Share News

Local elections: ‘స్థానిక’ ఎన్నికల సందడి ప్రారంభం

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:42 AM

స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. గత వైసీపీ హయాంలో జరిగిన ఎన్నికలు జిల్లా ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన నేపథ్యంలో వాటిని చెరిపివేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు జరిపించేందుకు యంత్రాంగం సంసిద్ధమవుతోంది.

Local elections: ‘స్థానిక’ ఎన్నికల సందడి ప్రారంభం

-రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల నిరీక్షణ

-220మున్సిపల్‌, 8654 పీఆర్‌ పదవులకు ఎన్నికలు

తిరుపతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. గత వైసీపీ హయాంలో జరిగిన ఎన్నికలు జిల్లా ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన నేపథ్యంలో వాటిని చెరిపివేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు జరిపించేందుకు యంత్రాంగం సంసిద్ధమవుతోంది.అప్పట్లో ప్రతిపక్షమంటే ప్రధానంగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేకుండా చేయడం కోసం వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుపడ్డారు. దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేశారు. కొన్ని చోట్ల కిడ్నా్‌పలకు కూడా తెగబడ్డారు. వీటిని అధిగమించి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన చోట తప్పుడు సంతకాలతో వాటిని విత్‌డ్రా చేయించారు. రెవిన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు యంత్రాంగాలను యధేచ్చగా దుర్వినియోగం చేశారు. ఈ మార్గాల్లో దాదాపుగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవులను బలవంతపు ఏకగ్రీవాలతో సాధించుకున్నారు. ఈ అవాంఛనీయ పరిణామాలను అడ్డుకునేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల అఽధికారి యత్నించినా చర్యలు ఆచరణ రూపం దాల్చలేదు. అప్పటి కలెక్టర్‌, ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, పుంగనూరు సీఐ వంటి వారిపై బదిలీ వేటు వేసినా అమలు కాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటి ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి.ఈసారి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. దాని ప్రభావం రాష్ట్రస్థాయి నుంచీ జిల్లా స్థాయి వరకూ స్పష్టంగా కన్పిస్తోంది.ఎన్నడూ జరగని రీతిలో డీజీపీ జిల్లాలకు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. శుక్రవారం తిరుపతి వచ్చి రాయలసీమ జిల్లాల అధికారులతో సమీక్షించి వెళ్ళారు. బలవంతపు ఏకగ్రీవాలు జరగకూడదని విస్పష్టమైన ఆదేశాలిచ్చి వెళ్ళారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు తరచూ జిల్లాకు వచ్చి సమీక్షించి వెళుతున్నారు. కలెక్టర్‌ సైతం ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే తాజాగా రిజర్వేషన్ల విషయమై కసరత్తు చేస్తున్నారు.

రాజకీయ పార్టీల హడావిడి

ఇప్పటి వరకూ పెండింగులో వున్న బీసీ రిజర్వేషన్ల శాతాన్ని కూడా మంత్రివర్గం ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపిన నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావిడి మరింత పెరిగింది. ఇప్పటికే కూటమి పార్టీలు అంతర్గతంగా సమన్వయం కోసం జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. జనసేన పార్టీ మరో అడుగు ముందుకేసి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసింది. దీనికి తోడు మూడు పార్టీల నడుమ సమన్వయం కోసం కూడా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ సైతం బలవంతపు ఏకగ్రీవాలను అంగకరించేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో పోటీ పెడతామని పోటాపోటీగా ప్రకటిస్తోంది. ఆ పార్టీ నేతలు జిల్లాస్థాయిలో తరచూ సమావేశమై సమీక్షించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం చాటుకునేందుకు కూటమి పార్టీల నేతలు, ఉనికి కాపాడుకునేందుకు వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు. దీంతో రాజకీయంగా జిల్లా కేంద్రం నుంచీ పంచాయతీ కేంద్రం వరకూ హడావిడి పెరుగుతోంది.


స్థానిక సంస్థల పదవులివే!

స్థానిక సంస్థలకు సంబంధించి తొలుత పట్టణ, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండవ దశలో పంచాయతీరాజ్‌కు సంబంధించి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీలకు జరుగుతాయి. మున్సిపల్‌ విభాగం విషయానికొస్తే.....తిరుపతి నగర కార్పొరేషన్‌లో ఇదివరకూ 50 డివిజన్లు వుండేవి. ఇపుడు వాటి సంఖ్య 66కు పెరిగింది. పుత్తూరు మున్సిపాలిటీలో 27 వార్డులు 36కు,శ్రీకాళహస్తిలో 35వార్డులు 44కు పెరిగాయి.నాయుడుపేట, సూళ్ళూరుపేట మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య 25 నుంచీ 32కి చేరాయి. వెంకటగిరిలో వుండిన 25 వార్డులు ప్రస్తుతం 36కి పెరిగాయి. మొత్తం మీద జిల్లాలో తిరుపతి మేయర్‌, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు, వెంకటగిరి మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్‌ పదవులతో పాటు 214 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఒక మేయర్‌, ఐదు మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ పదవులు, 66 కార్పొరేటర్‌ పదవులు, 148 కౌన్సిలర్‌ పదవులున్నాయి.పంచాయతీరాజ్‌ విభాగంలో.... తిరుపతి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 36 మండలాలకు గానూ తిరుపతి అర్బన్‌ మండలాన్ని మినహాయిస్తే 35 మండలాల్లో 444 ఎంపీటీసీ పదవులకు, 35 జడ్పీటీసీ పదవులకు, 35 ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరగాల్సి వుంది.807 గ్రామ పంచాయతీలుండగా కోర్టు వివాదాల వల్ల 16 పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 791 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి వుంది. అంటే 791 సర్పంచ్‌ పదవులకు, 7348 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ కలిపితే పంచాయతీరాజ్‌ విభాగంలో జిల్లాలో 8654 పదవులకు ఎన్నికలు జరగాల్సి వుంది.

Updated Date - Oct 11 , 2026 | 12:42 AM