Share News

NEET: నీట్‌గా పరీక్ష

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:44 AM

చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

NEET: నీట్‌గా పరీక్ష
చిత్తూరు, తిరుపతిలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తనిఖీలు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): చిత్తూరులోని మూడు కేంద్రాల్లో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎ్‌స వంటి మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నేషనల్‌ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) ను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు, దివ్యాంగులైన వారికి 6.20 గంటల వరకు నిర్వహించారు. ఉదయం 10 గంటలకే విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకోగా, 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్షుణ్నంగా తనిఖీలు చేసి, కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థినుల హెయిర్‌ క్లిప్పులు, ఆభరణాలు, చేయి, కాలికి కట్టిన దారాలు తీసేసి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 463 మందికి 409 మంది.. సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 264కి 232 మంది.. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో 384కి 337 మంది హాజరయ్యారు. మొత్తమ్మీద 1111 మందికిగాను 978 మంది పరీక్ష రాయగా, 133 మంది గైర్హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్‌ జీవనజ్యోతి తెలిపారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యుత్‌కు ఎంలాంటి అంతరాయం లేకుండా ఆయా సెంటర్లలో జనరేటర్లు ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారు.

తిరుపతిలో 89.97శాతం హాజరు

తిరుపతి రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో తిరుపతి కేంద్రంగా నిర్వహించిన నీట్‌(యూజీ) రీఎగ్జామ్‌ ప్రశాంతంగా జరిగింది. తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 4556మంది విద్యార్థులకుగాను 4099మంది హాజరయ్యారు. 457మంది గైర్హాజరయ్యారు. దీంతో 89.97శాతం హాజరు నమోదైందని నిర్వాహకులు పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్‌ పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తనిఖీ చేశారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.


విద్యార్థుల టాక్‌ ఇలా

మేనెలలో నిర్వహించిన నీట్‌ పేపర్‌తో పోల్చుకుంటే ఆదివారం జరిగిన పునఃపరీక్షా ప్రశ్నపత్రం క్లిష్టంగా ఉందని విద్యార్థి, అధ్యాపక వర్గాలు చర్చించుకుంటున్నారు. ఫిజిక్స్‌ టఫ్‌గా, బయాలజీ ఈజీగా, కెమిస్ర్టీ మోడరేట్‌ టు డిఫికల్టీ లెవల్‌లో ఉందని అంటున్నారు.

14 గంటలపాటు పోలీసుల నిఘా

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): నీట్‌ రీఎగ్జామ్‌ కావడంతో ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 14 గంటలపాటు నిఘా ఉంచారు. ఏఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, ట్రాఫిక్‌ డీఎస్పీ కొండయ్యనాయుడు, ఏఆర్‌ డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 10 సీఐలు, ఓ రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌, 11 మంది ఎస్‌ఐలు, మూడు గార్డ్‌ పార్టీలు, మూడు మొబైల్‌ పార్టీలు, 5 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మరో 100 మంది పోలీసు సిబ్బందితోపాటు మొత్తం 150 మంది పోలీసు సిబ్బంది, అధికారులను రంగంలోకి దించారు. ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భద్రతా విధులు నిర్వహించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 01:44 AM