18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:08 PM
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ వనాలను పరిరక్షిస్తూ పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సవిత తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు మాత్రమే కాకుండా, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని అన్నారు. నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్‌లా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ 'నగర వన యోజన' నిధులతో పాటు స్థానిక నిధులను వినియోగిస్తూ రూ.36 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశామని, జీవవైవిధ్య పరిరక్షణతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నక్షత్ర వనాలు, రాశి వనాలను కూడా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ పార్కుల్లో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఇవి కేవలం పచ్చదనాన్ని పెంచడానికే కాకుండా.. ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వనాలను పరిరక్షిస్తూ, మరింత పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే వాక్ స్వాతంత్ర్యం పేరుతో వ్యక్తిత్వ హననం, నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వ్యక్తిగత దూషణలు, హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు
నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని, కానీ సోషల్ మీడియా వేదికగా సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్టలు తీయాలనుకోవడం పద్ధతి కాదని తెలిపారు. నేరాలకు కులం, మతంతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్న వారికి అండగా నిలిచేందుకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పవన్ వెల్లడించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, నిందితులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.
Also Read:
ఏపీలో త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్..