Share News

డబ్బు కోసం స్నేహితుల ఆగడం

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:18 AM

‘నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం’ అని నమ్మించారు. స్నేహితుడిని బ్రిటన్‌ నుంచి స్వదేశానికి రప్పించారు. తీరా వచ్చాక అతన్ని కిడ్నాప్‌ చేశారు.

డబ్బు కోసం స్నేహితుల ఆగడం

  • బ్రిటన్‌ నుంచి రప్పించి నిర్బంధం

  • తిరుపతి, హైదరాబాద్‌ల్లో ఉంచి..20 రోజులకుపైగా చిత్రహింసలు

  • 6 కోట్లకు చానల్‌ విక్రయించేలా ఒత్తిడి

  • హవాలా ద్వారా 1.94 కోట్లు తరలింపు

  • ముగ్గురి అరెస్ట్‌.. 30 లక్షలు స్వాధీనం

తిరుపతి (నేరవిభాగం), సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం’ అని నమ్మించారు. స్నేహితుడిని బ్రిటన్‌ నుంచి స్వదేశానికి రప్పించారు. తీరా వచ్చాక అతన్ని కిడ్నాప్‌ చేశారు. అతడి చానల్‌ విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములో రూ.1.94 కోట్లు పంచేసుకున్నారు. తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి, హైదరాబాద్‌ల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చంద్రగిరి మండలం నాగపట్లకు చెందిన డి.సుమంత్‌ అలియాస్‌ నాని (25) బ్రిటన్‌లో ఎంఎస్‌ పూర్తి చేశారు. ‘నాని క్రికెట్‌ ప్రిడిక్షన్స్‌’ పేరుతో ఓ టెలిగ్రామ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు. 1.85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈ చానల్‌ ద్వారా క్రికెట్‌ ప్రిడిక్షన్లు, ప్రమోషన్లు చేస్తూ సుమంత్‌ భారీగా డబ్బు సంపాదించేవాడు. గతంలో స్వగ్రామానికి వచ్చినపుడు గణేశ్‌ అనే వ్యక్తి ద్వారా సుమంత్‌కు చంద్రగిరికి చెందిన బాలాజీతో పరిచయం ఏర్పడింది.


సుమంత్‌ విలాసవంతమైన జీవితాన్ని చూసిన బాలాజీ.. చంద్రగిరి బోడింబాయికి చెందిన గౌతమ్‌, అనంతపురం జిల్లాకు చెందిన మాకాటి మనోజ్‌కుమార్‌రెడ్డి, చరణ్‌, యశ్వంత్‌ రెడ్డి, వాజిద్‌ బాషాలకు దుర్బుద్ధి పుట్టింది. సుమంత్‌ను బెదిరించి కోట్లు దండుకోవాలని పథకం రచించారు. సుమంత్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని నమ్మించి జూలై 29న స్వదేశానికి పిలిపించారు. తిరుపతికి చేరుకున్న సుమంత్‌ను కారులో ఎక్కించుకుని.. యాష్‌ హోమ్‌స్టేకి తరలించారు. అక్కడ బంధించి రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తూ చరణ్‌, గౌతమ్‌... అతనిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని మనోజ్‌ ఫ్లాట్‌కు తరలించారు. ఆగస్టు 22 వరకు అక్కడే బంధించి అతడి టెలిగ్రామ్‌ చానల్‌ ఖాతాలను ఇతరులకు రూ.6 కోట్లకు విక్రయించారు. అందులో రూ.1.94 కోట్ల మొత్తాన్ని హవాలా ద్వారా సేకరించారు. ఒకరోజు రాత్రి అందరూ మద్యం మత్తులో ఉండగా... సుమంత్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌కు కిడ్నాప్‌ సమాచారం చేరవేశాడు. ఆమె ఈమెయిల్‌ ద్వారా సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌పై దాడి చేసి సుమంత్‌ను రక్షించారు. రూ.30 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆగస్టు 28న సుమంత్‌ తిరుపతికి వచ్చారు. అయితే బాలాజీ ఫోన్‌చేసి బెదిరిస్తుండడంతో తిరుపతి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మద్దయ్యాచారి నిందితులు బాలాజీ, చరణ్‌, వాజిద్‌ బాషాలను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితులు గౌతమ్‌, యశ్వంత్‌రెడ్డి, మాకాటి మనోజ్‌లను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 06:19 AM