సభ సక్సెస్
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:27 AM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించిన సభ విజయవంతమైంది.
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్వహించిన సభ విజయవంతమైంది. ఉదయం 11.27 నుంచి మధ్యాహ్నం 1.53 గంటల వరకు.. సుమారు రెండున్నర గంటల పాటు సభ సాగింది. ముఖ్య నేతల్లో తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (పది నిమిషాలు), మంత్రి నారా లోకేశ్ (17 నిమిషాలు), ఆపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (25 నిమిషాలు), చివరగా సీఎం చంద్రబాబు (50 నిమిషాలు) ప్రసంగించారు. వీరు కాకుండా సభకు ఆతిథ్య నియోజకవర్గ (చంద్రగిరి) ఎమ్మెల్యే హోదాలో పులివర్తి నాని, ఎంపీ హోదాలో (చిత్తూరు) దగ్గుమళ్ల ప్రసాదరావుకు వేదికపై కూర్చునే.. మాట్లాడే అవకాశం దక్కింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మూడుపార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. సభ విజయవంతం కావడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని, జేసీ గోవిందరావు, టీడీపీ నాయకులను సీఎం చంద్రబాబు అభినందించారు.
ఉదయం 9 గంటల నుంచే లబ్ధిదారుల రాక మొదలవగా.. 10గంటలకంతా నిండిపోయింది. ప్రధాన సభావేదిక ముందు 15వేలు, మరో రెండుమినీ వేదికల్లో ఐదువేల చొప్పున 25 వేలమంది ఆసీనులయ్యారు.11గంటలకల్లా సభావేదికతో పాటు చుట్టుపక్కల రోడ్లన్నీ లబ్ధిదారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో నిండిపోయాయి. 11.20 గంటలకల్లా సీటింగ్ కెపాసిటీ మించిపోవడంతో 10వేల మందికిపైగా వెనుదిరిగారు. 30వేల మందికిపైగా సభకు హాజరైనట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
రెండేళ్లలో చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివిధ ప్రభుత్వ శాఖలు 18 స్టాళ్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశాయి. వీటిని సభకు వచ్చిన ప్రజానీకం ఆసక్తిగా తిలకించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు తదితరులు స్టాళ్లను సందర్శించారు.
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్‌డీసీ రోజ్మండ్, ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలను ప్రజలకు వడ్డించారు. అనుకున్నదానికంటే పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో కాస్త తోపులాట జరిగింది.
సభ ముగిశాక సీఎం చంద్రబాబు నేరుగా బస్సులోకి వెళ్లి అందులోనే భోజనం చేశారు. మంత్రి లోకేశ్ మాత్రం ఎమ్మెల్యేలు భోజనం చేస్తున్న అన్ని టేబుళ్ల వద్దకూ వెళ్లి పలకరించారు.
సభ జరుగుతుండగా మొదలైన వర్షం.. సభ ముగిశాక కూడా జోరుగా కురిసింది. సభాప్రాంగణం మొత్తం జర్మన్ షెడ్లు వేయడంతో ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు.
శ్రీనివాసపురం దశ మార్చాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణపంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా అప్‌డేట్ చేశాం. అప్పటి వరకు పంచాయతీ రికార్డుల్లో కనిపించని అనేక ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆదాయ సామర్థ్యం రూ.75 లక్షల నుంచి రూ.1.66 కోట్లకు పెరిగింది. వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో ఇది ఒక ఉదాహరణ.
వెంకన్నతో పెట్టుకోవద్దని ఆ రోజే చెప్పా: మంత్రి నారా లోకేశ్
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై జగన్‌కు ఒక మాట చెప్పా.తిరుమల వెంకన్న చాలా పవర్ ఫుల్.. ఆయనతో పెట్టుకోవద్దు.. మాడి మసై పోతావు అని. ఆయనకు అర్థం కాలేదు. డైరెక్ట్‌గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారు. ఇంకా రప్పా రప్పా అంటున్న వాళ్లను ప్రజలే రఫ్పాడిస్తారు.
