Share News

బాబాయ్ నిజం ఒప్పుకున్నాడు.. అబ్బాయ్ ఎప్పుడు?: ఎంపీ అప్పల నాయుడు

ABN , Publish Date - Feb 08 , 2026 | 08:57 PM

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విరుచుకుపడ్డారు.CFTRI రిపోర్టును తొక్కిపెట్టింది నిజం కాదా?భోలేబాబా డెయిరీకి కొమ్ముకాసింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

బాబాయ్ నిజం ఒప్పుకున్నాడు.. అబ్బాయ్ ఎప్పుడు?: ఎంపీ అప్పల నాయుడు
MP Appala Naidu on Tirumala laddu controversy

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెయ్యి కల్తీ జరిగిందని ఇప్పటికైనా వైవీ సుబ్బారెడ్డి అంగీకరించడం సంతోషకరమని, అయితే ఆయన చెబుతున్న కుంటి సాకులు విడ్డూరంగా ఉన్నాయని ఆయన ఇవాళ ఢిల్లీలో విమర్శించారు.

నిజాలు ఒప్పుకున్న బాబాయ్.. జగన్ సమాధానం చెప్పాలి

ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన ఎంపీ అప్పలనాయుడు, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై పలు ప్రశ్నలు సంధించారు. 'బాబాయ్ నిజాలు ఒప్పుకున్నారు, మరి అబ్బాయ్ (జగన్) ఇప్పుడేమంటారు? తప్పు జరిగిన మాట వాస్తవం కాబట్టి జగన్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని అప్పల నాయుడు డిమాండ్ చేశారు. సీఎఫ్‌టీఆర్‌ఐ (CFTRI)కి నెయ్యి శాంపిళ్లు పంపినట్లు అంగీకరించిన సుబ్బారెడ్డి, దాని రిపోర్టు గురించి తనకు తెలియదనడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఆ నివేదికను సుబ్బారెడ్డి కావాలనే తొక్కిపెట్టారని ఆరోపించారు.


నకిలీ నెయ్యి వెనుక అసలు నిజం ఇదే..

నిబంధనలు సడలించి నాణ్యత పెంచామన్న సుబ్బారెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎంపీ ఎద్దేవా చేశారు. 'నిబంధనలు సడలించబట్టే కదా.. భోలేబాబా డెయిరీ లక్షల కిలోల నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది! దీనికి సుబ్బారెడ్డి ఏం సమాధానం చెబుతారు?' అని ఎంపీ ప్రశ్నించారు.

మహా అపచారానికి పశ్చాత్తాపం లేదా?

శ్రీవారి లడ్డూ విషయంలో ఇంతటి మహా అపచారం జరిగినా, పశ్చాత్తాపం లేకుండా వైవీ సుబ్బారెడ్డి ఇంకా బుకాయిస్తుండటం విస్మయానికి గురి చేస్తోందని ఎంపీ అప్పల నాయుడు అన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ చెబుతున్న చిలకపలుకులను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని, దోషులు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని అప్పలనాయుడు తేల్చిచెప్పారు.


ఇవి కూడా చదవండి..

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

Updated Date - Feb 08 , 2026 | 09:01 PM