Mango farmer: మామిడి రైతు గోడు విన్పించుకోండి!
ABN , Publish Date - Jul 01 , 2026 | 02:05 AM
ముఖ్యమంత్రి గారూ... మా గోడు వినిపించుకోండంటూ జిల్లాలోని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రోత్సాహక ధర ప్రకటించినా ఫలితం కనిపించడం లేదంటూ వాపోతున్నారు.
ఎక్కువ ధరతో కొంటున్న బయటి వ్యాపారులపై దాడులు
కొన్ని ర్యాంపుల్లో సూట్ పేరిట టన్నుకు 65 కిలోలు నొక్కేస్తున్న వైనం
పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడీ జరగని అన్‌లోడింగ్
తిరుపతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి గారూ... మా గోడు వినిపించుకోండంటూ జిల్లాలోని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రోత్సాహక ధర ప్రకటించినా ఫలితం కనిపించడం లేదంటూ వాపోతున్నారు.గతేడాది దామలచెరువు,పుత్తూరు, తిరుచానూరు, ఎర్రావారిపాలెం మార్కెట్లలో తోతాపురి టన్ను ధర గరిష్టంగా రూ. 8 పలికింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో జిల్లా యంత్రాంగం పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపి హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ధరైనా సాధ్యపడింది. దానికి అదనంగా ప్రభుత్వం కిలోకు రూ. 4 చొప్పున ప్రోత్సాహక ధర ప్రకటించింది. అంటే కిలోకు రూ. 12 చొప్పున రైతుకు అందాలి. అయితే ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి పెంచినా చాలా పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులు ఆ 8 రూపాయలు కూడా సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది మే నెలలో సీజన్ ప్రారంభం కాగా మొదట్లో మండీల వద్ద చిన్న సైజ్, మంచి రంగు కలిగిన తోతాపురి కిలో రూ. 15 నుంచీ రూ. 17 దాకా పలికింది. ఎక్కువ సైజ్, మంచి రంగు వున్న కాయలు కిలో రూ. 10 వరకూ పలికాయి. అలాగే ర్యాంపుల వద్ద కిలో రూ. 7 చొప్పున ధర పలికింది. అయితే తర్వాత ర్యాంపులు, మండీల నిర్వాహకులు సిండికేట్ తరహాలో ఒక్కటై ధర తగ్గిస్తూ వచ్చారు. ఇపుడు కిలో 3 రూపాయలు మించి కొనుగోలు చేయడం లేదు.
దోపిడీకి గురవుతున్న మామిడి రైతులు
సీజను ప్రారంభమై నెల, రెండు నెలలు గడిచాక చెట్లపై వున్న కాయలు పక్వానికి వచ్చేస్తాయి. దాంతో రైతులు వాటిని ఏదో ఒక ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది. లేదంటే చెట్లపైనే మాగిపోతాయి. సరిగ్గా రైతుల ఈ నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుంటున్న వ్యాపారులు రైతుల వద్ద కిలో రూ. 3 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి పల్ప్ ఫ్యాక్టరీలు రైతుల నుంచీ తోతాపురి మామిడిని కిలో రూ. 7 చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. అయితే రైతులు ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకెళుతుండగా ఫ్యాక్టరీల వద్ద అన్‌లోడింగ్ చేయడానికి 2-3 రోజులు పడుతోంది. అంటే రైతులు రెండు మూడు రోజుల పాటు ట్రాక్టర్ బాడుగలు, డ్రైవర్ బత్తాలు, వారి భోజన ఖర్చులు భరించాల్సి వస్తోంది. సుదీర్ఘ నిరీక్షణతో పాటు అదనపు ఖర్చులు భరించలేక రైతులు ఫ్యాక్టరీలకు తరలించకుండా మండీలకు, ర్యాంపులకు వెళుతున్నారు. అక్కడ కిలో రూ. 3 చొప్పున విక్రయించి దోపిడీకి గురవుతున్నారు. బయటి రాష్ట్రాల నుంచీ వస్తున్న వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి రైతుల నుంచీ కాయలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నా స్థానిక వ్యాపారులు వారిపై దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే మహరాష్ట్ర నుంచీ వచ్చిన ఓ వ్యాపారి దామలచెరువు వద్ద రైతులకు ఎక్కువ ధర ఆఫర్ చేయడంతో అతడిని స్థానిక వ్యాపారులు కొందరు దాడి చేసి చితకబాదినట్టు సమాచారం.మరోవైపు దామలచెరువు పరిసరాల్లో నడుస్తున్న 15 ర్యాంపుల్లో పలు చోట్ల సూట్ పేరిట మామిడి రైతులకు అదనంగా టోపీ పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. సూట్ పేరిట టన్నుకు 65 కిలోల కాయలు ఉచితంగా నొక్కేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిస్సహాయ స్థితిలో వ్యాపారుల దోపిడీని అనుమతించాల్సి వస్తోందని వాపోతున్నారు.
