అమరావతినీ తామే కట్టామంటారేమో!
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:59 AM
క్రెడిట్ చోరీ చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాజధాని అమరావతిని ఎడారి, శ్మశానం అంటూ విధ్వంసం చేశారు.
క్రెడిట్ చోరీ గొడ్డలి పార్టీకి అలవాటే
అనకాపల్లికీ నీళ్లు తెచ్చామని పేటీఎం ప్రచారం: సీఎం
క్రెడిట్ చోరీ చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాజధాని అమరావతిని ఎడారి, శ్మశానం అంటూ విధ్వంసం చేశారు. అది ప్రపంచం మెచ్చే నగరంగా మారితే అదీ తమ గొప్పగా చెప్పకొంటారేమో! భోగాపురం విమానాశ్రయం తామే కట్టామని చెప్పుకొంటున్నారు. వెలిగొండ సొరంగం తామే తవ్వినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అనకాపల్లికీ తామే నీళ్లు తెచ్చామని పేటీఎం సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభిస్తుంది. మేం పోలవరాన్ని పూర్తి చేస్తే.. దానిని నాశనం చేసిన వ్యక్తులు తామే కట్టినట్లు చెప్పుకొంటారు. ఎడమ కాలువ పూర్తిచేసింది తామేనని ఇప్పటికే ప్రచారం ప్రారంభించి ఉంటా రు. ఇటువంటివారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని సభలో అన్నారు. ఇలాంటివాటికి సమాధానం చెప్పే శక్తి ఉత్తరాంధ్రకు ఉందన్నారు. గొడ్డలి పార్టీ చీకటి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రాజెక్టులకు కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ ఆ నాయకుడు విలాసాలకు రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ నిర్మించారు. ఆ సొమ్ముతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. గొడ్డలి పార్టీ విపక్షంలో ఉండీ విషంకక్కుతోంది. విశాఖకు డేటా సెంటర్లు వస్తుంటే.. నీరు, విద్యుత్‌కు కొరత వస్తుందంటూ పేటీఎం బ్యాచ్‌లు పెట్టి ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు తెస్తున్న నీళ్లు ఐదు డేటా సెంటర్లకు సరిపోతాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు రెండు టీఎంసీలు వచ్చే అవకాశముంది’ అని తెలిపారు.
పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి అమితోత్సాహంతో మాట్లాడిన చంద్రబాబు.. ఇవాళ గోదావరి జలాలు వచ్చాయని, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు కూడా అని పేర్కొన్నారు. ప్రజలంతా హర్షధ్వానాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు.