ఫేక్ ప్రచారానికి ఫ్యాక్ట్‌తో కౌంటర్
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:15 AM
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. ఫ్యాక్ట్(నిజం)తో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ.. ఉగ్రవాదుల తరహాలో హిట్-రన్-హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు.
ఉగ్రవాదుల తరహాలో చేస్తున్నారు
పాలకుడు ఎలా ఉండకూడదో గొడ్డలి పార్టీ నాయకుడే కేస్ స్టడీ
ప్రతి ఎకరాకూ నీటితో తెలుగుతల్లికి జలహారతి
పొలిటికల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిస్తూ పాలనలో ముందుకు
కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకే పార్టీలో పూర్తి గౌరవం
ప్రజల ఓటే గీటురాయి.. 2029లో మెరుగైన ఫలితాలు రావాలి
పార్టీగా బలపడటం, కూటమి ఐక్యత.. రెండూ ముఖ్యమే: బాబు
సాగునీటి రంగంపై చేస్తున్న కృషికి సీఎంకు స్టాండింగ్ ఒవేషన్
పార్టీయే సుప్రీం.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి
పార్టీ ఏదైనా పనిచెబితే దానికే ప్రాధాన్యమివ్వాలి: లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. ఫ్యాక్ట్(నిజం)తో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ.. ఉగ్రవాదుల తరహాలో హిట్-రన్-హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు. చెడు గురించి చెబితేనే మంచి విలువ తెలుస్తుందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి, వ్యవస్థలను ధ్వంసం చేసిందని అన్నారు. వీటన్నింటినీ పదేపదే ప్రజలకు వివరించాలని సూచించారు. పాలకుడు ఏవిధంగా ఉండకూడదో అనేదానికి గొడ్డలి పార్టీ నేత ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనిపై విమర్శలు చేసేందుకు గొడ్డలి పార్టీ సిద్ధంగా ఉంటోందని సీఎం అన్నారు. గతంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ అడ్డంగా ఉన్నప్పటికీ పనులు పూర్తి కాకపోయినా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ డ్రామాలాడారని, ఆ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తే అది ఎప్పుడో పూర్తి చేసేశామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లికి నీరిస్తే.. అవి గోదావరి జలాలు కావని, పురుషోత్తపట్నం నుంచి వచ్చాయంటున్నారన్నారు.
అయితే, ఈ ప్రాజెక్టుకు గొడ్డలి పార్టీ నాడు అడ్డుపడిందని గుర్తు చేశారు. ఆ పార్టీ చేస్తున్న వక్రీకరణలకు, దుష్ప్రచారాలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాలన్నారు. ఏపీపీఎస్సీలో అడ్డగోలుగా అక్రమాలు చేశారని, అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని సీఎం అన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి... ప్రజలు చూస్తారనే భయంతో బయట కూర్చుని అసత్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మరింతగా ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తామని, వారు కూడా అదే స్థాయిలో పనిచేయాలని అన్నారు. నాయకత్వాన్ని పెంచుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని పార్టీకి బలం చేకూర్చాలని సూచించారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
తెలుగుతల్లికి జలహారతి ఇస్తాం
‘‘పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులనూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చి తెలుగు తల్లికి జలహారతి ఇస్తాం. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో తన జన్మధన్యమైందన్నారు. కృష్ణా జలాలను చూసి అక్కడి ప్రజల కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తాం. ఎల్‌నినో విపత్తుపై అంతా అప్రమత్తంగా ఉండాలి. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి. ప్రతి కార్యక్రమంలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి. భోగాపురం ఎయిర్‌పోర్టు, వెలిగొండ, పోలవరం ఎడమ కాల్వ ప్రారంభోత్సవాల్లో ప్రజలు భాగస్వాములయ్యారు. జిల్లాలకు నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ ఇచ్చాం. పరిపాలనా వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశాం. ప్రజాప్రతినిధులు సమర్ధ నాయకత్వం వహించాలి. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే కార్యకర్తలను, నాయకులను ప్రోత్సహిస్తున్నాం. పొలిట్‌బ్యూరో, చట్టసభల్లోకి తీసుకు వచ్చాం. పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. రాజకీయ పార్టీగా మనం బలపడటం ఎంత ముఖ్యమో కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యం. ఫొటోలు, ఫ్లెక్సీల గురించి వివాదాలు వద్దు. కూటమిగా కలిసి క్షేత్రస్థాయికి వెళ్లాలి. 2024 కంటే ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేయాలి. పని చేయడంతోపాటు చేసిన పనిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం కూడా ముఖ్యం. ’’
సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు
