వైసీపీ అంటేనే విధ్వంసం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:08 AM
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని అమరావతిని నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం...
అధికారంలో ఉండగా వినాశనం.. విపక్షంలోకి రాగానే బెదిరింపులు
నన్ను పట్టుకొస్తా.. పట్టుకొస్తా అంటున్నావ్!
నిన్ను అరెస్టు చేయడం ఎంతసేపు?
మొన్న మూడు ముక్కలు.. నేడు మావిగన్
సీఆర్డీయే ఏర్పాటుతో మేం చేస్తున్నది అదేగా!
నాయకుడే సైకో అంటే మొత్తం పార్టీ అలాగే ఉంది
వెయ్యి మంది సైకోలొచ్చినా రాజధానిని ఆపలేరు
‘ఆంధ్రజ్యోతి’పై అనవసరంగా రాద్ధాంతం
మహిళలపై మాట్లాడే నైతికత మీకుందా?
అమరావతి మహిళలను వేధించిన చరిత్ర మీది
బాపట్ల జిల్లా గ్రామసభలో జగన్‌పై చంద్రబాబు ఫైర్
మూడంచెల రక్షణతో పట్టాదారు పాసు పుస్తకాలు
భూ వివాదాలకు స్వస్తి పలుకుదామని పిలుపు
నాయకుడు మాత్రమే సైకో అనుకుంటే...ఇప్పుడు ఏకంగా వైసీపీ మొత్తం సైకోగా మారిపోయింది. మొన్నటి వరకు రాజధానిపై మూడు ముక్కలాట. ఇప్పుడేమో మావిగన్. ఇంకా నయం వాటికన్ అని దాని ప్రతిష్ఠ దెబ్బ తీయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేయాలని ఇప్పుడంటున్నాడు. సీఆర్డీయే పేరిట మేం ఎప్పటినుంచో చేస్తున్నది ఇదే! అమరావతి కట్టలేమంట! నీలాంటి వెయ్యి మంది సైకోలు అడ్డొచ్చినా ఆపలేరు. అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా?
- సీఎం చంద్రబాబు
బాపట్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని అమరావతిని నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం... విపక్షంలో ఉంటే బెదిరించడం.. ఇదే జగన్ నైజమని ఆయన మండిపడ్డారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో గురువారం జరిగిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘మీ భూమి మీ హక్కు’లో భాగంగా గ్రామ సభలో రైతు ఉప్పాల నాంచారయ్యకు పట్టాదారు పాసు పుస్తకం అందించారు.
గడచిన నాలుగు రోజులుగా ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ సంస్థలపై వైసీపీ మూకలు వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. ‘‘ఏమీ అనకుండానే ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావు (జగన్‌ను ఉద్దేశించి). నీ పేపర్‌గానీ, మీ నాయకులు గానీ ఆడ బిడ్డలను ఎంతగా వేధించారో, మానసికంగా ఎంత దెబ్బతీశారో గుర్తులేదా? ఏ రోజయినా వాటికి సమాధానం చెప్పారా? ‘నేనొస్తే మళ్లీ ఎంక్వైరీ చేస్తా. నిన్ను పట్టుకొస్తా...నిన్ను పట్టుకొస్తా’ అంటావు. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తావు? పార్టీ ముసుగులో ఓ 50 మందిని వెంటేసుకుని దాడులు చేస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేయాలంటే ఎంత సేపు పడుతుంది? కానీ చేయను. చట్టమే చూసుకుంటుంది’’ అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడే నైతికత జగన్‌కు లేదన్నారు. ‘‘అమరావతిలో మహిళల బాత్రూమ్‌ల వద్ద డ్రోన్లు ఎగరవేసిన చరిత్ర నీది. నగ్నంగా ఫొటోలు తీయించావు. జుట్టుపట్టి ఈడ్పించావు. వాళ్లను కొట్టించావు. నీకు మహిళలు మద్దతు ఇవ్వాలా?’’ అని నిలదీశారు. తీవ్రవాదుల తరహాలో అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి దాడులు చేయించి, బెదిరించి జగన్ మళ్లీ పారిపోతుంటారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఎంత లోతుకుపోతే అన్ని గోతులు...
‘‘నేను నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను. కానీ రెవెన్యూలో ఎంత లోతుకు పోతే అన్ని గోతులు బయటపడుతున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు. ఓ వ్యక్తి చేసిన తప్పునకు వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. ఇప్పుడు వాటన్నింటినీ సంస్కరించి ప్రజల భూమికి భద్రతతో కూడిన భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో స్వయంగా నేనే ప్రతి నెలా 9న గ్రామసభల ద్వారా పాసు పుస్తకాలిస్తున్నా. శాశ్వతంగా భూ సమస్యలు లేకుండా చూడాలన్నదే నా లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కల్లా రీ సర్వేతో పాటు పీపీబీలను ప్రతి రైతుకూ అందిస్తాం. పాస్‌బుక్‌లకు మూడంచెల రక్షణ కల్పిస్తున్నాం. ఎవరూ తారుమారు చేయలేరు. ట్యాంపర్ చేసే అవకాశం లేదు. క్యూఆర్ కోడ్‌ను కూడా అందిస్తున్నాం. డిజిటల్ లాకర్ విధానాన్ని రైతులకు చేరువ చేస్తున్నాం..’’
మీ ఇంటి జాగా...మీ హక్కు..
