గ్రామసభ బలపడితేనే దేశం బలపడుతుంది: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:38 PM
గ్రామాల బలోపేతమే దేశాభివృద్ధికి పునాది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామసభలు, పంచాయతీలకు మరింత అధికారాలు, బాధ్యతలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తిరుపతి: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. రాష్ట్ర భవిష్యత్‌కు కొత్త దిశను చూపిన చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలు రెండేళ్ల క్రితం కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా బాధ్యతను కూడా అప్పగించారని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
చరిత్రను మార్చగలరు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమష్టి ప్రయత్నాలు ఫలించాయని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజా తీర్పు ఒక తరం భవిష్యత్‌కు నమ్మకాన్ని ఇచ్చిందని, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్, ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా సరైన సమయంలో తమ తీర్పుతో చరిత్రను మార్చగలరని 2024 ఎన్నికలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితమని పవన్ అభిప్రాయపడ్డారు. అధికారం పంచుకోవడం కోసం కాకుండా బాధ్యతను పంచుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం స్థానికంగానే..
ఈ సందర్భంగానే గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ విమర్శలు చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు తాము చేసిన రాజకీయ త్యాగమే కూటమి విజయానికి పునాది అయిందని అన్నారు. గ్రామమే దేశ అభివృద్ధికి కేంద్ర బిందువని పేర్కొన్న పవన్.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు గ్రామ పంచాయతీల స్థాయిలోనే జరగాలని అన్నారు. గ్రామంలో పరిష్కరించాల్సిన సమస్యలు మండల, జిల్లా లేదా ఎమ్మెల్యే స్థాయికి వెళ్లకుండా స్థానికంగానే పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రతి చిన్న సమస్య కూడా ఎమ్మెల్యేల వద్దకు వెళ్తోందని, రాష్ట్రంలో ఉన్న వందలాది స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి, మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరికాదన్నారు. వ్యవస్థలు బలహీనపడితే కులాలు, ప్రాంతీయ భావాలు బలపడతాయని హెచ్చరించారు.
జాతీయ అభివృద్ధి దిశగా ఆలోచించాలి
తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే కుల, ప్రాంతీయ పరిమితులను దాటి జాతీయ అభివృద్ధి దిశగా ఆలోచించాలని సూచించారు. గ్రామాలకు నిర్ణయాధికారం, బాధ్యతలు పూర్తిస్థాయిలో చేరాయా అనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి, జాతీయ పండుగలు నిర్వహించడానికి కూడా నిధులు లేవని అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితిని ‘బ్రోకెన్ గవర్నెన్స్’గా అభివర్ణించారు.
గ్రామపంచాయతీలే విశ్వవిద్యాలయాలు
గ్రామాల్లో రోడ్లు ఎక్కడ వేయాలి? ఎవరికీ ఇళ్లు అవసరం వంటి నిర్ణయాలు కార్యాలయాల్లో కాకుండా ప్రజల మధ్య గ్రామసభల్లో తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. గ్రామసభలు బలపడితే సర్పంచ్‌లు బలపడతారని, అప్పుడు ఎమ్మెల్యేలు స్థానిక సమస్యల కంటే యువత భవిష్యత్తు, పరిశ్రమలు, అభివృద్ధి వంటి పెద్ద అంశాలపై దృష్టి సారించగలరని అన్నారు. ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీలే అతిపెద్ద విశ్వవిద్యాలయాలని పేర్కొన్న ఆయన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానం కూడా గ్రామస్థాయి నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. గత రెండేళ్లలో రాజకీయ స్థిరత్వం సాధించడంతో పాటు గ్రామాల వరకు ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్లామని చెప్పారు.
వ్యవస్థలను బలోపేతం చేయాలి
‘స్వర్ణ పంచాయతి’ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీల ఆస్తులను నమోదు చేసి, వాటి ఆదాయ వనరులను పెంచగలిగామని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్‌లో కాకుండా గ్రామసభల్లోనే రాయబడుతుందని, ప్రతి గ్రామం బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుందని అన్నారు. ప్రజలు కేవలం రాజకీయ పార్టీలను కాకుండా వ్యవస్థలను, వ్యక్తులను కాకుండా సంస్థలను విశ్వసించాలని పవన్ పిలుపునిచ్చారు. అధికారం అనేది పార్టీలను కాపాడటానికి కాదు, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. రాబోయే తరాలు గర్వించేలా దేశ నిర్మాణం జరగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Also Read:
ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చింది: సీఎం చంద్రబాబు
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్