Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:35 AM
త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.
చిత్తూరు/తిరుపతి(కలెక్టరేట్), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది. ఇప్పటికే కృష్ణాజలాలు హంద్రీనీవా కుప్పం బ్రాంచి కెనాల్ ద్వారా కుప్పం చేరుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీఎం చంద్రబాబు కుప్పంలోని పరమసముద్రం చెరువులో జలహారతి కూడా ఇచ్చారు. నీవా బ్రాంచి కెనాల్ పూర్తి చేసి చిత్తూరుకూ కృష్ణమ్మను తీసుకొస్తానని హామీ కూడా ఇచ్చారు తాజాగా, కృష్ణాజలాలను కళ్యాణి డ్యామ్ వరకు తీసుకెళ్లి.. తిరుమల, తిరుపతిలోని 5 లక్షల మంది ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. నీవా బ్రాంచి కెనాల్ నుంచి కళ్యాణిడ్యామ్ వరకు నీళ్లు తెచ్చేందుకు రూ.126 కోట్లను కేటాయించారు. సంక్రాంతి పండుగ కోసం నారావారిపల్లెకు వస్తున్న సీఎం, 13వ తేదీన మూలపల్లెచెరువు వద్ద ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
2014లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రభుత్వం మారడంతో జగన్ దానిని పక్కన పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు.. తిరుమల,
తిరుపతికి తాగునీరు, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయకట్టుదారులకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
122 కిలోమీటర్ల నీవా బ్రాంచి కెనాల్
హంద్రీనీవా మెయిన్ కెనాల్ 554 కిలోమీటర్లు ప్రయాణించి, కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. మెయిన్ కెనాల్‌కు అనుసంధానంగా పుంగనూరు బ్రాంచి కెనాల్.. మళ్లీ పుంగనూరు కెనాల్‌కు అనుసంధానంగా కుప్పం బ్రాంచి కెనాల్ ఉన్నాయి. నీవా బ్రాంచ్ కెనాల్ అనేది మెయిన్ కెనాల్ ముగిసిన ప్రాంతం (అడవిపల్లె) నుంచి ప్రారంభమవుతుంది. చిత్తూరు ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో.. అడవిపల్లె నుంచి చిత్తూరు వరకు 122 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. దీంతో 50వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది.
కళ్యాణిడ్యామ్ వరకు నీళ్లను ఎలా తెస్తారంటే..
నీవా బ్రాంచ్ కెనాల్‌కు చెందిన 53వ కిలోమీటరు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సుమారు 10 మీటర్లపైకి నీళ్లను లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి 33 కిలోమీటర్ల మేర పైపు లైను ఏర్పాటు చేసి కళ్యాణ్‌డ్యామ్ వరకు నీళ్లను తెస్తారు. చంద్రగిరి మండలంలోని ఐదు ప్రధాన చెరువులు కేఆర్‌కండ్రిగ, నాగపట్ల, కనితమడుగు, కొండారెడ్డికండ్రిగచెరువు, మూలపల్లి చెరువుల ద్వారా నీటిని మళ్లించి నింపుతారు. దీంతో 1150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. దాదాపు 450 ఎంసీఎ్‌ఫటీల నీటిని నీవా బ్రాంచ్ కెనాల ద్వారా చెరువులతోపాటు కల్యాణిడ్యాంకు తరలిస్తారు. 36కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణాజలాలు కళ్యాణి డ్యాంకు చేరునున్నాయి. దీంతో తిరుమల, తిరుపతిలోని సుమారు 5 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
రూ.1329 కోట్ల ఖర్చు
కళ్యాణిడ్యామ్‌కు, చిత్తూరుకు నీవా బ్రాంచి కెనాల్ ద్వారా నీళ్లు రావాలంటే హంద్రీనీవా మెయిన్ కెనాల్ పూర్తయి, అడవిపల్లె రిజర్వాయర్ వరకు నీళ్లు రావాల్సి ఉంటుంది. 400-554 కిలోమీటర్ల మధ్యలో మెయిన్ కెనాల్ రీసెక్షన్, లైనింగ్ పనుల కోసం రూ.400 కోట్లు, రూ.425 కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు చేయనున్నారు. అలాగే నీవా బ్రాంచ్ కెనాల్‌ను రూ.504 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కళ్యాణిడ్యామ్ వరకు నీళ్లు తేవడానికి రూ.126 కోట్ల కేటాయింపు అదనం. మెయిన్ కెనాల్, నీవా బ్రాంచి కెనాల్ కోసం మొత్తం రూ.1329 కోట్లు వ్యయం చేయాల్సివుంది.
వైసీపీ స్టంట్‌లకు చెల్లు
2019 నాటికి పెండింగులో ఉన్న 10శాతం పనుల్ని చేయలేని వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో కుప్పంలో చేసిన స్టంట్లతో రాష్ట్ర వ్యా ప్తంగా అభాసుపాలైంది. 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక హంద్రీనీవా మీద ప్రత్యేక దృష్టి సారించారు. 2024 డిసెంబరు పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్స్‌కు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు రూ.319 కోట్లు, రూ.197 కోట్లు చొప్పున మంజూరు చేశారు. అనుకున్న సమయానికి ఈ పనుల్ని పూర్తి చేసి, కుప్పానికి నీళ్లను తెచ్చారు.
ఎల్లుండి శంకుస్థాపన
ఈ ప్రాజెక్టుకు మంగళవారం సీఎం చంద్రబాబు నారావారిపల్లె సమీపంలోని మూలపల్లె వద్దశంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను కలెక్టర్ వెంకటేశ్వర్, జలవనరుల శాఖ ఈఈ వెంకటేశ్వరప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కానున్నాయని హంద్రీ నీవా జలాలు చంద్రగిరి రైతులకు సాగునీరు, అటు తిరుపతి నగర వాసులకు తాగునీరు సమస్య తీరునున్నట్లు ఈఈ వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు.