Collector: మాంసం మాఫియాపై కలెక్టర్ సీరియస్
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:40 AM
తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు.
తిరుపతి సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు. పీపీ చావడి మటన్ మార్కెట్ అక్రమాలపై ఆరా తీశారు. అంతటి దారుణ పరిస్థితులుంటే బాధ్యులపై ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఆధారాలతో కేసు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. నిరంతర తనిఖీలు చేపట్టక పోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా పీపీ చావడిలో మాంసం కార్యకలాపాలు లేకుండా చర్యలు ఉపక్రమించే యోచనలో కలెక్టర్ ఉన్నట్టు సమాచారం. ఇదివరకే మార్కెట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.మద్దిలేటి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా నగరపాలక సంస్థ నుంచి కూడా కలెక్టర్ నివేదిక అడిగారు. ఆమేరకు మార్కెట్‌పై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అది రెండు వారాల సరుకు!
‘ప్రతి గురువారం చెన్నై, హైదరాబాద్ నుంచి పొట్టేలు, మేకపోతుల తలకాయలు, కాళ్లు ఇతర అవయవాలను తిరుపతికి తీసుకొస్తాం. పీపీ చావడి మార్కెట్‌లోని 5 షాపుల్లో ఉండే ఫ్రీజర్‌లో నిల్వ ఉంచుతాం. ఇక్కడి నుంచి స్థానిక హోటల్స్, మటన్ షాపులకు అందజేస్తాం. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తనిఖీకి ముందు బక్రీద్ పండుగ రావడంతో గతనెల 28న ఎక్కువ స్టాకు రావడం, సకాలంలో అమ్ముడుపోక ఫ్రీజర్‌లోనే ఉండి గడ్డకట్టిపోయింది. ఈనెల 12న అధికారుల తనిఖీలో అవే బయటపడ్డాయి. ఇకనుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వ్యాపారం చేయం. మమ్మల్ని క్షమించి మటన్ మార్కెట్‌ను తెరిచి మాకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాం’ అని పీపీ చావడి మార్కెట్ వ్యాపారులు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అధికారుల తనిఖీలు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని లీలామహల్ సర్కిల్ సమీపంలో ఉన్న జంతు వధశాలను తనిఖీ చేశారు. పీపీ చావడి మార్కెట్ మూసివేయడంతో ఇక్కడ రద్దీ పెరగడాన్ని అధికారులు గుర్తించారు. పరిశుభ్రత పాటించాలని, మున్సిపల్ వెటర్నరీ ఆఫీసర్ ధ్రువీకరించిన మాంసాన్ని మాత్రమే విక్రయానికి పెట్టాలని ఆదేశించారు.