Share News

పర్యావరణ విధ్వంసం

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:17 AM

జీవీఎంసీ 22వ వార్డులో పర్యావరణ విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతోంది.

పర్యావరణ విధ్వంసం

గ్రీన్‌బెల్ట్‌లో పదుల సంఖ్యలో చెట్లు నరికివేత

వ్యాపార కేంద్రంగా మార్చే యోచనలో జీవీఎంసీ!

అక్కడ దుకాణాలు ఏర్పాటుచేస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తే అవకాశం

మద్దిలపాలెం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ 22వ వార్డులో పర్యావరణ విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతోంది. జాతీయ రహదారి వెంబడి గల గ్రీన్‌ బెల్ట్‌లో ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నగర పాలక సంస్థ తొలగిస్తోంది. ఇసుకతోట నుంచి మద్దిలపాలెం ఆటోమోటివ్‌ వరకు జాతీయ రహదారికి ఆనుకుని గ్రీన్‌ బెల్ట్‌ ఉంది. ఈ గ్రీన్‌ బెల్ట్‌ను పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చడానికి జీవీఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఆరు నెలల కిందట హోండా షోరూమ్‌ వద్ద గ్రీన్‌ బెల్ట్‌ను తొలగించి పికిల్‌బాల్‌ కోర్టు ఏర్పాటుచేసింది. ఇప్పుడు అధికారుల కన్ను ఆటోమోటివ్‌ వరకు ఉన్న గ్రీన్‌బెల్ట్‌పై పడింది. అందులో దుకాణాలు ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా పదుల సంఖ్యలో చెట్లను కూకటివేళ్లతో పెకిలించి పారేశారు. గతంలో కళాభారతి వద్ద పార్కును తొలగించి వాణిజ్య సముదాయం నిర్మించే ప్రయత్నం చేయగా కాలనీ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే పార్కులోని కొన్ని చెట్లను నరికేశారు. వాస్తవానికి గ్రీన్‌బెల్ట్‌లో దుకాణాలు వంటివి ఏర్పాటుచేయకూడదు. కేవలం పిల్లల ప్లే పార్కుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు అదేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాకుండా ఇసుకతోట నుంచి మద్దిలపాలెం వరకూ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట ఫుడ్‌ కోర్టులు ఏర్పాటుచేస్తే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Updated Date - Sep 11 , 2026 | 01:17 AM