ఆ ఆలోచనలు భేష్
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:10 AM
వినూత్న ఆలోచనలతో ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ‘ఎక్స్‌లెంట్ వర్క్... కీప్ ఇట్ అప్’ అంటూ అభినందనలు తెలిపారు. శుక్రవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఏడు జిల్లాల కలెక్టర్లు తాము అమలు చేసిన ఉత్తమ విధానాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాల గురించి వివరించారు.
కలెక్టర్ల సరికొత్త విధానాలకు సీఎం ప్రశంస
ఆయా అంశాలను అన్ని జిల్లాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
అల్లూరి జిల్లాలో డ్రోన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను విస్తరించాలని సూచన
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వినూత్న ఆలోచనలతో ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ‘ఎక్స్‌లెంట్ వర్క్... కీప్ ఇట్ అప్’ అంటూ అభినందనలు తెలిపారు. శుక్రవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఏడు జిల్లాల కలెక్టర్లు తాము అమలు చేసిన ఉత్తమ విధానాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాల గురించి వివరించారు. వారి ప్రజెంటేషన్లను ఆసక్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి, కొత్త విధానాలను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అల్లూరి జిల్లా కలెక్టరు ప్రజంట్ చేసిన డ్రోన్ ప్రాజెక్టును అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ జిల్లాలో 2 డ్రోన్ల ద్వారా అందిస్తున్న సేవలను 10 డ్రోన్లకు విస్తరించాలని సూచించారు. డ్రోన్ ఆపరేషన్స్ కోసం గైడ్‌లైన్స్ రూపొందించాలని ఆదేశించారు. ఇతర ప్రాజెక్టులను కూడా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు వాటిని మరింత మెరుగుపరిచి, సమగ్రత తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
డ్రోన్ల సాయంతో వైద్య సేవలు
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరు నిశాంతి ఏజెన్సీలోని అత్యంత క్లిష్టమైన కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు ‘ప్రాజెక్ట్ డ్రోన్’ను రూపొందించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం అత్యవసర ఔషధాలు, బ్లడ్ యూనిట్లు, నమూనాలను పరీక్షల కోసం ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాడేరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి రెండు డ్రోన్ల ద్వారా పంపించేలా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ డ్రోన్లు ఇప్పటి వరకూ 72 వేల కిలోమీటర్ల మేర తిరిగి 83 వేలకు పైగా ఔషధాలు, 9,500 ఆరోగ్య పరీక్షల నమూనాలను రవాణా చేసినట్లు కలెక్టరు నిశాంతి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ డ్రోన్ సేవల ద్వారా ఇప్పటి వరకు 20 వేల మంది ప్రయోజనం పొందారని చెప్పారు.
గ్రామీణ విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం
అనంతపురం కలెక్టరు ఓ.ఆనంద్ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల క్రీడా ప్రతిభను గుర్తించి, వారిని పాఠశాల స్థాయి నుంచి జాతీయ పోటీల వరకు పాల్గొనేలా ప్రోత్సహించే లక్ష్యంతో ‘స్కూల్స్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్’ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ, విజేతలకు పీ4 విధానంలో క్రీడా ఉపకరణాలు, మెడళ్లు అందించడం ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పిస్తున్నారు. వివిధ క్రీడల్లో విద్యార్థుల టాలెంట్‌ను గుర్తించి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని కలెక్టరు ఆనంద్ తెలిపారు.
బాపట్ల జిల్లాలో ‘స్వర్ణ భవిత స్కూల్’
ఆటిజం, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రత్యేక థెరపీ ద్వారా వైద్యసేవలు, మెరుగైన విద్యాబోధన, ఆ పిల్లల కుటుంబాల సంక్షేమం కోసం బాపట్ల కలెక్టరు వినోద్ కుమార్ ‘స్వర్ణ భవిత స్కూల్’ అనే పేరుతో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ‘వన్ చైల్డ్-వన్ ట్రీట్మెంట్-వన్ గవర్నమెంట్ ఎకో సిస్టమ్’ కాన్సె్‌ప్టతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు కలెక్టరు తెలిపారు.
డిజిటల్ లెర్నింగ్‌తో నైపుణ్యాల పెంపు
చిత్తూరు కలెక్టరు సుమిత్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘ఓడీసీ-డిజిటల్ స్కూల్ లెర్నింగ్’ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేస్తున్నారు. 131 ల్యాప్‌టాప్‌లు, 586 ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు టెక్నాలజీ లెర్నింగ్‌తోపాటు గణితం, సైన్స్, భాషా సబ్జెక్టుల్లో ఏఐ ఎనేబుల్డ్ క్లాస్‌రూమ్ ప్రాక్టీస్ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు సుమిత్ తెలిపారు.
వర్షపాత లోటులోనూ పంటల సాగు
ఎల్‌నినో నేపథ్యంలో వర్షపాత లోటు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనూ వివిధ పంటలను విజయవంతంగా సాగు చేసేలా ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్-నేచురల్ ఫార్మింగ్ (పీఎండీఎస్)’ పేరుతో కర్నూలు జిల్లా కలెక్టరు సిరి వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా ఖాళీగా ఉన్న భూముల్లో పప్పుదినుసులు సహా 9 రకాల పంటల్ని సాగు చేసే అవకాశం ఉందని కలెక్టరు చెప్పారు. సీడ్ పెల్లటైజేషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో విత్తనాలు చల్లి పంటలు సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానంలో జిల్లాలో ఇప్పటికే 1.94 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశామన్నారు. బంజరు భూములు, చెరువు గట్లను కూడా సాగు పరిధిలోకి తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
వ్యర్థాల నుంచి సంపద సృష్టి
వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు ప్రకాశం కలెక్టరు రాజాబాబు ‘బయో విజార్డ్ మైక్రోబ్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ‘వేస్ట్ టు వెల్త్-సర్క్యులర్ ఎకానమీ’ పేరుతో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నిత్యం 125 టన్నుల వ్యర్థాలను సేకరించి, వాటిని తడి, పొడి చెత్తగా వర్గీకరిస్తున్నారు. దానిని 15 రోజుల్లో ఆర్గానిక్ ఎరువుగా తయారు చేస్తున్నారు. దీన్ని ‘గ్రీన్ గోల్డ్’ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. లెగసీ వేస్ట్‌కు బయోవిజార్డ్ మైక్రోబ్ వినియోగం ద్వారా దుర్వాసన, దోమల బెడద తప్పుతుందని రాజాబాబు చెప్పారు.
భూసారాన్ని పెంచే ‘బయోచార్’
భూసారం పెంచేందుకు సత్యసాయి కలెక్టరు శ్యామ్‌ప్రసాద్ ‘బయోచార్’ ప్రాజెక్టును రూపొందించారు. ‘పునరుజ్జీవం’ పేరుతో ఆ జిల్లాలో 5 వేల ఎకరాల్లో భూసారాన్ని పెంచేలా కార్యచరణ సిద్ధం చేసి అమలు చేశారు. 4 వేల టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ వాతావరణంలో కలవకుండా... పర్యావరణహితంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. మల్బరీ మొక్కల కాండాలను కాల్చి.. వాటిని బొగ్గుగా మార్చి కంపోస్టుగా తయారు చేయడం ద్వారా బయోచార్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టరు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు.
నెల్లూరు కలెక్టరుకు ప్రత్యేక అభినందన
ప్రభుత్వ పాలనలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లాను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ‘పల్లె వీక్షణ’ కార్యక్రమంలో భాగంగా శుక్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వద్దకే వెళ్లి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారని ప్రశంసించారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..