Share News

Campaign: ప్రశాంతంగా ముగిసిన ప్రచార పర్వం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:42 AM

తిరుపతి కార్పొరేషన్‌ సహా పుత్తూరు, నాయుడుపేట, వెంకటగిరి,సూళ్ళూరుపేటల్లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది.

Campaign: ప్రశాంతంగా ముగిసిన ప్రచార పర్వం
తిరుపతి ర్యాలీలో జేబీ శ్రీనివా్‌సతో నాని, సుధీర్‌రెడ్డి, పనబాక లక్ష్మి, దివాకర రెడ్డి - వెంకటగిరి వీధుల్లో టీడీపీ భారీ ప్రదర్శన

తిరుపతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ సహా పుత్తూరు, నాయుడుపేట, వెంకటగిరి,సూళ్ళూరుపేటల్లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. ఈ ఐదు చోట్లా అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, శ్రేణులు స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.చివరి రోజు కావడంతో వెంకటగిరి, నాయుడుపేటల్లో శుక్రవారం టీడీపీ వర్గీయులు భారీ ఎత్తున ప్రచార ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఓటర్లను ప్రలోభపరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే పంపకాలకు సంబంధించి ఒకో చోట ఒకో విధమైన పరిస్థితి కనిపిస్తోంది.

వెంకటగిరి, నాయుడుపేటల్లో టీడీపీ భారీ ర్యాలీలు

ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం వెంకటగిరిలో కూటమి వర్గీయులు భారీ ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఛైర్మన్‌ అభ్యర్థి దొంతు శారద, బీజేపీ ఇంఛార్జి ఎస్‌ఎ్‌సఆర్‌ నాయుడు, నెల్లూరు డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ గంగోటి నాగేశ్వరరావు, కౌన్సిలర్‌ అభ్యర్థులతో నిర్వహించిన ర్యాలీకి వేలాదిగా శ్రేణులు హాజరయ్యాయి. మరోవైపు నాయుడుపేటలో సైతం కూటమి పార్టీలు బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించాయి. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం తదితరులు హాజరైన ఈ ర్యాలీకి జనం భారీ సంఖ్య లో తరలివచ్చారు. పుత్తూరులో కూటమి పార్టీల తరపున యధాప్రకారం వార్డు స్థాయిలో ప్రచారాలు కొనసాగగా వైసీపీ మాత్రం శుక్రవారం భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. కానీ గురువారం సాయంత్రమే మాజీ మంత్రి రోజా వచ్చి ఒకటి రెండు చోట్ల పెద్దగా హడావిడి లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొ ని వెళ్ళిపోవడంతో శుక్రవారం ర్యాలీ జరగలేదు.

ప్రలోభాల పర్వం

తిరుపతి నగరంతో పాటు పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట పట్టణాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జోరుగా మొదలయ్యాయి. తిరుపతిలో టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు బరిలో వున్న డివిజన్లలో ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం నుంచీ పంపిణీ ప్రారంభించినట్టు తెలిసింది. అయితే బీజేపీ పోటీ చేస్తున్న ఐదు చోట్ల మాత్రం ఇంకా పంపకాలు మొదలు కాలేదు. వైసీపీ వర్గీయులు నగదు పంపకాలు ఇంకా మొదలు పెట్టలేదు. పుత్తూరులో టీడీపీ వర్గీయులు ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంచాలని నిర్ణయించినా ఇంకా పంపకాలు ప్రారంభించలేదు. బీజేపీ అభ్యర్థులు బరిలో వున్న మూడు వార్డుల్లో ఓటుకు రూ. 500 వంతున పంపిణీ చేశారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నాలుగు వార్డుల్లో ఓటుకు రూ. వెయ్యి వంతున ఓటర్లకు అందుతోంది. కూటమి పార్టీలకు దీటుగా వైసీపీ వర్గీయులు సైతం రంగంలోకి దిగి ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. వెంకటగిరిలో టీడీపీ మద్దతుదారులు ఓటుకు 1500 చొప్పున ఇవ్వాలని డిసైడయ్యారు. అయితే పంపకాలకు శనివారం ముహూర్తం నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదే సమయంలో వైసీపీ మద్దతుదారులు మాత్రం పంపకాలలో బాగా వెనుకబడ్డట్టు సమాచారం. రెండు వార్డుల్లో మాత్రమే వారు పంపిణీ పూర్తి చేసినట్టు తెలిసింది. 25వ వార్డులో వెంకటగిరి రాజాల ప్యాలె్‌సలో పనిచేసే వ్యక్తి అభ్యర్థిగా వున్నారు. అక్కడ వైసీపీ వర్గీయులు ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. అలాగే 16వ వార్డులో రూ. వెయ్యి చొప్పున ఓటర్లకు అందజేస్తున్నట్టు సమాచారం. మిగిలిన వార్డుల్లో రూ. 500 చొప్పున పంచాలని నిర్ణయించినా ఇంకా మొదలు పెట్టలేదని తెలిసింది. నాయుడుపేటలో శుక్రవారం మఽధ్యాహ్నానికే పంపకాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ మద్దతుదారులు ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేసినట్టు సమాచారం. అలాగే సూళ్ళూరుపేటలో కూడా శుక్రవారం మధ్యాహ్నం నుంచే పంపకాలు మొదలయ్యాయి. టీడీపీ మద్దతుదారులు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తుండగా వైసీపీ మద్దతుదారులు రూ. 500 చొప్పున పంచుతున్నారు.