‘‘తర్వాత దశలో ‘మీ ఇంటి జాగా.. మీ హక్కు’ పేరిట కార్యక్రమం తీసుకొస్తాను. గ్రామ స్థాయిలో ఉండే సర్వీస్ ఇనామ్‌లు 1,37,000 ఎకరాలను 22ఏ నుంచి నిబంధనల ప్రకారం తొలగిస్తాం. ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా సంస్కరణలు తీసుకొస్తాం. సెంటు భూమి కోసం అన్నదమ్ములు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్డుకీడ్చిన వాళ్లని ఆదర్శంగా తీసుకుని కుటుంబాల్లో విభేదాలు సృష్టించుకోవద్దు. కక్షలు వద్దు. కుటుంబ ఆస్తుల పరిష్కారం విషయంలో నెల్లూరు జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. బాపట్ల జిల్లా కలెక్టర్ కూడా ఐదు వారాల్లో 22ఏ భూములను కొలిక్కి తెస్తామని హామీ ఇచ్చారు. అందుకు ప్రత్యేకంగా అభినందనలు.’’
పుష్కరాల నాటికి పోలవరం పూర్తి
‘‘గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పీపీబీలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగానే అడుగులేస్తున్నాం. ఇప్పటికే 21.23 లక్షల పాసు పుస్తకాలు రైతులకు పంపిణీ చేయగా జూలై నాటికి మరో 9 లక్షల పీపీబీలను ఇస్తాం సముద్రం మత్స్యకారుల సొంతం. వారి జీవనోపాధి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను. బయట ప్రాంతాల నుంచి ఎవరు వేటకు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై మత్స్యశాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాను. బాపట్లలోని సూర్యలంక బీచ్ దేశ పర్యాటకానికే గమ్యస్థానంగా గోవాను తలదన్నే రీతిలో మారనుంది.’’
పొలాల వద్దే పాసు పుస్తకాల పంపిణీ
గత ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసిందని బాధిత రైతులు సీఎం సమక్షంలో ఆనందం వ్యక్తం చేశారు. సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు సంతోషంగా మాట్లాడారు. గ్రామ సర్వేయర్‌తో కలిసి బాధిత రైతులు మురాల వెంకటేశ్వర్లు, వాకా శ్రీనివాసరావుల పొలాల వద్దకు వెళ్లి వారితో సీఎం ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు గత ప్రభుత్వం పడిన బాధలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం వారితో కలిసి వారి పొలాల్లో కలియతిరుగుతూ సాగు వివరాలు, కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
20 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది
‘‘20 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ప్రభుత్వం 25 సెంట్ల భూమి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకం రాలేదు. దానివల్ల ఎటువంటి రుణాలు పొందలేకపోయాను. కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వే చేసి పాసు పుస్తకం ఇచ్చారు’’ - మురాల వెంకటేశ్వర్లు, సూరేపల్లి
బాపట్ల ఎంపీ భావోద్వేగం
అమరావతి రాజధానికి పార్లమెంట్ వేదికగా ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తున్నప్పుడు తాను స్పీకర్ స్థానంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ‘‘అన్ని పార్టీలూ అమరావతి బిల్లుకు ఆమోదం తెలపగా, ఒకే ఒక్క తుగ్లక్ పార్టీ (వైసీపీని ఉద్దేశించి) వ్యతిరేకించింది. బిల్లు పాస్ అయ్యే సమయంలో హౌస్‌లో లేచి నిల్చోవాలని నాకు కూడా అనిపించింది’’ అని ఆయన చెప్పారు. అమరావతికి గెజిట్ వచ్చిన తర్వాత సీఎం పాల్గొన్న తొలి సభ ఇదే కావడం ఆనందంగా ఉందని రెవెన్యూ మంత్రి అనగాని అన్నారు. విద్యుత్ రంగంలో అమలవుతున్న సంస్కరణలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సీఎం సభలో అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, వేగేశ్న నరేంద్రవర్మ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సరదాగా మాట్లాడుతూ...చలోక్తులు విసురుతూ..
సూరేపల్లి సభలో గతానికి భిన్నంగా చంద్రబాబు కనిపించారు. ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల మధ్య నుంచి వచ్చే స్పందనను ఆయన ఆస్వాదించడం కనిపించింది. దానికి సరదాగా జవాబిచ్చారు కూడా. జగన్ వ్యవహారశైలిపై సూటిగా విమర్శలు ఎక్కుపెడుతూనే వాటికి వ్యంగ్యాన్ని జోడిస్తూ మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన తన స్వప్నమని సీఎం అనగా, సభలోని ఓ పురుషుడు స్పందిస్తూ.. తమ సంగతేంటని అడిగాడు. సీఎం సరదాగా స్పందిస్తూ ‘నీలో మేల్ డామినేషన్ ఎక్కువగా కనబడుతోంది. అయినా ఇన్‌కమ్ డబుల్ అవుతుంది. ముందుగా నీ భార్యను గౌరవించు’ అని బదులివ్వగానే సభలో నవ్వులు విరబూశాయి. త్వరలోనే కొనబోయే బస్సులన్నీ ఏసీవేనని, వాటిలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానని సీఎం అనగా, సభలోని ఒకరు లేచి తమ సంగతేంటని ఆరాతీశారు. దీనిపై సీఎం నవ్వుతూ దీనిలో మాత్రం సమానత్వం కావాలా అని చలోక్తి విసిరారు. వేమూరు నియోజకవర్గంలో ఆయా విభాగాల పనితీరుకు ర్యాంకులిచ్చే క్రమంలో రేషన్ దిగదుడుపుగా ఉండడంతో...అధికారిని ఉద్దేశించి రీసైక్లింగ్‌కు ఏమైనా వెళుతున్నాయా అంటూ సీఎం సరదాగానే హెచ్చరించారు.