టన్ను రూ. 16 వేలు పలికితేనే రైతు బతికేది!
కిలోకు రూ. 4 ప్రోత్సాహక ధర ప్రకటించిన ప్రభుత్వం పట్ల రైతులు కృతజ్ఞతతోనే వున్నారు. అయితే అంతమాత్రాన వారికి గిట్టుబాటు ధర లభించినట్టు కాదు. జిల్లాలో మామిడి సాగుకు ఎకరాకు రూ. 35 వేల నుంచీ రూ. 40 వేల వరకూ ఖర్చవుతోంది. పెద్ద రైతులు మరింత ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. టన్ను రూ. 16 వేలు పలికితే గానీ రైతులకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం ప్రోత్సాహక ధర ప్రకటించి దాంతో సరిపెట్టుకోకుండా మండీ వ్యాపారులైనా, ర్యాంపు నిర్వాహకులైనా, పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకులైనా టన్నుకు రూ. 12 వేలు చెల్లించేలా ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. అదే సమయంలో పల్ప్ ఫ్యాక్టరీల నిర్వాహకుల సమస్యలపైనా దృష్టి సారించాల్సిన అవసరముంది. లేనిపక్షంలో గతేడాది చేదు అనుభవాలతో పలువురు మామిడి రైతులు మామిడి పంట వద్దంటూ చెట్లు నరికివేసిన రీతిలోనే ఈ ఏడాది కూడా మరింత మంది రైతులు మామిడి పంటకు వీడ్కోలు పలికే ప్రమాదం కనిపిస్తోంది.
శ్రీసిటీకి ఏడోసారి.....హీరోకు రెండోసారి
సత్యవేడు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):సత్యవేడు మండలం మాదనపాళెంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.హీరో పరిశ్రమకు అనుబంధంగా ఏర్పాటవుతున్న విడిభాగాల తయారీ పరిశ్రమ గ్లోబల్ పార్ట్ సెంటర్ 2.0 భూమిపూజకు ఆయన వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీసిటీ పర్యటనకు చంద్రబాబు బుధవారం ఏడవసారి వస్తుండగా....హీరో పరిశ్రమకు రెండవసారి వస్తున్నారు. శ్రీసిటీ సెజ్ ఏర్పాటయ్యాక 2015 ఏప్రిల్ 3న తొలిసారి పెప్పీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అదే రోజు శ్రీసిటీలో 11 పరిశ్రమలకు భూమిపూజ చేశారు. 2016 ఏప్రిల్ 25, 26 తేదీల్లో మాండలెజ్, ఇసుజు పరిశ్రమల ప్రారంభోత్సవాలకు రెండు సార్లు వచ్చారు. 2018 జనవరి 9న అపోలో టైర్స్ పరిశ్రమ భూమిపూజకు వచ్చారు. 2018 మార్చి 23న హీరో పరిశ్రమ భూమిపూజకు వచ్చారు. 2024 ఆగస్టు 19వ తేదీన శ్రీసిటీకి విచ్చేసి 15 పరిశ్రమలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, ఎంవోయూల కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చంద్రబాబు పర్యటన ఇలా
తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి: బుధవారం సాయంత్రం 4.20గంటలకు మాదనపాళెం సమీపంలో హీరో కంపెనీ ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.4.50గంటలకు హీరోమోటార్స్ గ్లోబల్‌పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి ప్లాంట్‌ను సందర్శిస్తారు. రాత్రి 7గంటలకు శ్రీసిటీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని బస చేస్తారు.గురువారం ఉదయం 9.40గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి రైల్వే కోడూరు నియోజకవర్గం ముుక్కావారిపల్లెకు ఉదయం 10.05గంటలకు చేరుకుంటారు.10.20 గంటలకు కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి వీబీ జీ రామ్ జీ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.10గంటలకు అక్కడినుంచీ బయల్దేరి 2.40గంటలకు రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచీ రోడ్డు మార్గాన 3గంటలకు తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30గంటల వరకు స్వర్ణాంధ్ర-2047 ఆర్థిక మేఽధోమధనం సదస్సులో పాల్గొంటారు.7గంటలకు తిరుపతి బస్టాండు సమీపంలోని శ్రీ కన్వెన్షన్‌లో జరిగే బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కుమార్తె రిసెప్షన్‌కు హాజరవుతారు.అక్కడినుంచీ కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించాక రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9గంటలకు కడప జిల్లా పర్యటనకు వెళతారు.