తిరుపతి ప్రచారంలో ముగ్గురు ఎమ్మెల్యేలు

తిరుపతిలో అటు కూటమి పార్టీలు, ఇటు ప్రధాన ప్రతిపక్షం రెండూ సంస్థాగతంగా బలంగా వున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారాలు మాత్రం ప్రశాంతంగానే ముగించాయి. ఇరువైపులా బలమైన అనుచర వర్గాలున్నప్పటికీ ప్రచారంలో మా త్రం ఒకరికొకరు అడ్డంకులు సృష్టించుకోవడం జరగలేదు. ఎవరిపాటికి వారు స్వేచ్ఛగా ప్రచారాలు సాగించారు. చివరి రోజైన శుక్రవారం కూటమి తరపున ఎమ్మెల్యేలు పులివర్తి నాని,బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, టీడీపీ సీనియర్‌ నేతలు పనబాక లక్ష్మి,సుగుణమ్మ, నరసింహ యాదవ్‌,తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి, మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు, తదితరులు కూటమి శ్రేణులతో కలసి ప్రచారాల్లో పాల్గొన్నారు. అలాగే వైసీపీ పరంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పలుచోట్ల అభ్యర్థులతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

నగదు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ వర్గీయులు

విపక్ష నేత ఇంట్లో మద్యం సీసాలు

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సూళ్ళూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసు తనిఖీలు, నిఘా ఎక్కువ కావడంతో ముఖ్య నేతలెవరూ అందుబాటులో లేకుండా పోయారు.రెండు రోజులుగా వారు అజ్ఞాతంలో వుంటూనే అనుచరుల ద్వారా పంపకాలకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. సూళ్ళూరుపేట పట్టణం సూళ్లూరులో శుక్రవారం తెల్లవారు జామున వైసీపీకి చెందిన గురునాథం గజేంద్రం, చేవూరు అఖిల్‌ వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ఓటర్లకు నగదు పంచుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న రూ.30వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. నాయుడుపేటలో వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డి ఇంటి ఆవరణలో 87 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఆయన కూడా గురువారం నుంచే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైసీపీ నేతలు పోలీసు నిఘాను, ప్రత్యర్థి పార్టీ నేతల నిఘాను తప్పించుకుని నగదు పంపిణీ చేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. నమ్మకస్తులైన అనుచరులను పురమాయించి ఒక్కొక్కరి ద్వారా కేవలం నాలుగైదు ఇళ్ళకు చొప్పున చాలా పరిమితంగా నగదు చేరవేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద పోలీసు తనిఖీల భయంతో వైసీపీ నగదు పంపకాల విషయంలో బాగా వెనుకబడుతున్నట్టు కనిపిస్తోంది.

Updated Date - Oct 31 , 2026 | 02:42 AM