Accident: డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:43 AM
ట్రావెల్స్ బస్సు వేగంగా వెళుతోంది. అర్ధరాత్రి దాటడంతో ప్రయాణికులంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇంతలో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డుపై ఆపి.. క్లీనర్, మరో డ్రైవర్‌ను నిద్రలేపాడు. ముగ్గురూ కలిసి ప్రయాణికులను బస్సు నుంచి దింపేశారు. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగసిపడి బస్సు దగ్ధమైంది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, బస్సు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
వెంటనే అగ్నికీలలు చెలరేగి దగ్ధమైన వాహనం
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
ఓజిలి, ఆంధ్రజ్యోతి: విజయవాడకు సమీపంలోని రేపల్లె నుంచి కామాక్షి ట్రావెల్స్ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 19 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయల్దేరింది. మార్గమధ్యంలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓజిలి మండలం రాచపాళెం రోడ్డు దాటి ఓజిలి చెరువు కల్వర్టు వద్దకొచ్చేసరికి బస్సు నుంచి కాలిన వాసన, పొగలు రావడాన్ని డ్రైవర్ తిరుపతయ్య గమనించాడు. వెంటనే బస్సును రోడ్డుపై ఆపేశాడు. అప్పటికే సమయం అర్ధరాత్రి దాటేసి 1.42 గంటలవుతోంది. ప్రయాణికులు, మరో డ్రైవర్ జేడీ ప్రేమ్, క్లీనర్ గోపీకృష్ణ గాఢ నిద్రలో ఉన్నారు. అప్రమత్తమైన తిరుపతయ్య.. క్లీనర్, మరో డ్రైవర్ సాయంతో ప్రయాణికులను నిద్రలేపి బస్సుకు ముందూ వెనకా ఉన్న రెండు డోర్ల నుంచి దింపేశారు. ఆ వెంటనే మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. కొంతసేపటికి డీజిల్ ట్యాంక్ పేలిపోయి దానికున్న ఇనుప రేకు డివైడర్ మధ్యలోకి ఎగిరిపడింది. మంటల ధాటికి డివైడర్‌పై ఉన్న మొక్కలూ మాడిపోయాయి.
ఆందోళనకు గురైన ప్రయాణికులు
నిమిషాల వ్యవధిలోనే బస్సు దగ్ధమవడం.. బస్సు సిబ్బంది ఏమరుపాటుగా ఉంటే తమ పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా బస్సులోని పి.సుశీల (63), టెకీలు సల్మా (28), స్వీటీ (28)ల్లో భయాందోళనకు గురవడంతో పోలీసులు ధైర్యం చెప్పడంతో తేరుకున్నారు. అనంతరం ప్రయాణికులందరినీ వేరే ట్రావెల్స్ బస్సుల్లో గమ్యస్థానాలకు సిబ్బంది పంపించారు.
సహాయక చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
సమాచారం తెలియగానే ఓజిలి ఎస్‌ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఓవైపు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సును ఇంకొంతసేపు నడిపి ఉంటే..
బస్సును ఇంకొంతసేపు నడిపి ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగి ఉండేది. ప్రయాణికులతోపాటు సిబ్బంది కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉండేది కాదని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఏదేమైనా ట్రావెల్స్ బస్సులు తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్న నేపఽథ్యంలో సంబంధిత శాఖల అధికారులు బస్సుల కండీషన్‌పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.