Share News

Nominations: మూడో విడత మొదలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:25 AM

పల్లెపోరులో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు శనివారం ఉదయం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు.

Nominations: మూడో విడత మొదలు
గుడిపాల మండలం రామభద్రాపురంలో నామినేషన్‌ను అందజేస్తున్న అభ్యర్థి

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పల్లెపోరులో భాగంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు శనివారం ఉదయం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. ఎనిమిది మండలాల పరిధిలో 182 సర్పంచ్‌, 167 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 24న పరిశీలిస్తారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆర్డీవోల వద్ద అప్పీళ్ళు, 26న అప్పీళ్ల పరిష్కారం, 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తరువాత బరిలోని అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. డిసెంబరు 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కిస్తారు. మూడో విడతలో గంగాధరనెల్లూరు డివిజన్‌లోని జీడీ నెల్లూరు, పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం, చిత్తూరు డివిజన్‌లోని చిత్తూరు, గుడిపాల మండలాల పరిధిలో జరగనున్న ఎన్నికలకు 44 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 2,64, 509 మంది ఉండగా వీరిలో మహిళలు 1,33,824 మంది, పురుషులు 1,30,685 మంది ఉన్నారు. వెదురుకుప్పం మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు తక్కువగా ఉండగా మిగిలిన ఏడు మండలాల్లో మహిళా ఓటర్లే అధికారంగా ఉన్నారు.

తొలి రోజు నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మండలం సర్పంచ్‌ వార్డు

కార్వేటినగరం 37 82

పాలసముద్రం 14 04

చిత్తూరు 33 28

గంగాధరనెల్లూరు 57 78

గుడిపాల 39 60

పెనుమూరు 21 40

ఎస్‌ఆర్‌పురం 37 28

వెదురుకుప్పం 80 49

మొత్తం 318 369

రెండో విడతలో తేలిన అభ్యర్థులు

సర్పంచ్‌కు 1336, వార్డు స్థానాలకు 3559 నామినేషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే పది మండలాల పరిధిలో గ్రామ పంచాయతీలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం సాయంత్రం ముగియగా 253 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 1662, 2280 వార్డు స్థానాలకు 3742 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల పరిశీలన శనివారం జరిగింది. అందిన పరిశీలనపై అప్పీళ్లు చేసుకునేందుకు సోమవారం వరకు ప్రభుత్వం గడువు విఽధించింది. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది.

చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు

మండలాలు సర్పంచ్‌ వార్డు

బంగారుపాళ్యం 184 708

ఐరాల 146 364

పులిచెర్ల 117 312

పూతలపట్టు 114 311

రొంపిచెర్ల 34 137

తవణంపల్లె 206 437

యాదమరి 164 320

నగరి 129 361

నిండ్ర 102 256

విజయపురం 140 353


తిరుపతి జిల్లాలో మొదటి విడత పల్లె పోరుకు తేలిన లెక్క

సర్పంచు స్థానాలకు 268మంది, వార్డు సభ్యులుగా 1,596మంది పోటీ

తిరుపతి(కలెక్టరేట్‌), నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. సర్పంచు స్థానాలకు 268 మంది, వార్డు సభ్యులుగా 1,596 మంది బరిలో నిలిచారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని 404 సర్పంచ్‌, 3,684 వార్డు స్థానాలకు ఈనెల 15న నామినేషన్ల పర్వం మొదలైంది. 136 సర్పంచ్‌, 2088 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను డీపీవో సుశీలాదేవి శనివారం ప్రకటించారు. ఈ పంచాయతీల్లో 26న ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకోసం 3,740 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,88,543 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 24న పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహిస్తారు. కాగా, 132 పంచాయతీల్లో సర్పంచ్‌ సహా అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.ఇందులో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 69, సత్యవేడు 41, కోడూరు పరిధిలో 22 ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందనున్నాయి.

రెండవ విడత స్ర్కూటినీలో వివాదాలు

రెండవ విడత కింద 19 మండలాల్లోని 373 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్‌, వార్డు పదవులకు అభ్యర్థుల నామినేషన్లను శనివారం రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించారు. చంద్రగిరి నియోజక వర్గంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అభ్యర్థుల ముఖ్యమైన పత్రాలను రిటర్నింగ్‌ అధికారులు తొలగించారని ఆరోపిస్తూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే నాని, ఆయన కుమారుడు నామినేషన్లు చించివేసిన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. ఉదయం 10.30నుంచి నిరసన దీక్ష చేపట్టారు.దీనిపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ ఆర్వోలతో మాట్లాడానని... స్ర్కూటినీ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించినట్లు తెలిపారు. స్ర్కూటినీలో తిరస్కరించబడిన నామినేషన్లపై ఆదివారం అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. చివరకు రాత్రి 7గంటలకు పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని తుమ్మలగుంటలోని వారి నివాసానికి తరలించారు. కొంతమంది ఆర్వోల పనితీరుపై జిల్లా అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Nov 22 , 2026 | 01:25 AM