చంద్రబాబునాయుడు అనే నేను..
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:54 AM
‘చంద్రబాబునాయుడు అనే నేను 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించి పూర్తిచేశా. గోదావరిని కృష్ణానదికి అనుసంధానం చేశా. 2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం లిఫ్ట్ తీసుకొచ్చా.
‘చంద్రబాబునాయుడు అనే నేను 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించి పూర్తిచేశా. గోదావరిని కృష్ణానదికి అనుసంధానం చేశా. 2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం లిఫ్ట్ తీసుకొచ్చా. చంద్రబాబునాయుడు అనే నేను 2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకొచ్చానని సగర్వంగా ప్రకటిస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా.. రాబోయే మూడేళ్లలో 35వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేస్తా. వాటిపై గడచిన రెండేళ్లలో రూ.25వేల కోట్లు ఖర్చు చేశా. చంద్రబాబు అనే నేను సంకల్పంతో సీఎంగా ఇవన్నీ చేశా. మీరు కూడా సంకల్పంతో ఏం చేస్తారో ఆలోచించాలి. రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అడుగులు ముందుకు వేస్తున్నాం.
ప్రధాని సహకారంతో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంటును నిలబెట్టాం. రైల్వే జోన్ సాధించాం. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఐదేళ్ల కిందటే ఇవన్నీ జరిగేవి. అందుకే అభివృద్ధి శాశ్వతంకావాలంటే ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలి. రాష్ట్రాభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం ఏపీ స్వర్ణాంధ్ర విజన్-2047 పెట్టాం. దీనికి ప్రజలంతా అనుసంధానం కావాలి. కలిసి నడుద్దాం. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా నిలుపుదాం. రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా చేద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం. జై భారత్, జై తెలుగు తల్లి.