Share News

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:19 AM

రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ
కొత్త పట్టాదారుపుస్తకాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి ఈనెల తొమ్మిదో తేదీవరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఈ పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

319 గ్రామాల్లో 70వేల మంది రైతులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడి న పట్టాదార్‌ పాసుపుస్తకాలను ఇవ్వనున్నట్లు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రీసర్వే జరిగిన 319 గ్రామాల్లో సుమారు 70వేల మంది రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తకాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోతో ముద్రించిన పాసుపుస్తకాల స్థానంలో ఇప్పుడు ఎవరి ఫొటోలు ఉండవు. కేవలం ప్రభుత్వ రాజముద్రతో భూయాజమాన్య హక్కుపత్రం, పట్టాదార్‌ పాసుపుస్తకాన్ని ముద్రించింది. కాగా, వెబ్‌ల్యాండ్‌లోని వివరాల మేరకు తప్పులున్న పాసుపుస్తకాలు సుమారు 15వేల వరకు ఉన్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు.వాటిని పక్కన పెట్టి 55వేల పాసుపుస్తకాలను మాత్రమే ఇవ్వనున్నారు.డివిజన్ల నుంచి మండల కేంద్రాలకు,గ్రామాలకు వీటిని సరఫరా చేశారు.సుమారు 10నెలలుగా కొత్త పాసుపుస్తకాల్లేక రుణా లు,క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఊరట దక్కనుంది.


తిరుపతిలో ఇలా..

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 1(ఆంధ్రజ్యోతి): రీ సర్వే జరిగిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నారు. వైసీపీ హయాంలో హడావుడిగా రీసర్వే చేశారు. భూ వివాదాలు పెంచారు. జగన్‌ ఫొటోతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలిచ్చారు. తమ భూహక్కు పత్రాలపై జగన్‌ ఫొటో ఏంటని రైతులు అభ్యంతరం తెలిపారు. ఆందోళనలూ చేశారు. తాము అధికారంలోకి రాగానే రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు రాజముద్రతో ముద్రించిన ఈ పుస్తకాలను శుక్రవారం రెవెన్యూ గ్రామసభల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటి విడతగా 26,112 పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య తెలిపారు. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి డివిజన్లలోని 23మండలాల్లో శుక్రవారం రైతులకు పట్టాదారుపుస్తకాలు అందజేయనున్నారు. రెండో విడత 113 గ్రామాల్లో రీ సర్వే జరగ్గా.. త్వరలోనే అక్కడి రైతులకూ కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 01:19 AM