టార్గెట్ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:01 AM
కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..
ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం
పొలిటికల్ గవర్నెన్స్‌కు సీఎం శ్రీకారం
శాసనసభ్యుల పనితీరుపై 360 డిగ్రీల్లో స్కానింగ్
లోటుపాట్లను వివరిస్తూ.. పనితీరును విశ్లేషిస్తూ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషణ
ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్‌చార్జి మంత్రితో భేటీ
మచిలీపట్నం ఎంపీ స్థానంతో శ్రీకారం
పామర్రు, పెనమలూరు, గుడివాడ పనితీరుపై సంతృప్తి
మచిలీపట్నం, గన్నవరం, పెడనలో మెరుగుపడాలి
అవనిగడ్డలో ఎవరి దారి వారిదే.. దిద్దుకోవాలన్న సీఎం
ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి పనితీరుపై పెదవివిరుపు
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు. ఎమ్మెల్యేల లోటుపాట్లను గుర్తించి, వాటిని వారికి వివరించి... దిద్దుబాటను సూచిస్తున్నారు. అటు అధికారులతోనూ సమన్వయం సాధించేలా చర్యలు చేపట్టారు. ‘పొలిటికల్ గవర్నెన్స్’లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా భేటీలకు శ్రీకారం చుట్టారు. ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్‌చార్జి మంత్రితో సమావేశాలు ప్రారంభించారు. ఇదేదో ఆషామాషీగా జరిగిన సమీక్ష కాదు. ఎమ్మెల్యేల పనితీరును ఆమూలాగ్రంవిశ్లేషించి వారి లోటుపాట్లను నిర్మొహమాటంగా చెబుతూ... వాటిని సరిదిద్దుకునేలా దీనిని రూపొందించారు. ఒక్కొక్కరి ప్రోగ్రెస్ రిపోర్టులను సిద్ధం చేశారు. గురువారం మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘‘గత ఏడాది నవంబరులో మీరు నియోజకవర్గంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించే కార్యక్రమమే చేపట్టలేదు. ఆ నెలలో మీరు అందుబాటులో ఉంది కేవలం 16 రోజులే. కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పనితీరు మరింత మెరుగుపరచుకోండి.. లేకుంటే కష్టం’’ అంటూ ఒక్కొక్కరి పనితీరును వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్తున్నారన్న వివరాలనూ దగ్గర పెట్టుకుని ప్రశ్నించారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరును ఆయన కూలంకషంగా వివరించి.. వారు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు.. ఎక్కడ వెనుకబడి ఉన్నారో చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులను సీల్డ్ కవర్లలో వారికి అందజేశారు. పార్లమెంటు పరిధిలో ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుందో.. కూటమి పార్టీలతో ఎమ్మెల్యేలు ఏ మేరకు సమన్వయంతో వ్యవహరిస్తున్నారో కూడా రిపోర్టుల్లో పేర్కొనడం గమనార్హం. ‘‘ఎమ్మెల్యేలందరూ కూటమి ధర్మాన్ని పాటించాలి. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి’’ అని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు.
ఆ మూడు చోట్లా భేష్..
మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పామర్రు, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నం, గన్నవరం, పెడన సెగ్మెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మరింత మెరుగుపరచుకోవలసి ఉందని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల నడుమ సమన్వయం పూర్తిగా లోపించిందని, వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. అక్కడి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లినా.. టీడీపీ వారిని కలుపుకొని వెళ్లడంలో అంత చొరవ చూపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లు అధికారంలో ఉందంటే అక్కడ నాయకులు, కార్యకర్తలకు నడుమ సమన్వయం బాగుండడమే కారణం. మనం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలి’ అని సీఎం సూచించారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఆయన జిల్లాకు వచ్చేది కూడా తక్కువేనని చెప్పారు. ఇకపై ఆయన పద్ధతి మారాలని హెచ్చరించారు. ‘ఎంతసేపూ విజయవాడ వచ్చి అక్కడ కూర్చోవడం కాదు.. మీరు ఇన్‌చార్జిగా ఉన్న జిల్లా పక్కనే ఉన్నా వెళ్లాలని లేకుంటే ఎలా’ అని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ ఎలా ఉన్నారంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. కలెక్టర్ పనితీరు బాగుందని ఎమ్మెల్యేలందరూ చెప్పారు. ఎస్పీ పనితీరుపై కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అన్నీ సరిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు.
తప్పులు సరిదిద్దుకోండి..
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తప్పులు చేయడం సహజమని, కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకుని.. పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. పామర్రు నియోజకవర్గంలో ఈ సీజన్‌లో ఎరువుల కృత్రిమ కొరత కారణంగా.. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వమూ రైతుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. వచ్చే సీజన్‌లో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇప్పటి నుంచే ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాను, కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఈ సీజన్‌లో ఎరువులు అందుబాటులో ఉండి కూడా.. వాటిని అవసరమైన చోట అందుబాటులో ఉంచడంలో విఫలమై విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈసారి గ్రామాల వారీగా ముందే వివరాలు తెప్పించుకుని.. ఎరువులు ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంత సూక్ష్మ స్థాయిలో సీఎంతో సమావేశం జరుగుతుందని అనుకోలేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
1995-99 మధ్య కూడా ఇలాగే
చంద్రబాబు 1995-99మధ్య తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఇలాంటి సమావేశాలు జరిపారు. ఎమ్మెల్యేలకు, కలెక్టర్, ఎస్పీల నడుమ సమన్వయ లోపాల పరిష్కారానికి.. జిల్లా స్థాయిలోని కీలకమైన వ్యక్తులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో ఈ భేటీలు నిర్వహించారు. ఆ తర్వాత ఇలాంటి సమావేశాలు ఆగిపోయాయి. తిరిగి తాజా అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రారంభించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వీటిని నిర్వహిస్తున్నారు. శుక్రవారం చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతారు.