Share News

Nara Bhuvaneswari: ఆత్మవిశ్వాసమే స్త్రీ అభివృద్ధికి తొలిమెట్టు

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:59 AM

మనం ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే.. అదే మీ అభివృద్ధికి తొలిమెట్టు అని మహిళలను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.

Nara Bhuvaneswari: ఆత్మవిశ్వాసమే స్త్రీ అభివృద్ధికి తొలిమెట్టు
మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న భువనేశ్వరి

కుప్పం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మనం ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే.. అదే మీ అభివృద్ధికి తొలిమెట్టు అని మహిళలను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తన పర్యటనలో నాలుగో రోజైన గురువారం కుప్పంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన ఎన్టీఆర్‌ ట్రస్టు సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, హియరింగ్‌ ఎయిడ్స్‌, మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కుప్పం ప్రజల ప్రేమ, నమ్మకం, అభిమానం తమ కుటుంబానికి అసలైన బలమన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగా కుప్పం మహిళలకు ఏదో చేయాలన్న తపన నుంచే ఇక్కడ ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడమని గుర్తుచేశారు. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను హైదరాబాదులోని స్త్రీ హస్తకళా స్టోర్‌కు తీసుకెళ్లి అమ్మి, వచ్చిన లాభాలను తిరిగి స్త్రీలకే ఇస్తున్నామని వివరించారు. తానూ క్రమేణా అన్ని విషయాలు నేర్చుకుంటూ నేడు ట్రస్టు ద్వారా, అటు వ్యాపారవేత్తగా విజయవంతమయ్యాయన్నారు. ఇలాగే, మహిళలు కూడా అవకాశాలను అందిపుచ్చుకుని తెలియనివి నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మగాళ్లు బయటి పనులు మాత్రమే చేయగలరని.. అదే మహిళలు ఇంట సంసారాన్ని దిద్దుకుంటూనే, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనూ విజయం సాధించగలరని ఆత్మవిశ్వాసం రగిలించారు. తలసీమియా బాధితులకు రక్తదానం చేయడం, చల్లపల్లి స్కూల్‌లో అనాథలైన పేద పిల్లలకు చదువుతోపాటు సకల వసతులూ కల్పించడం వంటి సేవాకార్యక్రమాలు తనకు సంతృప్తి ఇస్తాయని భువనేశ్వరి వెల్లడించారు. అంతకుముందు 29 ఏళ్ల ట్రస్టు ప్రస్థానంలో చేసిన సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈవో రాజేంద్ర కుమార్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు, మహిళలు, ట్రస్టు లబ్ధిదారులు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకు న్న, తీసుకుంటున్న మహిళా సభ్యులు పాల్గొన్నారు.


స్వరం పెంచినా ప్రేమనే కురిసింది!: ముగిసిన భువనమ్మ పర్యటన

ఆవేదన - అమ్మతనం.. ఆందోళన - ఆక్రోశం.. ఉద్బోధ - ఉక్రోషం, కోపోద్రేకం - ప్రేమతత్వం.. లాలన - పాలన.. ఎన్నేసి కోణాలని. ఎక్కడికి వెళ్తే అక్కడి వారితో కలిసిపోయారు. ఎవరికేం మాటలు చెప్పాలో అవే అన్నారు. ఎన్నడూ లేనిది చమత్కారాలు కూడా విసిరారు. ఒక్కోసారి భాస్వరంలా మండి స్వరం పెంచినా, చిట్టచివరకు ప్రేమామృతమై కురిశారు. ఆమె నారా భువనేశ్వరి. సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ.

నారా భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం పర్యటన గురువారంతో ముగిసింది. రామకుప్పం మండలం మారుమూల తండాలనుంచి ప్రారంభమైన ఆమె పర్యటన, గుడుపల్లె మండలం మీదుగా సాగి, కుప్పం మండలం, పురపాలక సంఘం చేరి, సేవా కార్యక్రమాలతో ముగిసింది. ఈసారి ఆమె స్వరం మారింది. చమత్కారం నేర్చారు. ఆవేదనతో రగిలి పొగిలినా.. ఆక్రోశంలోంచి ఆవేశమే పైపైకి ఎగసింది. పేరుకే మమిళలతో ముఖాముఖి సమావేశాలు కానీ.. ఆ సమావేశాలను మహిళలకే పరిమితం చేయలేదు. ప్రతిపక్షంపై విమర్శలు, మగాళ్లపై చమత్కారాలు, కార్యకర్తలకు భరోసాలు, నాయకులకు హెచ్చరికలుగా విభిన్న రీతుల్లో సాగాయి. విభిన్న కోణాలను స్పశిస్తూ.. భువనేశ్వరిలోని విశ్వరూపాన్ని బయటకు తెచ్చాయి.

