Tirumala: తిరుమల ముస్తాబు
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:00 AM
హృదయాలను హత్తుకునే పుష్ప, విద్యుత్ అలంకరణలతో తిరుమల క్షేత్రం నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.
తిరుమల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): హృదయాలను హత్తుకునే పుష్ప, విద్యుత్ అలంకరణలతో తిరుమల క్షేత్రం నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణల్లో స్వల్ప మార్పులు చేర్పులు చేశారు. జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి శ్రీవారి సన్నిథి వరకు చేసిన అలంకరణలు భక్తుల మనసుదోచుతున్నాయి. వివిధ రంగులతో కూడిన సువాసన వెదజల్లె పుష్పాలను అలంకరణకు వినియోగిస్తున్నారు. శ్రీవారి ఆలయం లోపల 6 టన్నులు, వెలుపల అలంకరణలకు మరో ఆరు టన్నుల పుష్పాలు వాడుతున్నారు.దాదాపు లక్ష కట్‌ఫ్లవర్స్‌ను ధ్వజస్తంభం, బలిపీఠానికి ఆదివారం సాయంత్రంలోగా అలంకరించనున్నారు.రంగురంగుల లైట్లతో స్వామి కొండ కళకళలాడుతోంది. శనివారం సాయంత్రం వీటి పనితీరును అధికారులు పరిశీలించి చిన్నపాటి మార్పులు చేశారు.
తిరుమల ఘాట్‌రోడ్లలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ టెస్టింగ్
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఇటీవల పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్ నూతన టవర్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతం కావడంతో ఘాట్‌రోడ్లలో ప్రయాణ సమయంలో కాలినడకన వచ్చే సమయాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందక భక్తులు ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన టీటీడీ అధికారులు వివిధ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ప్రొవైడర్లతో సమీక్షలు నిర్వహించి అవసరమైన ప్రదేశాల్లో నూతన టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమల మొదటి, రెండవ ఘాట్‌రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడకమార్గాలతో కలిపి దాదాపు ఏడు ప్రాంతాల్లో నూతన టవర్లను ఏర్పాటు చేశారు. వీటిలో సిగ్నల్స్‌కు సంబంధించిన యంత్రాల అమరిక పూర్తికావడంతో శనివారం ఘాట్‌రోడ్లలో, కాలినడన మార్గాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను టెస్ట్ చేశారు. గుర్తించిన లోటుపాట్లను రికార్డు చేసి మరోవారం పదిరోజుల్లో సరిచేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.