Share News

Elections: ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:29 AM

జిల్లాలోని 35 మండల పరిషత్‌లకు 19వ తేది, జిల్లా పరిషత్‌కు 20న నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కో ఆప్షన్‌ సభ్యుల పదవులకు ఎన్నికల నోటిఫికేషన్‌ మంగళవారం జారీ అయింది.

Elections: ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

తిరుపతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 35 మండల పరిషత్‌లకు 19వ తేది, జిల్లా పరిషత్‌కు 20న నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కో ఆప్షన్‌ సభ్యుల పదవులకు ఎన్నికల నోటిఫికేషన్‌ మంగళవారం జారీ అయింది. ఈనెల 14వ తేదీ లోపు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్‌ ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులకు, జడ్పీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఎంపీటీసీ సభ్యులకు ఈనెల 19వ తేదీన, జడ్పీటీసీ సభ్యులకు ఈనెల 20న ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నటు,ఆ సమావేశాలకు సభ్యులు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంటారు.

19న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

జిల్లావ్యాప్తంగా ఈనెల 19వ తేదీన 35 మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల్లోపు కో ఆప్షన్‌, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు నామినేషన్లు దాఖలు చేయాల్సి వుంటుంది. 10 గంటల నుంచీ 12 గంటల నడుమ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 12 గంటలకు పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మండల పరిషత్‌లో కోఆప్షన్‌ మెంబరు పదవి ఒకటి మాత్రమే వుంటుంది. దానికి మతపరమైన లేదా భాషాపరమైన అల్ప సంఖ్యాకవర్గాల నుంచీ మాత్రమే ఎన్నుకోవాల్సి వుంటుంది. మధ్యాహ్నం ఒక గంటకు ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కో ఆప్షన్‌ మెంబరు ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తారు. కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికకు, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు సమావేశాలు జరగాలంటే తప్పనిసరిగా కోరమ్‌ వుండాలి. అది ఆయా మండల పరిషత్‌లలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యను బట్టి వుంటుంది. కోరమ్‌కు తగినంతమంది ఎంపీటీసీలు హాజరు కానిపక్షంలో సమావేశాలు నిర్వహించరు. ఏదైనా కారణాలతో కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరగని పక్షంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు కూడా నిర్వహించరు. కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరిగి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు ఆగిపోయిన పక్షంలో మరుసటి రోజు అంటే 20వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.


20న జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు

ఈనెల 20వ తేదీన చంద్రగిరిలోని జడ్పీ కార్యాలయంలో గానీ లేదా కలెక్టర్‌ నిర్ణయించే మరేదైనా ప్రదేశంలో గానీ జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, కో ఆప్షన్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీలో కో ఆప్షన్‌ సభ్యుల పదవులు రెండు వుంటాయి.ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ ఎన్నికలకు అనుసరించే సమయాలను, నిబంధనలను యధాతధంగా జిల్లా పరిషత్‌లో కూడా అనుసరిస్తారు.తొలుత 35మంది జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆపై రెండు కో ఆప్షన్‌ సభ్యుల పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు.

Updated Date - Nov 11 , 2026 | 12:29 AM