‘‘పొలిటికల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు వెళ్తున్నాం. కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలకు పూర్తి గౌరవం ఇస్తున్నాం. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన సామాన్య కార్యకర్త దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ ఇవ్వడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజల ఓటే గీటు రాయిగా పనిచేద్దాం. నాయకత్వానికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. సమర్ధ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేంద్రం సహకారంతో ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పనిచేస్తున్నాం. అభివృద్ధి- సంక్షేమం-సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ పాలన చేపట్టాం. నెలకు నాలుగు రోజులు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నాను. పేదల సేవలో, మీభూమి- మీ హక్కు, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, సంజీవని కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నాను. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాం. ప్రైవేటు స్కూళ్లకు గుడ్‌బై చెప్పి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్‌మెంట్ చేశాం. ఒక్క డీఎస్సీ కూడా పెట్టని వ్యక్తి మనపై విమర్శలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. 28 పాలసీలతో 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు గ్రౌండ్ అవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ లాంటి పరిశ్రమలతో ఉత్తరాంధ్ర ఇప్పుడు అభివృద్ధికి కేంద్రం. అమరావతి క్వాంటం టెక్నాలజీతోపాటు నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. రాయలసీమ రైజింగ్ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వచ్చాయి. త్వరలో హార్టీకల్చర్ హబ్‌గా మారుతుంది. డేటా ఇంటిగ్రేషన్ ద్వారా పౌరసేవల్ని సులభతరం చేశాం. రెవెన్యూ సమస్యల పరిష్కారంతోపాటు రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నాం. క్యూఆర్ కోడ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భూములకు భద్రత కల్పిస్తున్నాం. 22 ఏ భూముల వివాదాన్ని పరిష్కరిస్తున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తే ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.’’ అని సీఎం తెలిపారు.
మిత్రపక్ష ఎమ్మెల్యే గెలవాలనే అలా మాట్లాడా!
కాంక్లేవ్ ముగింపులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి ఎంత సంక్షేమం ఇస్తున్నామనేది క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ వివరించాలని సూచించారు. సంక్షేమం గతం కంటే డబుల్ ఇస్తున్నామని, దీనికి పొలిటికల్ ఓనర్షిప్ తీసుకోవాలన్నారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలకు సైతం సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పర్యటనల్లో నియోజకవర్గాల్లో శాఖల పనితీరుపై ప్రజల్లోనే వివరిస్తున్నానని, ఎమ్మెల్యేలకు కూడా కొన్ని సూచనలు ఇస్తున్నానని తెలిపారు. ఇటీవల నర్సాపురం నియోజకవర్గంలోనూ ఇదే చేశానని, మన మిత్రపక్ష ఎమ్మెల్యే మళ్లీ గెలవాలి... సరిచూసుకోమని చెప్పాను దానిపై కొందరు కామెంట్లు చేస్తున్నారని సీఎం అన్నారు.
‘వాటర్‌మ్యాన్’కు లీడర్‌షిప్ కాంక్లేవ్ అభినందన
కాంక్లేవ్ ప్రారంభంలో ‘సీఈవో సీఎం టు వాటర్‌మ్యాన్’ అంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు .. సీఎంకి అభినందనలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి తెలుగు యువతను ఐటీ నిపుణులుగా మార్చిన సీఎం, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, జలసంరక్షణతో వాటర్ మ్యాన్‌గా మారారని రామానాయుడు అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాలకు జలవనరులు అందించేలా డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారని, జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే అభివృద్ధి, ప్రగతి అనే నినాదంతో 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన సీఎం, పట్టిసీమ పోత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు తేవడంతోపాటు రాయలసీమ ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా నీరిచ్చారని మంత్రి తెలిపారు. ఏపీలో ఉన్న 4 కోట్ల ఎకరాల భూమిలో 2 కోట్ల ఎకరాలు మాత్రమే సాగు చేసేందుకు ఆస్కారం ఉందని గుర్తించి నీరిచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారని రామానాయుడు అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో భూమి సాగు కిందకు రావాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయడం ఒక్కటే మార్గమని సీఎం పాలసీగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. సాగునీటి రంగంపై చేస్తున్న కృషికిగాను టీడీపీ నేతలంతా స్టాండింగ్ ఒవేషన్‌తో నిలబడి, సీఎంకు అభినందనలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి