Share News

Alipiri: అలిపిరి ఘటనకు ఇరవై మూడేళ్ళు!

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:42 AM

తిరుమల ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద సీఎం చంద్రబాబుపై పీపుల్స్‌వార్‌ తీవ్రవాదులు క్లైమోర్‌ మైన్స్‌తో దాడికి పాల్పడిగురువారం నాటికి సరిగ్గా 23 ఏళ్ళయింది.

Alipiri: అలిపిరి ఘటనకు ఇరవై మూడేళ్ళు!
అలిపిరిలో టెంకాయలు కొట్టి శ్రీవారికి కృతజ్ఞతలు ప్రకటిస్తున్న ఆనందనాయుడు తదితరులు

తిరుపతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద సీఎం చంద్రబాబుపై పీపుల్స్‌వార్‌ తీవ్రవాదులు క్లైమోర్‌ మైన్స్‌తో దాడికి పాల్పడిగురువారం నాటికి సరిగ్గా 23 ఏళ్ళయింది. 2003 అక్టోబరు 1వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును నక్సలైట్లు ల్యాండ్‌ మైన్లతో పేల్చివేశారు. పేలుడు ధాటికి అంతెత్తున గాల్లోకి ఎగిరి కిందపడినప్పటికీ కారు బుల్లెట్‌ ప్రూఫ్‌ కావడంతో చంద్రబాబు సహా కారులో ప్రయాణిస్తుండిన నేతలకు ప్రాణాపాయం తప్పింది. ఆ సందర్భంలోనే కాకుండా ఎప్పుడు తిరుమల ప్రస్తావన వచ్చినా తాను శ్రీవారి దయతోనే బతికి బయటపడ్డానని సీఎం చంద్రబాబు తరచూ చెబుతుంటారు. అలిపిరి పేలుడు ఘటన జరిగి 23 ఏళ్ళయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించి నాటి ఘటనను గుర్తు చేసుకున్నాయి.చాలా మంది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి శ్రీవారి ఆశీస్సులతోనే అధినేత ప్రాణాపాయం నుంచీ బయటపడ్డారని, శ్రీవారి దయవల్లే 17 పర్యాయాలు శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఘటనలో రుయాస్పత్రి వద్ద చంద్రబాబు వెంట వున్న స్థానిక పార్టీ నేత అత్తులూరి ఆనందనాయుడు అప్పటి నుంచీ ఏటా ఇదే రోజున అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడంతో పాటు రుయాస్పత్రి వద్ద పేదలకు అన్నదానం చేస్తూ వస్తున్నారు. గురువారం కూడా ఆయన ఇదే ఆనవాయితీ పాటించారు. నగరంలోని పలు కూడళ్ళలో బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 02 , 2026 | 01:42 AM