Share News

టీమ్‌ ఏపీ సత్తా

ABN , Publish Date - May 01 , 2026 | 04:01 AM

బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025 అవార్డు మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే వచ్చింది. వారే నిజమైన విజేతలు’ అని సీఎం చంద్రబాబు వినమ్రంగా చెప్పారు.

టీమ్‌ ఏపీ సత్తా

  • మంత్రులు, అధికారుల వల్లే ‘బిజినెస్‌ రిఫార్మర్‌’ అవార్డు

  • వ్యవస్థలను సరిచేయడం అసాధ్యమనే అనుకున్నా

  • కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి

  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌లో అధికారులు అద్భుతంగా పనిచేశారు

  • గూగుల్‌, ఆర్సెలార్‌ రాక మోదీ చలవే

  • పెట్టుబడులతో పెద్దఎత్తున ఉద్యోగాలు

  • తక్కువ ధరకే విద్యుదుత్పత్తికి యత్నం

  • నేను, పవన్‌ ఇగోలకు పోవడం లేదు

  • అధికారులు, ఉద్యోగులు కూడా పోవద్దు

  • ‘డిన్నర్‌ విత్‌ ద రియల్‌ విన్నర్స్‌’లో సీఎం చంద్రబాబు సూచన

  • పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం వెంట పడడం కాదు.. ప్రభుత్వమే పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి మాట్లాడాలి. ఇలా చేయడం వల్లే అభివృద్ధి సాధించగలిగాం.

  • రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ నేను, పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి ఇగోలకు వెళ్లకుండా ప్రజల కోసం పని చేస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో ఇగోలకు పోకుండా రాష్ట్రం కోసం పనిచేయాలి.

- సీఎం చంద్రబాబు

గుంటూరు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025 అవార్డు మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే వచ్చింది. వారే నిజమైన విజేతలు’ అని సీఎం చంద్రబాబు వినమ్రంగా చెప్పారు. అందరూ సహకరించడం వల్లే అభివృద్ధి చేస్తున్నామని.. సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. తాను ముంబై వెళ్లి అవార్డు అందుకుని వచ్చిన సందర్భంగా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు రాజధాని అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆయన ‘డిన్నర్‌ విత్‌ ది రియల్‌ విన్నర్స్‌’ పేరుతో విందు ఇచ్చారు. ఉత్తమ పనితీరు కనపరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గడచిన 22 నెలల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, అందుకు ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషిని వారితో పంచుకున్నారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి అమలు, ఫలితాలు సాధించడంలో మంత్రులు, అధికారులు, ఉద్యోగుల బృందం సాగించిన సమష్టి కృషిని అభినందించారు. రాజకీయాల్లో ఎన్నో విజయాలను చూశానని.. 2024 ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ అందించిన సహకారాన్ని కొనియాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


టీమ్‌ ఏపీ సహకారం..

22 నెలల క్రితం పాలన ప్రారంభించినప్పుడు వ్యవస్థలను సరి చేయడం సాధ్యం కాదేమోనని అనుకున్నా. కానీ టీమ్‌ ఏపీ సహకారంతో వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం.. ఆ టీమ్‌ వల్లే ఈ అవార్డు వచ్చింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం.. అధికారులు అద్భుతంగా పనిచేశారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా మంది ప్రధానులను చూశాను. సరైన సమయంలో సరైన ప్రధానిగా మోదీ నిలిచారు. గూగుల్‌ ఏపీకి రాగలిగిందంటే ఆయనే కారణం. అది వచ్చేందుకు నిబంధనలు సవరించారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారం స్థాపనకూ ప్రధాని చొరవే కారణం. ఆ సంస్థ కోరిన విధంగా ముడి సరుకు రవాణాకు పైప్‌లైను ఏర్పాటుకు అనుమతులివ్వాలని కేంద్ర అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు.. తద్వారా ఉద్యోగాలు పెద్దఎత్తున వస్తున్నాయి. గూగుల్‌ పెట్టుబడులను మించి పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్‌ ముందుకొచ్చింది. గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడితే.. రిలయన్స్‌ 17 బిలియన్‌ డాలర్లతో వస్తోంది. విద్యుత్‌ కొనుగోళ్ల చార్జీలను గతేడాది యూనిట్‌కు 30 పైసల చొప్పున తగ్గించాం. ఈ ఏడాది ఇంకో 30 పైసలు తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పినా, ప్రజలకు మేలు చేయడానికి గతంలో విద్యుత్‌ సంస్కరణలు చేపట్టాం. ఇప్పుడు ‘వన్‌ నేషన్‌-వన్‌ గ్రిడ్‌’ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద మేలు చేశారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ఉత్పత్తులకు గ్లోబల్‌ బ్రాండ్‌ రావాలి.

2.jpg

Updated Date - May 01 , 2026 | 04:01 AM