మొదట బిడియంగా మొదలై

తొలుత వైసీపీ హయాంలో 2023లో చంద్రబాబు అక్రమ నిర్బంధంలో ఉన్న సమయంలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ కుప్పం వచ్చారు. అప్పట్లో బిడియంగా, సంకోచంగా ఉండేదామె మాట. ఆ తర్వాత చాలాసార్లు కుప్పం పర్యటనలకు వచ్చినా పడికట్టు పదాలతో, దాదాపు ఒకటేరకమైన స్ర్కిప్ట్‌తో ప్రసంగాలు సాగేవి. కేవలం మహిళలతో ముఖాముఖి సమావేశాల్లోనే ఎక్కువగా పాల్గొనేవారు. వారితో మమేకమే, వారికి సంబంధించిన అంశాలకే పరిమితమయ్యేవారు. ఒకట్రెండు సార్లు పార్టీ కేడర్‌తో సమావేశమైనా.. సంభాషణల్లో ఎక్కువగా రాజకీయం దొర్లేది కాదు. ఇక, ఆమె వేదిక వద్దకు రాకముందు.. వచ్చాక స్థానిక సీనియర్‌ నాయకులు ప్రంసగాలతో హోరెత్తించేవారు. చివరగా భువనేశ్వరి ముక్తసరిగా మాట్లాడేవారు.

పెరిగిన చొరవ, స్వరం

ఇప్పటి పర్యటన మాత్రం దానికి భిన్నంగా సాగింది. ఎక్కువగా మహిళలతో ముఖాముఖి సమావేశాల్లోనే పాల్గొన్నా, విద్యార్థులతోనూ మమేకమయ్యారు. మహిళల్లో చైతన్యం కలిగించడంతో పాటు ప్రతిపక్షంపై విమర్శ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టం, నారా లోకేశ్‌ నాయకత్వ ప్రతిభ, కార్యకర్తల ప్రాముఖ్యత, నాయకుల జవాబుదారీతనం వంటి పలు అంశాలమీదుగా ఆమె ప్రసంగాలు సాగాయి. బుజ్జగిస్తూ, హెచ్చరిస్తూ.. ఉద్బోధిస్తూ.. స్ఫూర్తినిస్తూ.. దిశానిర్దేశం చేస్తూ ఆ మాట పదును తేలింది. మరోవైపు జెన్‌జీ ఉధృతమైన ఈ కాలంలో జెన్‌జీ, జెన్‌ అల్ఫా తరంతోనూ ఆమె మమేకమయ్యారు. అమ్మలా లాలిస్తూ, ఉపాధ్యాయురాలిగా బోధిస్తూ.. కౌన్సిలర్‌లా వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతూ వారిని ఆకట్టుకున్నారు.

వెలికి వచ్చిన గుండెల్లోని ఆవేదన

నారా భువనేశ్వరి గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన ఈ పర్యటనలో వెలికి వచ్చింది. మంగళవారం సాయంత్రం గుడుపల్లె మండలం యామగానిపల్లెలోని ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయ సందర్శించారు. ద్రౌపదీ దేవిని చూడగానే ఆమెకు తాను, తన భర్త, కుటుంబం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడిన కష్టాలు, పొందిన అవమానాలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. పాండవులను ఏమీ చేయలేక కౌరవ సభలో ద్రౌపదిని కౌరవులు అవమానించినట్లుగానే వైసీపీ హయాంలో.. అసెంబ్లీలో నాటి పాలకులు తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని గుర్తు చేసుకున్నారు. నాడు ద్రౌపదిని దేవుడిలా కృష్ణుడు ఆదుకుంటే.. తమ కుటుంబానికి ప్రజలే దేవుళ్లుగా అండగా నిలిచారని భావోద్వేగంగా అన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 01:59 AM