రెండేళ్ల పాలనపై ప్రచార భేరీ!
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:58 AM
రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు.
25 నుంచి ఆగస్టు 10 వరకు సైకిళ్లపై ఇంటింటికీ
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
గొడ్డలి పార్టీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి
సైకిల్ పవర్ చూపుదాం.. ప్రజలకు చేరువవుదాం
వన్‌టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు
గొప్పగా పనిచేయకున్నా.. తప్పులైతే చేయొద్దు
‘సర్’పై అవగాహన పెంచుకోండి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండాలి
కూటమి పార్టీలతో సమన్వయానికి యాక్షన్ ప్లాన్
రేపు 3 పార్టీల సమన్వయ భేటీ.. పార్టీ నేతలతో సీఎం
ఓట్లు నమోదు చేసుకోవడం ఓటర్ల బాధ్యత. ఓట్ల చేరికపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన బాధ్యత. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా చాలా ముఖ్యం. దాని ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలం. ప్రణాళికలు సిద్ధం చేసుకోగలం.
ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం... మిగిలిన రోజుల్లో పట్టించుకోబోమంటే కుదరదు. మిత్రపక్షాలు మా దగ్గర అంత బలంగా లేరనే ఆలోచన వద్దు. బలాబలాలతో సంబంధం లేకుండా వాటిని కచ్చితంగా కలుపుకొని పోవాలి.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. 45 రోజులపాటు ఇంటింటికీ వెళ్లాలని.. ఈ ప్రచారంలో తాను కూడా పాల్గొంటానని ప్రకటించారు. సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలని.. వీలుంటే తాను సైతం పాలుపంచుకుంటానని చెప్పారు. ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇది పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సర్‌పై జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జోనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్టీ పరిశీలకులు, బీఎల్‌ఏలు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని.. వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలని.. తానూ ఈ-సైకిల్ మీదే ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో ఓటర్ల జాబితాలను ఆధారం చేసుకుని వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవలసి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియపై రాష్ట్ర స్థాయి నేతలు మొదలుకొని గ్రామస్థాయి నేతల వరకు ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకపోతే ఇబ్బందేనని చెప్పారు. ‘మీ వెనుక నీడ ఉంటే అది మీ నీడా లేక గొడ్డలి పార్టీ నీడా అనేది చెక్ చేసుకోండి’ అని సూచించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

అందరూ సీరియ్‌సగా తీసుకోవాలి..
ప్రతి 20 -25 ఏళ్లకోసారి ‘సర్’ ప్రక్రియ జరుగుతుంది. 2002లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ ఓటర్ల జాబితాను తీసుకుని దీనిని నిర్వహిస్తారు. జూలై 14లోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారు. అప్పటిలోగా అర్హుల ఓట్ల చేరికలు పూర్తి కావాలి. సర్‌ను అందరూ సీరియ్‌సగా తీసుకోవాలి. ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండకూడదు. మన పార్టీకి బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఉన్నారు. వారు ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్‌వోలతో కలిసి వెళ్లాలి. ఎక్కడా ఉదాసీనత వద్దు. ప్రతి రోజూ మానిటర్ చేస్తా... సమీక్ష నిర్వహిస్తా. మన ఓట్లు ఉన్నాయో లేదో నిరంతరం చూసుకోవాలి. ఏపీకి చెందిన స్థానికులు వివిధ రకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వారి ఓట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు పెద్దఎత్తున వచ్చి ఓట్లేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చాయి.
కూటమి పార్టీల సమన్వయం ముఖ్యం
సర్ ప్రక్రియ పర్యవేక్షణలో కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి. గురువారం (4న) ఎన్డీయే సమన్వయ సమావేశం ఉంది. సర్‌పై మూడు పార్టీలతో త్వరలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామ స్థాయిలోనూ సమన్వయ కమిటీలు వేస్తాం. ప్రభుత్వంలోనే కాదు. అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకోవాలి. పార్టీల మధ్య సమన్వయానికి సర్ మొదటి పరీక్ష. క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మిత్రపక్షాలు ఉండకపోవచ్చు. అయినా వారిని కలుపుకొని వెళ్లాలి. 2024 ఎన్నికలకంటే ఎక్కువగా మిత్రపక్షాలతో పనిచేయాలి.
డీఎస్సీని అడ్డుకోవడానికి...
ఎన్నికల్లో హామీ ఇచ్చి, మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించాం. అది జరగకూడదని గొడ్డలి పార్టీ వారు 241 కేసులు వేసి అడ్డుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా నిర్వహించి టీచర్ల నియామకాలు పూర్తి చేశాం. అలాంటి డీఎస్సీపై ఇప్పుడు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. గట్టిగా కౌంటర్లు ఇస్తే తోకముడిచారు. రాజకీయంగా ఎన్నో పోరాటాలు చేశాను. కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదు.
వన్‌టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు
కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు వన్‌టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు. మళ్లీ మళ్లీ గెలవాలి. పదవి ఎవరికీ శాశ్వతం కాదు.. పనిచేసినంత కాలం పదవికి ఢోకా లేదు. పనిచేయకుంటే వారికి ఓ నమస్కారం పెట్టి పక్కన పెడతాం. ఎవ్వరూ వన్‌టైం ఎమ్మెల్యేగా ఉండిపోకూడదనేది నా అభిమతం. అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు మాత్రమే పోటీ చేయగలరు. కానీ మన ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చినంత కాలం ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా ఉండొచ్చు. ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఓట్లు పడతాయి.. ఓట్లు పోతాయి. గొప్పగా పని చేయకపోయినా పర్వాలేదు. నోరు పారేసుకోకూడదు. తప్పులు చేయకూడదు. మనకు తెలిసి గానీ.. తెలియక గానీ తప్పులు జరగకూడదు. అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. కార్యకర్త మొదలుకొని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ క్యారెక్టర్, నమ్మకం చాలా ముఖ్యం.
అనుచరులు కాదు.. నాయకులు కావాలి
ఏ పార్టీ అయినా అనుచరులను కోరుకుంటుంది.. టీడీపీ నాయకులను కోరుకుంటుంది. సమర్థ నాయకత్వం ఉంటే పార్టీకి బలం పెరుగుతుంది. మహానాడు నిర్వహణతో క్లస్టర్ల స్థాయిలో కొత్త నాయకులు తమ సామర్థ్యం చాటుకున్నారు. కార్యకర్తలు జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చే అధికారంలోనూ వారిని భాగస్వాములను చేయాలి. 2024 ఎన్నికల ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచాం. పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్.. టెక్నికల్ వర్క్ చేసి అద్భుత విజయాన్ని సాధించాం. సర్ విషయంలోనూ అలాగే పనిచేయాలి. అధికారం ఫలితాలు కార్యకర్తలకు అందాలి. కుటుంబ సాధికార సారథి(కేఎస్‌ఎస్) నుంచి అన్ని స్థాయుల వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించి.. దానికి ముందు వారిని నాయకులుగా తయారు చేయాలనే లక్ష్యంతో శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తూనే ఉంది. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలి.
మరే పార్టీలోనూ లేదు..
కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని టీడీపీ తప్ప మరే పార్టీ పెట్టలేదు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నాం. చనిపోయిన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నాం. పిల్లల చదువుకు ప్రత్యేకంగా స్కూలు ఏర్పాటు చేశాం. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం ‘ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం.