Share News

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 01 , 2026 | 08:40 PM

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

తిరుపతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. . తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హీరో సంస్థ తిరుపతికి రావడానికి తాను ప్రత్యేకంగా కృషి చేశానని, మరో రాష్ట్రానికి వెళ్లాల్సిన సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో కొత్త తరం బ్యాటరీ ఆధారిత వాహనాల తయారీ కూడా తిరుపతిలోని హీరో ప్లాంట్‌లోనే జరగనుందని వెల్లడించారు.

Untitled-15.jpg


ఆంధ్రప్రదేశ్ యువత ప్రతిభావంతులని, ప్రపంచ స్థాయి సాంకేతికతను అందిపుచ్చుకునే సామర్థ్యం వారికి ఉందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే అత్యధికంగా ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే అనుసంధానం, విద్యుత్, నీటి వనరులు పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. త్వరలో దుగ్గరాజుపట్నం పోర్టు, నాలుగు లైన్ల రైల్వే మార్గాలు అందుబాటులోకి రావడంతో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యమని, ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 10 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఒకసారి ఎంఓయూ కుదిరిన తర్వాత ఆ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని స్పష్టం చేశారు.


విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ను 2028 డిసెంబర్‌లోగా ప్రారంభించేలా చర్యలు కొనసాగుతున్నాయని, అమరావతిలో వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటింగ్ తయారీకి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. హీరో సంస్థ మహిళా పోలీసులకు 63 వాహనాలను అందించడం అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే 'పీ4' (P4) కార్యక్రమంలో హీరో సంస్థ భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తూ, పరిశ్రమ ఉన్న ప్రాంతంలో సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సీఈవోను నియమించాలని సూచించారు. మానవ వనరుల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి కీలకమని, లక్షలాది మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.


ALso Read:

18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

Updated Date - Jul 01 , 2026 | 09:21 PM