్టణ ఫలితాలు..
పట్టణ ప్రాంతాల్లో అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయి. కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. గుడ్ గవర్నెన్స్... గుడ్ పాలిటిక్స్ ఇదే కూటమి ప్రభుత్వ విధానం. మన ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారు. మంచికి.. మంచి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ ఫలితాల ద్వారా చాటి చెప్పారు. గొడ్డలి పార్టీ హింసను ప్రేరేపిస్తోంది.. ఓటమి తప్పదని.. ఉనికి చాటుకోవడానికి కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతోంది. స్థానిక ఎన్నికల్లో దానికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పారు.
గొడ్డలి పార్టీ నేతలు సొంత బూత్‌లలోనూ గెలవలేకపోయారు. సుపరిపాలనతో సమానంగా పొలిటికల్ గవర్నెన్స్ ఉండేలా చూస్తున్నాం. సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధీ చేస్తున్నాం. ప్రజలకు మనం అండగా నిలిస్తే.. వారు మనతోనే ఉంటారనేది నిరూపితమైంది. రాష్ర్టానికి.. తమకు న్యాయం జరగాలనే ప్రజలు కూటమికి పట్టం కడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్