Drought: కరువు నుంచి సమృద్ధి వైపు..
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:38 AM
‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్‘ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన డ్రోన్ షోకు విశేష స్పందన లభించింది.
తిరుపతి సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ ఉద్యాన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్‘ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన డ్రోన్ షోకు విశేష స్పందన లభించింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రోన్ల ద్వారా ఆకట్టుకునే విధంగా అవగాహన వీడియో ప్రదర్శన చేపట్టారు. రాయలసీమ ప్రాంతంలోని ఉద్యాన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన రంగంలో ఉన్న అవకాశాలు, భవిష్యత్‌లో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేలా వీడియో ప్రదర్శన చేశారు. ‘కరువు నుంచి సమృద్ధివైపు’ అన్న నినాదంతో సచిత్రాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్ షోను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు హాజరవగా.. ఉద్యాన శాఖ, ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరులో..
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రాయలసీమ రైజింగ్‘ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి చిత్తూరు ఎస్వీసెట్‌లో కళాశాల మైదానంలో డ్రోన్ ఫ్లై షో నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలోని ఉద్యాన పంటలు, ఈ రంగంలో ఉన్న అవకాశాలు, వ్యవసాయ ఉత్పత్తులు, భవిష్యత్‌లో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ల ద్వారా అవగాహన వీడియో ప్రదర్శన చేపట్టారు. ‘కరువు నుంచి సమృద్ధివైపు’ అన్న నినాదంతో చిత్రాలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల కాంతులతో డ్రోన్లు ఆకాశంలో ప్రదర్శించిన ఉద్యానవన రంగ అభివృద్ధి ప్రణాళికలు ప్రజలను అలరించాయి. రాయలసీమలో నిరుద్యోగాన్ని తగ్గించి, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో అగ్రికల్చర్, హార్టికల్చర్ హబ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు, ప్రజలు, యువత, ఆర్‌వీఎస్ ఎస్వీసెట్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.