Horticulture Hub: హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:50 AM
కరువు ప్రాంతమైన రాయలసీమకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనాతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మదనపల్లెకు రానున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్
అన్నమయ్య, అక్టోబర్ 1(ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతమైన రాయలసీమకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనాతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.లక్ష కోట్లతో వచ్చే మూడేళ్లలో ఉద్యాన శాఖ విస్తీర్ణంతో పాటు దిగుబడి పెంచనున్నారు. నీటి పారుదల, గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. శుక్రవారం గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రిలయన్స్ సంస్థ ఈడీ అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు అందరూ వేర్వేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమం పూర్తికానుంది. ఈ సభకు చిత్తూరు, తిరుపతి, కడప, సత్యసాయి జిల్లాల నుంచి సుమారు 20వేల మంది రైతులు హాజరుకానున్నారు. మదనపల్లె పట్టణం బీకే పల్లె బైపా్‌సలో 60వేల మంది కూర్చునేలా సభా వేదికను సిద్ధం చేశారు. ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. బైసాస్ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 1800 మంది పోలీసులను నియమించారు. కాగా, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తదితరులు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.
దేశంలోనే తొలిసారిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
మదనపల్లె కేంద్రంగా దేశంలోనే తొలిసారి రిలయన్స్ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎ్‌సఏ) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. రైతులకు ఏఐ ఆధారిత అగ్రిటెక్ సేవలు అందించడం దీని లక్ష్యం. ఈ ప్రాంత రైతులకు వాతావరణ అనుకూల వ్యవసాయం, పంట అనంతర నిర్వహణ, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు అందుతాయి.