Share News

అధికారం పోయినా..అహంకారం పోలేదు!

ABN , Publish Date - May 29 , 2026 | 04:29 AM

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ నేరాలు, ఘోరాలు చేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి వాటిని నేనెప్పుడూ ఊహించలేదు. బాబాయిని హత్య చేసి నా చేతికే మరక అంటించే ప్రయత్నం చేశారు.

అధికారం పోయినా..అహంకారం పోలేదు!

  • గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌.. ఎన్డీయే అగైన్‌ అండ్‌ అగైన్‌

  • ఇదే మన నినాదం: చంద్రబాబు

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో గొడ్డలి పార్టీ నేరాలు, ఘోరాలు చేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి వాటిని నేనెప్పుడూ ఊహించలేదు. బాబాయిని హత్య చేసి నా చేతికే మరక అంటించే ప్రయత్నం చేశారు. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది. ప్రతిపక్ష హోదా పోయింది. అయినా అహంకారం మాత్రం పోలేదు. కుట్రలు, కుతంత్రాలు చేయడం మానలేదు. అలాంటి గొడ్డలి పార్టీ వేటు రాష్ట్రంపై పడకూడదన్నదే నా తపన. గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌. ఎన్డీయే అగైన్‌ అండ్‌ అగైన్‌ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలి’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. మహానాడు రెండో రోజు శుక్రవారం ఆయన ముగింపు ప్రసంగం చేశారు. దేశంలో ఏ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాల విభాగాలు ఉంటాయని.. కానీ గొడ్డలి పార్టీ ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ‘ఆ పార్టీకి గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌, సోషల్‌ మీడియా సైకోల బ్యాచ్‌, ఫేక్‌ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్‌, హత్యారాజకీయాల కిరాయి హంతకుల బ్యాచ్‌, దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్‌, కల్తీ లిక్కర్‌ బ్యాచ్‌.. విభాగాలుగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటారో.. గొడ్డలి పార్టీ కుట్రలను ఎండగట్టే విషయంలోనూ అంతే బాధ్యత తీసుకోవాలి’ అని కార్యకర్తలకు సూచించారు. పరీక్షలు, టీచర్‌ నియామకాలు పూర్తయిన 6 నెలల తర్వాత..గొడ్డలి పార్టీ నాయకులు ఎలాంటి సిగ్గూ లేకుండా డీఎస్సీపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, యువతలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

2.jpg


ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా..

గత ప్రభుత్వ నిర్వాకంతో అన్ని వ్యవస్థలూ ధ్వంసమయ్యాయి. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సంక్షేమం చేస్తూనే అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపడుతున్నాం. గత పాలకులు ప్రజావేదికను కూల్చారు. పెట్టుబడులను తరిమేసి విధ్వంసం సృష్టించారు. దీంతో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలంటే భయపడ్డారు. కూటమి వచ్చాక ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి విశ్వాసం కల్పించాం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, స్టీల్‌ ప్లాంట్లను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం సహకరించింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌ ఇచ్చాం. ఇదేమీ సులువుగా అయిపోలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఏ కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్లినా తిరిగి మన చేతికే కాగితాలిచ్చిన పరిస్థితి. రూ.12 వేల కోట్లతో మళ్లీ ఆ పథకాలను పునరుద్ధరించాం. కుప్పకూలిన వ్యవస్థలన్నిటినీ సరిదిద్దాం. గతంలో పరదాల పాలన జరిగితే.. ఇప్పుడు ప్రజల మధ్య పాలన చేస్తున్నాం. గతంలో బటన్‌ నొక్కుడు పాలన ఉంటే.. ఇప్పుడు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకం అందిందో లేదో అడిగి తెలుసుకుంటున్నాం. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అనే విధానంలో పాలన సాగిస్తున్నాం. గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ లాంటి సంస్థలు వచ్చాయంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనపై నమ్మకంతో పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయి. 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగాం. దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎ్‌ఫడీఐ)ల్లో 25 శాతం మనకే వచ్చాయంటే మన విశ్వసనీయత అర్ధమవుతుంది. కేవలం 36 రోజుల్లోనే 5వ తరం ఫైటర్‌ జెట్‌ తయారీ, టెస్టింగ్‌ ప్రాజెక్టు వచ్చిదంటే రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎలా ఉందో తెలుస్తుంది. యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. 2047 నాటికి ఏపీని, ప్రపంచంలో తెలుగుజాతిని నంబర్‌ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను. విజన్‌-2047 సాధించేందుకు పది సూత్రాల ద్వారా ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం. పోర్టులు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాలతోపాటు పరిశ్రమలకు తగిన మానవ వనరులను కూడా తయారుచేసే దిశగా ముందుకెళ్తున్నాం. నైపుణ్యాల కల్పన కోసం జాతీయ, అంతర్జాతీయ అత్యుత్తమ సంస్థలను తీసుకొస్తున్నాం. ఏఐ, క్వాంటమ్‌ లాంటి అంశాల్లోనూ మన యువతకు పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.


