Share News

Cabinet meeting: పరిశ్రమలు.. పర్యాటకం

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:19 AM

జిల్లాలో అటు పరిశ్రమలు.. ఇటు పర్యాటకం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశగా శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

Cabinet meeting: పరిశ్రమలు.. పర్యాటకం
గతేడాది జూన్‌ 2న పులిగుండు ముందు యోగా కార్యక్రమం

మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

చిత్తూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటు పరిశ్రమలు.. ఇటు పర్యాటకం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశగా శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. భారీ పెట్టుబడులతో పరిశ్రమలు, వాటికి భూకేటాయింపులు, ప్రోత్సాహకాలతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పర్యాటకం వంటి అంశాలకు ఆమోదం తెలిపారు. జిల్లా మరింత అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదపడనున్నాయి.

కుప్పంలో భారీ కెమికల్స్‌ ప్రాజెక్టు

కుప్పంలో ఎన్‌పీఎ్‌సపీఎల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుకు 105 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2,550 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉద్యోగ కల్పన లక్ష్యంతో ఇది ఏర్పాటు కానుంది. ఎలకా్ట్రనిక్‌ కాంపోనెంట్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు అనుమతిచ్చింది. దీన్ని ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు) సిఫార్సు చేసింది.

శాంతిపురంలో ఫుడ్‌ పార్కు

శాంతిపురం మండలం చీమనపల్లె గ్రామంలో ఆగ్రో ఫుడ్‌ ఇన్నోవేషన్‌ జోన్‌ (ఫుడ్‌ పార్క్‌) ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ.989 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్నారు. రెండు దశల్లో 450 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఎస్‌ఐపీబీ సిఫార్సు మేరకు దీనికి ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు.

కుప్పం, శాంతిపురంలో పారిశ్రామిక పార్కులు

కుప్పం, శాంతిపురంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పంలో 15.88 ఎకరాలు, శాంతిపురంలో 25 ఎకరాల్ని ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ర్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) కు అప్పగించనున్నారు. కుప్పంలో మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.90 లక్షల చొప్పున, శాంతిపురంలో రూ.16 లక్షల చొప్పున కేటాయించేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది. కుప్పం మండలం ఏకార్లపల్లె గ్రామంలో 6.07 ఎకరాలు, పెద్దబంగారునత్తంలో 9.81 ఎకరాలు.. మొత్తం 15.88 ఎకరాలు కేటాయించారు. శాంతిపురం మండలం అమ్మవారిపేటలోని వేర్వేరు ఎల్‌పీఎం నంబర్లలో 22.71, 1.91, 0.37 ఎకరాల చొప్పున మొత్తం 25 ఎకరాల్ని కేటాయించారు.

‘అక్షయ పాత్ర’కు 1.99 ఎకరాలు

కుప్పం మండలం పెద్దబంగారునత్తం గ్రామంలో 1.99 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్షయపాత్ర ఫౌండేషన్‌ పీడీకి కేటాయిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పలు ప్రభుత్వ పథకాల కింద సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ నిర్మాణం కోసం దీన్ని 30 ఏళ్ల లీజుకు ఇచ్చారు. ఎకరా మార్కెట్‌ విలువ రూ.3.75 లక్షలు ఉండగా.. అందులో 10 శాతం అంటే రూ.37,500 ఏడాదికోసారి చెల్లించాలి. 1.99 ఎకరాలకు రూ.74,625 చెల్లించాలి. ఐదేళ్లకోసారి 10 శాతం పెంచాలి.

పులిగుండు వద్ద టూరిజం ప్రాజెక్టు

పెనుమూరు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పులిగుండు వద్ద టూరిజం ప్రాజెక్టుకు భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటిపల్లె గ్రామం 452/1 సర్వే నంబరులో 79.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ టూరిజం అథారిటీ సీఈవోకు కేటాయించనున్నారు. ఇక్కడ వెల్నెస్‌ టూరిజం, రిసార్టులు, ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.27.88 లక్షల చొప్పున రూ.22.03 కోట్ల చెల్లింపుపై కేటాయించేందుకు నిర్ణయించారు.

