Share News

Municipal election: ముగిసిన పుర ప్రచారం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:38 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం పోలింగ్‌ నిర్వహిస్తుండగా, అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Municipal election: ముగిసిన పుర ప్రచారం
నగరిలో శుక్రవారం కూటమి పార్టీలు నిర్వహించిన బైకు ర్యాలీ

చిత్తూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదివారం పోలింగ్‌ నిర్వహిస్తుండగా, అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అక్టోబరు 21న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలిన అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. 22వ తేదీ నుంచి అభ్యర్థులు వారి పరిధుల్లో ప్రచారాల్ని మొదలుపెట్టి.. 30వ తేదీతో ముగించారు. అంటే 9 రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ తక్కువ సమయంలో చాలాచోట్ల అభ్యర్థులు ఇంటింటికి వెళ్లలేకపోయారు. ఆయా ప్రాంతాల్లో జనసమీకరణ చేసి సమావేశాలు పెట్టారు. ఎన్నికల సంఘం పోలింగ్‌ తేదీని అక్టోబరు 28 నుంచి నవంబరు ఒకటికి మార్చడంతో అభ్యర్థులకు 9 రోజుల సమయం లభించింది లేదంటే 5 రోజులతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది.

చిత్తూరులో కూటమి అభ్యర్థి ముందంజ

చిత్తూరులో వైసీపీ మేయర్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ కంటే కూ టమి అభ్యర్థి హేమలత ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఆమెకు తోడుగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, దొరబాబు, సీఆర్‌రాజన్‌, కాజూరు బాలాజీ, అముద, రాజే్‌షకుమార్‌రెడ్డి, మద్దిపట్ల ఈశ్వర్‌రావు, వరుణ్‌కుమార్‌ తదితరులు నిత్యం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జోనల్‌ కోఆర్డినేటర్‌ దామచర్ల సత్య కూడా ఓ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. బరిలో ఉన్న 9 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఏకగ్రీవమైన 50 మంది కూటమి కార్పొరేటర్లు కూడా వారి డివిజన్లలో మేయర్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌ వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానందరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు.

నగరిలో తాయిలాలకు సిద్ధం

నగరిమున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయగా, మాజీమంత్రి రోజా 10 వార్డుల్లో మాత్రమే ప్రచారం చేశారు. శుక్రవారం నగరిలో జరిగిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే భానుప్రకాష్‌ పాల్గొన్నారు. ఇక్కడ ఇప్పటికే మున్సిపల్‌ చైర్మన్‌ ఏకగ్రీవమవగా, మిగిలిన 36 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇరు పార్టీలూ ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

కుప్పం ప్రచారంలో టీడీపీ ముందంజ

కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ పెద్దగా ప్రచారం చేయలేదు. కేవలం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ మాత్రమే ప్రచారం చేసుకోగా, కౌన్సిలర్లు పెద్దగా పాల్గొనలేదు. ప్రచారంలో టీడీపీ ముందంజలో ఉండగా, అభ్యర్థి రాజ్‌కుమార్‌తో పాటు పీఎస్‌ మునిరత్నం, కంచర్ల శ్రీకాంత్‌, డాక్టర్‌ సురేష్‌ పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో గ్రామసభల్ని నిర్వహించడం, కుల సంఘాలతో సమావేశాల్ని ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల్ని చేశారు. ఏకగ్రీవాల తర్వాత 19 వార్డుల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ ఓటర్లకు ఏ పార్టీ ఎంత పంపిణీ చేస్తోందనే చర్చ లేదు.


పలమనేరు టీడీపీకి ప్రతిష్టాత్మకం

పలమనేరు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇది నాలుగో ఎన్నిక. గత మూడుసార్లు టీడీపీ ఇక్కడ విజయం సాధించలేదు. దీంతో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దగ్గరుండి ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అయ్యాక సొంత నియోజకవర్గంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా గట్టిగా ప్రచారం చేశారు. ఇప్పటికే 6 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం కాగా, 30 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా ఏ పార్టీ ఎంత పంపిణీ చేయనుందనే చర్చ లేదు.

టీడీపీనుంచి ఇందిరమ్మ సస్పెన్షన్‌

చిత్తూరు/పాలసముద్రం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పాలసముద్రం మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్‌ నేత ఇందిరమ్మ, ఆమె కుమార్తె శీరిషను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రెబల్‌గా బరిలో ఉన్న వారి పట్ల టీడీపీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధిష్ఠానం సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మతో పాటు ఆమె కుమార్తె శిరీష పాలసముద్రం జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశారు. అధిష్ఠానం మాత్రం భీమినేని చిట్టిబాబు కుమార్తె జాహ్నవికు బీఫాం ఇచ్చింది. దీంతో ఇందిరమ్మ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. కుమార్తె శిరీష మాత్రం బరిలో ఉన్నారు. జడ్పీటీసీ స్థానంతో పాటు అదే మండలంలోని వెంగళరాజకుప్పం ఎంపీటీసీ స్థానానికీ నామినేషన్‌ వేసి ప్రచారం చేస్తున్నారు. కుమార్తెకు మద్దతుగా ఇందిరమ్మ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, ఇందిరమ్మ తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలిగా, 20 ఏళ్ల కిందట పాలసముద్రం ఎంపీపీగా పనిచేశారు. కొన్నాళ్ల పాటు వైసీపీలోకి వెళ్లిన ఆమె 2024 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరారు.

Updated Date - Oct 31 , 2026 | 02:38 AM