ప్రతి ఎన్నికల్లో గెలవాలి..

ప్రజాజీవితంలో ఉండేవాళ్లకు ఓపిక అవసరం. ఏ స్థాయి వాళ్లకైనా క్యారెక్టర్‌ ముఖ్యం. మరక అంటకూడదు. ఎవరూ వేలెత్తి చూపని విధంగా మన పనితీరు ఉండాలి. స్థానిక ఎన్నికల్లో అందరం కలిసి సత్తా చాటాలి. ప్రతి ఎన్నికల్లో గెలవాలి. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ఎన్డీయే పార్టీలు, నేతలు, కార్యకర్తలతో సమన్వయంతో, సఖ్యతగా మెలగండి. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. ప్రజల అవసరాలు గుర్తించి సాయం చేయాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి.

మహానాడులో విరాళాల వెల్లువ

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. రెండు (బుధ, గురు) రోజుల్లో రూ.25.61 కోట్ల విరాళాలు పార్టీకి సమకూరాయి. తొలి రోజు రూ.11.70 కోట్లు రాగా, రెండో రోజు రూ.13.91 కోట్లు వచ్చాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భాష్యం సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.కోటి విరాళం అందజేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడి కుమార్తె తన తొలి జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఇంకా పలువురు నేతలు విరాళాలు అందజేశారు.

ఇది మహిళా మహానాడు..

ఇది మహిళా మహానాడు. ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం. టీడీపీ ఏ పాలసీ చేసినా యువతను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. జెన్‌జీ, జెన్‌ అల్ఫాకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. టెక్నాలజీకి ఆధ్యాత్మికత తోడైతే ఆనందాంధ్ర ప్రదేశ్‌ సాకారమవుతుంది. వెనుకబడిన వర్గాలకు టీడీపీ రుణపడి ఉంది. బడుగులకు అండగా ఉంటాం. ఎల్‌నినో కారణంగా ఈసారి వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నా.. సక్రమ నీటి నిర్వహణతో ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. విద్యుత్‌ చార్జీల భారాన్ని మరింత తగ్గించే దిశగా కృషి చేస్తున్నాం. భవిష్యత్‌లో యూనిట్‌కు రూ.1.20 వరకు తగ్గిస్తాం.


ఆకాశమే హద్దుగా..

‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరిస్తూ ఈ మహానాడులో వారికి భాగస్వామ్యం కల్పించాం. ఆకాశమే హద్దుగా వారు ఎదిగేందుకు అవకాశం కల్పించాం. నేతలు, కార్యకర్తలను చూసి నేనూ వారితో పోటీపడే పరిస్థితి. శాశ్వతంగా పార్టీని మోసింది.. మోసేది.. మోయబోయేది కార్యకర్తలే.. వారందరికీ పాదాభివందనం. వారికెప్పుడూ రుణపడి ఉంటా. వారి సంక్షేమానికి రూ.160 కోట్లు వ్యయం చేశాం. వారి బిడ్డలకు విద్య, సాధికారిత నైపుణ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాం. సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌ ద్వారా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాం. బూత్‌ కమిటీలు, క్లస్టర్ల వరకు అందరికీ న్యాయం చేస్తున్నాం. వారు నీతి నిజాయితీగా ఆర్థికంగా ఎదిగేలా బాధ్యత తీసుకుంటా. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తల కోసం నేతలు కూడా పనిచేయాలి.

వర్చువల్‌ మహానాడు అదిరింది..

రెండ్రోజుల వర్చువల్‌ మహానాడు విజయవంతమైంది.. అదరగొట్టింది. అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించాం. నా రాజకీయ జీవితంలో ఈ వర్చువల్‌ మహానాడు పెద్ద ప్రయోగం. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లతోపాటు 12 దేశాల నుంచి కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. రెండ్రోజుల్లో ఏకంగా 24.50 లక్షల మంది హాజరు కావడం ఒక రికార్డు. రికార్డులు సృష్టించడం, వాటిని తిరగరాయడం టీడీపీకి మాత్రమే సాధ్యం. 48 డిగ్రీల తీవ్ర స్దాయి ఉష్ణోగ్రతలు ఎండలు ఉన్నా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్‌ విధానంలో హాజరై విజయం చేకూర్చారు. మహానాడును గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన అందరికీ అభినందనలు.. ధన్యవాదాలు.

  • గత పాలకులు చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పుల కారణంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. వాటన్నింటినీ రీషెడ్యూల్‌ చేసి రుణభారం తగ్గిస్తున్నాం.

  • ఆదాయం లేకుండా అప్పులు చేసి సంక్షేమం చేయడం వల్ల రాష్ట్రం అప్పులు పాలు కావడం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేయడమే టీడీపీ లక్ష్యం.

- సీఎం చంద్రబాబు

Updated Date - May 29 , 2026 | 04:29 AM