Share News

Amaravati: జై అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:13 AM

రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబరాలతో హోరెత్తించారు.

Amaravati: జై అమరావతి
చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద కూటమి శ్రేణుల సంబరాలు

చిత్తూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదించారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంబరాలతో హోరెత్తించారు. ‘జై అమరావతి’ అంటూ నినదించారు. టపాసులు పేల్చారు. కొవ్వొత్తుల ర్యాలీలు.. కేకు కటింగులతో పండగ వాతావరణం నెలకొంది. చిత్తూరు నగరం గాంధీ సర్కిల్‌, టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు షణ్ముగరెడ్డి, కఠారి హేమలత, వెంకటేష్‌ యాదవ్‌, దొరబాబు, ఏఎస్‌ మనోహర్‌, చెన్నకేశవులు నాయుడు తదితరులు కేక్‌ కటింగ్‌ చేశారు. కాణిపాకంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కుప్పంలో జరిగిన సంబరాల్లో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. పలమనేరులో జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగవరం మండలంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇలా అన్ని మండల కేంద్రాలు, పలు గ్రామాల్లోనూ కొవ్వొత్తులు వెలిగించి, కేకులు కట్‌ చేశారు. కుప్పంలోని కడా కార్యాలయంలో అధికార వర్గాలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపాయి. ద్రావిడ విశ్వవిద్యాలయంలో వీసీ మల్లయ్య, రిజిస్ట్రార్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు.

తిరుపతిలో ర్యాలీలు..... పాలాభిషేకాలు.... బాణసంచా పేలుళ్ళు

తిరుపతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించడంతో తిరుపతి జిల్లావ్యాప్తంగా కూటమి పార్టీల శ్రేణులు గురువారం సంబరాలు జరుపుకున్నాయి.బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలు, అధినేతల చిత్రపటాలకు పాలాభిషేకాలు, బాణాసంచా పేలుళ్ళ నడుమ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున హడావిడి చేశాయి. కలెక్టరేట్‌ మొదలుకుని గ్రామ సచివాలయాల దాకా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా వేడుకలు జరిగాయి.ఫతిరుపతిలో కరకంబాడి రోడ్డులోని టీడీపీ పార్లమెంటు కార్యాలయం వద్ద కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. నాలుగు కాళ్ళ మండపం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలసి టపాకాయలు పేల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరపగా బైరాగిపట్టెడలో టీడీపీ స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.కలెక్టరేట్‌, ఎస్వీయూ భవనాలు విద్యుద్దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకున్నాయి.ఫచంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లి కూడలిలో ఎమ్మెల్యే పులివర్తి నానీ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. పాకాలలో ఎన్టీయార్‌ విగ్రహం ఎదుట దీపాలు వెలిగించి పూజలు జరిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. చివరగా మానవహారం నిర్వహించారు. చంద్రగిరి టవర్‌ క్లాక్‌ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన నిర్వహించిన కూటమి పార్టీల శ్రేణులు ఎన్టీయార్‌, పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్‌, ఎమ్మెల్యే నానీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తొండవాడలో సైతం కూటమి పార్టీల నేతలు కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన నిర్వహించారు. చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండల కేంద్రాల్లోనూ కొవ్వొత్తులతో ప్రదర్శనలు జరిగాయి.ఫ రైల్వే కోడూరులోని ఎన్టీయార్‌ కూడలి ఇంద్ర బస్‌ షెల్టర్‌ వరకూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సహా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి బాణాసంచా పేల్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చిట్వేలి జడ్పీ హైస్కూలులో టీచర్లు, విద్యార్థులు కేక్‌ కట్‌ చేసి జయహో అమరావతి అనే నినాదాల నడుమ శుభాకాంక్షలు తెలిపారు.ఫవెంకటగిరి త్రిభువని సెంటర్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ అమరావతే రాజధాని అంటూ నినాదాలు చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.


డక్కిలి సచివాలయం ముంగిట పలువురు దీపోత్సవం నిర్వహించారు. బాలాయపల్లి మండలం నిడిగల్లు సచివాలయం వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నాయి. సూళ్ళూరుపేట నియోజకవర్గం తడ, పెళ్ళకూరు ఎంపీడీవో కార్యాలయాల్లో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు చెప్పారు.గూడూరు నియోజకవర్గం వాకాడులో కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ జరపగా చిట్టమూరులో టీడీపీ నాయకులు బైక్‌ ర్యాలీ, కొత్తగుంటలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజధాని అమరావతి పేరుతో తయారు చేయించిన కేక్‌ను కట్‌ చేసి అధ్యాపకులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ఫ శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లెలోని ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎత్తున శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నాయి. శ్రీకాళహస్తి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు ముగ్గులు వేసి సంబరాలు జరిపారు. తొట్టంబేడులో టీడీపీ వర్గాలు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేయగా ఏర్పేడులో ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్‌ కూడలిలో టీడీపీ శ్రేణులు బాణాసంచా పేల్చడంతో పాటు పరస్పరం రంగులు చల్లుకుని స్వీట్లు పంచిపెట్టారు.ఫ సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో టీడీపీ శ్రేణులు బైక్‌ ర్యాలీలతో హోరెత్తించాయి. పిచ్చాటూరులో టీడీపీ కో-ఆర్డినేటర్‌ కూరపాటి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్‌ రోడ్డునుంచీ ఆర్టీసీ బస్టాండు వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌రెడ్డి అనుచరులతో కలసి నాగలాపురంలో కూడా బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. బీఎన్‌ కండ్రిగలో కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ జరిపారు. వరదయ్యపాలెంలో టీడీపీ వర్గీయులు బైక్‌ ర్యాలీతో పాటు కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - Apr 03 , 2026 | 02:13 AM