తిరుమల కిటకిట!
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:32 AM
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గత మూడు రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయి.
3 రోజుల్లో 33 వేల వాహనాల రాక
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గత మూడు రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయి. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలతో కిక్కిరిసిపోయింది. శనివారం 12 వేలు, ఆదివారం 11 వేల వాహనాలు తిరుమల కొండెక్కాయి.
ఇక సోమవారం సాయంత్రం సమయానికి దాదాపు 10 వేల వాహనాలు వచ్చాయి. తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ మీదుగా జూపార్కు రోడ్డులోని సైన్స్ సెంటర్ వరకు వాహనాల రద్దీ కనిపించింది. ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య పెరిగిన క్రమంలో నిత్యం వాహన రద్దీ నెలకొంటోంది. రోజూ 10 వేల వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.