Share News

వైసీపీతో జాగ్రత్త..!

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:28 AM

జగన్‌ మానసిక రుగ్మత(సైకిక్‌ డిజార్డర్‌)తో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన వారినల్లా లేపేస్తే ఇక అడిగే వారే ఉండరన్నది ఆయన ఉద్దేశంగా ఉందన్నారు.

వైసీపీతో జాగ్రత్త..!

  • క్రిమినల్‌ పాలిటిక్స్‌ పరాకాష్ఠకు.. దాని డీఎన్‌ఏలోనే డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. బెదిరించి భయపెడదామని చూసే రోజులకు కాలం చెల్లింది.క్రిమినల్స్‌ బెదిరింపులకు ఎవరూ భయపడరు.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జగన్‌ మానసిక రుగ్మత(సైకిక్‌ డిజార్డర్‌)తో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన వారినల్లా లేపేస్తే ఇక అడిగే వారే ఉండరన్నది ఆయన ఉద్దేశంగా ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్వభావం కలిగిన ఈయనలాంటి వారు క్రిమినల్‌ రాజకీయాలు చేస్తారని, అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం క్యాబినెట్‌ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత.. ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’, ‘వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్కే’పై జగన్‌ సహా వైసీపీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. కొత్త పలుకు కాదు.. ఇక పలుకే ఉండదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారని.. ఏబీఎన్‌ రాధాకృష్ణను లేప్తాననని మరో వైసీపీ నాయకుడు అంటారని.. ఇదేం వైఖరని ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందించారు. ‘లేపేస్తానంటున్నారు.. ఏంది లేపేసేది? వైసీపీ క్రిమినల్‌ రాజకీయం మరీ పరాకాష్ఠకు వెళ్తోంది. క్రిమినల్స్‌ ఆటలు సాగనివ్వకూడదు. దృఢంగా ఎదుర్కోవాలి. ఇలాంటివారితో జాగ్రత్తగా రాజకీయాలు చేయాలి. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ప్రచారం చేసే క్రిమినల్‌ కుట్రలను తిప్పికొట్టాలి’ అని మంత్రులకు సూచించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ వైసీపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయని.. జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజలకు వాస్తవాలను చెబుతూ వారిని చైతన్యపరచాలని.. బెదిరింపు రాజకీయాలను దీటుగా తిప్పికొట్టాలని పిలుపిచ్చారు.


జలధారను ప్రాధాన్యంగా తీసుకోండి

జలధార కార్యక్రమాన్ని మంత్రులు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని బాగా చేశారని, అక్కడ భూగర్భజల మట్టం 8.59 మీటర్లు పెరిగిందని, ఇదే స్ఫూర్తితో మంత్రులందరూ తాము ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాల్లో దీనిని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం నిధులు అనుసంధానమయ్యేలా పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పనితీరుపై 73 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని, శాఖలవారీగా దీన్ని మరింత పెంచుకోవాలని ఆదేశించారు.

కార్యదర్శులపై అసహనం

కార్యదర్శుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు గతంలో సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ.. చర్చల్లో ఏ సందేహం వచ్చినా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదని ఆక్షేపించారు. క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమైనా ఎజెండా మంత్రులకు రాలేదని మంత్రి మనోహర్‌ ఆయన దృష్టికి తెచ్చారు. ఎందుకు రాలేదని సీఎం అధికారులను ప్రశ్నించగా.. ఎజెండా ముందస్తుగానే బయటకు వచ్చేస్తోందని.. ఈ కారణంగా సాఫ్ట్‌వేర్‌ మార్చి మంత్రుల ట్యాబ్‌లకు పంపామని వారు బదులిచ్చారు. ‘క్యాబినెట్‌లో చర్చకు రావడానికి ముందే బయటకు ఎలా వెళ్తుంది? దీనికి అందరం సమిష్టి బాధ్యత తీసుకోవాలి. క్యాబినెట్‌ ఎజెండాలో చాలా కీలకమైన విషయాలు ఉంటాయి. ముందుగా బయటకు వెళ్లడం సరికాదు. గతంలో బడ్జెట్‌ లీక్‌ అయితే ఎన్టీఆర్‌ మంత్రులందరితో రాజీనామా చేయించారు. పేపర్‌ లీక్‌ అయితే నాడు మంత్రిగా ఉన్న బాలయోగి రాజీనామా చేశారు.’ అని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలోనూ ఉన్నతాధికారులు రాకపోవడాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ లోపాలన్నీ సరిదిద్దాలని సీఎస్‌ సాయిప్రసాద్‌ను ఆదేశించారు.

Updated Date - Apr 11 , 2026 | 03:28 AM