మోదీ అభినందనతో..

గతేడాది జూన్‌లో పులిగుండు వద్ద యోగాంధ్రలో భాగంగా సుమారు రెండు వేల మందితో యోగా చేశారు. కలెక్టర్‌, ఎస్పీ వంటి ప్రముఖులూ పాల్గొన్నారు. వెనుక పులిగుండు కనిపిస్తూ.. దాని ఎదుట యోగా చేసే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ప్రధాని మోదీ ఆ ఫొటోలను రీట్వీట్‌ చేస్తూ అభినందించారు. ఆ తర్వాత టూరిజం శాఖ అధికారులు ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్వే చేసుకుని, భూమి కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో 79.03 ఎకరాల్ని కేటాయిస్తూ ఆమోదించింది.


తిరుపతి జిల్లాలో ఆల్తూరుపాడుకు మోక్షం

రూ.679.20 కోట్లతో జలాశయ పనులకు అనుమతి

తిరుపతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంతోపాటు పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుగుణంగా శుక్రవారం మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆల్తూరుపాడు జలాశయానికి నిధులు కేటాయించడంతోపాటు నాయుడుపేట పరిధిలో ఏడాదికి 1 కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ ఏర్పాటుకు ఆమోదించింది. జిల్లాలో ఏర్పాటయ్యే పలు పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లా పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగుతోపాటు తాగునీరు అందించేందుకు గాలేరు-నగరి ప్రాజెక్టు ఫేజ్‌-2లో పలు జలాశయాల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం పనులు చేపట్టింది. అయితే కుక్కలదొడ్డి ప్రాంతం నుంచి నీటిని తరలించడం సమస్యగా ఉన్న నేపథ్యంలో అటు కండలేరు నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా డక్కిలి మండలంలోని ఆల్తూరుపాడుకు, అక్కడి నుంచి మేర్లపాక, మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకు నీటిని తరలించేందుకు నాడు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపి పనులు ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను రద్దు చేశారు. ఆల్తూరుపాడు జలాశయ నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయిస్తామని నాడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.679.20 కోట్లతో ఆల్తూరుపాడు జలాశయ పనులు పూర్తి చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఫ నాయుడుపేట పరిధిలో హెచ్‌హెచ్‌పీ ఎయిట్‌ సంస్థ అభ్యర్థన మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ కింద వన్‌ కేటీపీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి స్థాపనకు అనుమతి ఇవ్వడంతోపాటు సంస్థకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేశారు. అలాగే నాయుడుపేట మల్టీపర్పస్‌ సెజ్‌లో మెట్రోడెకోరేటివ్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డు, ఫర్నిచర్‌ తయారీకి రూ.1032 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా 400 మందికి ఉపాధి లభించనుంది.ఈ సంస్థకు 50 ఎకరాలు కేటాయించడంతోపాటు ఏపీ ఐడీపీ 4.0 కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదించారు.తడ మండలం మాంబట్టులోని ఇండస్ర్టియల్‌ పార్కు ఫేజ్‌-2లో స్ర్పేడ్రైడ్‌ కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను రూ.233.73 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉపాఽధి కల్పించేలా ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌ఐపీబీ సిఫార్సు మేరకు ఇండస్‌ కాఫీ ప్రైవేటు లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేశారు. దివ్యశ్రీ హోల్డింగ్స్‌ , సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ కన్సార్టియం అభ్యర్థన మేరకు రూ. 400 కోట్ల పెట్టుబడికి అనుగుణంగా భవన నిర్మాణ అనుమతుల తేదీ నుంచి 30 నుంచి 36 నెలల్లో ఫేజ్‌-1, ఫేజ్‌-2 పూర్తికి మొత్తం భూమికి షరతుల మేరకు సేల్‌డీడ్‌ అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. టీటీడీలోని పోటు విభాగంలో సమాన సంఖ్యలో ఎల్‌పీజీ ఆపరేటర్‌ పోస్టులను మూడు ఎల్‌పీజీ సూపర్‌వైజర్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఆమోదించారు.

Updated Date - Apr 11 , 2026 | 01:19 AM