Share News

Elections: ‘స్థానిక’ ఎన్నికల సందడి ప్రారంభం

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:29 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

Elections: ‘స్థానిక’ ఎన్నికల సందడి ప్రారంభం

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఓటరు జాబితా కూర్పు, రాజకీయ పక్షాలతో సమావేశాలు, పోలింగ్‌ కేంద్రాల పరిశీలన, అవసరమైన సామగ్రి సమకూర్చుతున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ... రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు తీర్పు స్పష్టత ఇవ్వడంతో ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల విభాగం వేగం పెంచింది. కీలకమైన 22 ఎన్నికల అంశాలపై 44 మంది జిల్లా అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా కలెక్టర్‌ నియమించారు. మరోవైపు అధికారులు వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

నేటి లోగా నివేదిక

ఎన్నికల విధుల నిర్వహణకు 98 ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలను జిల్లా ఎన్నికల విభాగం, కలెక్టరేట్‌ అధికారులు సేకరిస్తోంది. ఆయా శాఖల ఉద్యోగులు, వారి హోదా వివరాలను 30 ప్రశ్నావళి ఫార్మేట్‌లో పూరించి పంపాలని ఆదేశించింది. దాంతో అన్ని శాఖల జిల్లా అధికారులు సమాచారాన్ని ఆదివారంలోగా నివేదించడంలో సిద్ధమయ్యారు. అధికారులను పర్యవేక్షణ, రిటర్నింగ్‌ అధికారులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులను ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (ఏపీవో), ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపివో)లుగా నియమించనున్నారు సుమారు ఐదు వేల పోలింగ్‌ కేంద్రాలకు (రిజర్వ్‌ కలిపి) 30 వేల మంది ఉద్యోగులు అవసరం అవుతారని అంచనా. విద్యుత్‌, వైద్య ఆరోగ్యశాఖ, ఐ్క్షపీఆర్‌ తదితర శాఖల ఉద్యోగులు తప్ప మిగిలిన శాఖల ఉద్యోగులను ఎన్నికల నిర్వహణకు వినియోగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి ముందస్తుగా పనులు చేస్తున్నారు. మొదట నగరపాలక సంస్థల మేయర్‌, డివిజన్‌ కార్పొరేటర్ల స్థానాలకు అధికారపూర్వకంగా రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారుచేస్తూ గెజిట్‌ విడుదల చేయాల్సింది. ఆ తరువాత ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌, ఎంపీపీ పదవులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, గ్రామపంచాయతీకి సంబంధించి సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది.

Updated Date - Oct 11 , 2026 | 12:29 AM