వందరోజుల్లో హంద్రీ-నీవా జలాలు
ఎన్డీయే విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు
కూటమి పాలనలో అభివృద్ధిని చూపిస్తూ
ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళాలని శ్రేణులకు పిలుపు
తిరుపతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గానికి వంద రోజుల్లో హంద్రీ-నీవా జలాలు తెచ్చాం.... ఈసారి అదే విధంగా కళ్యాణి డ్యామ్‌కు తెస్తాం... అంటూ జిల్లా ప్రజలకు తీయటి కబురందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడులో జరిగిన ఎన్డీయే రెండేళ్ళ పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంద రోజుల్లో కుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవా జలాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపుడు అదే విధంగా అడవిపల్లి రిజర్వాయర్ నుంచీ చిత్తూరు వెళ్ళే నీవా బ్రాంచి కెనాల్ నుంచీ చంద్రగిరి మండలం మూలపల్లి చెరువు మీదుగా కళ్యాణి డ్యామ్‌కు హంద్రీ-నీవా జలాలను తరలిస్తామని ప్రకటించారు. తద్వారా శ్రీశైలం మల్లన్నను తిరుమల వెంకన్నతో కలుపుతామని చమత్కరించారు. 2019-24 నడుమ గొడ్డలి పార్టీ నేతలు శ్రీవారిని అపవిత్రం చేశారని, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలను కల్తీ చేశారంటూ ఆరోపించారు. దేవుడికి అపచారం జరిగితే మనకు జరిగినట్టు కాదా అంటూ ప్రశ్నించారు. బ్రిటిష్ వారు కూడా శ్రీవారి జోలికి పోలేదని, గొడ్డలి పార్టీ దుర్మార్గులు మాత్రం దేవుడి జోలికి వెళ్ళారని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి పట్ల అపచారానికి పాల్పడితే ఎప్పుడో కాకుండా ఈ జన్మలోనే తగిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. తాను ఇతర మతాలను ద్వేషించడం లేద ని, అయితే తిరుమల పవిత్రత దెబ్బతీయడం ఒక ప్రణాళికతోనే జరిగిందని ఆరోపించారు. దేవుడికి అపచారం జరిగినపుడు పోరాడకపోతే మన జన్మకు సార్థకతే వుండదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. టీటీడీ పవిత్రతను కాపాడే శక్తి, సామర్ధ్యాలు తమకున్నాయని స్పష్టం చేశారు.
ఇక్కడే బుల్లెట్‌పై తిరిగా... ఇపుడా ఫ్యాక్టరీనే తెస్తున్నా
తిరుపతిలో చదువుకునే సమయంలో బుల్లెట్ మోటర్ సైకిల్‌పై తిరిగానని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఇపుడు అదే బుల్లెట్ మోటర్ సైకిల్‌ను తయారు చేసే ఫ్యాక్టరీనే జిల్లాకు తీసుకొస్తున్నానన్నారు. నలభై యాభై ఏళ్ళుగా పెండింగులో వున్న తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె భూముల సమస్యను పరిష్కరించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అడ్డగోలుగా జిల్లాలు విభజించిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో గత తప్పిదాలను సరిదిద్దిందన్నారు. ఇరాన్ యుద్ధం కారణంగానే ఎగుమతులు, దిగుమతులకు ఆటంకాలేర్పడ్డాయని, అందువల్లే ఈ ప్రాంతంలో అరటి, మామిడి పంటల దిగుబళ్ళకు, రొయ్యలకు ధరలు పతనమయ్యాయని సీఎం వివరించారు. యుద్ధం కారణంగా మన ఉత్పత్తుల ధరలు పతనం కాగా అదే సమయంలో దిగుమతులైన వంట గ్యాస్, పెట్రోలు, డీజల్ ధరలు పెరిగాయన్నారు. జిల్లాలో ఎన్డీయే కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. గత రెండేళ్ళలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకుని కాలర్ ఎగరేస్తూ ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళాలని సూచించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి గడపా ఎక్కి ప్రజలకు వివరించాలని కోరారు.