Share News

స్కిల్‌ సెంటర్లుగా లేబర్‌ అడ్డాలు!

ABN , Publish Date - May 02 , 2026 | 04:24 AM

రాష్ట్రంలో కార్మికులంతా గౌరవంగా జీవించేందుకు లేబర్‌ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 15 నగరాల్లో ఈ అడ్డాలు నిర్మిస్తామన్నారు.

స్కిల్‌ సెంటర్లుగా లేబర్‌ అడ్డాలు!

  • ప్రస్తుతం కార్మికులు పనుల కోసం వచ్చి ఎండకు మాడుతూ, వర్షానికి తడుస్తూ నిలబడుతున్నారు. లేబర్‌ అడ్డాలు ఏర్పాటుచేస్తే వాటి ద్వారా పని ఉంటే వెళ్తారు. లేకపోతే అక్కడే నైపుణ్య శిక్షణ తీసుకుంటారు.

  • పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్‌, వ్యవసాయ రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనివల్ల కష్టజీవులకు చేతినిండా పని, జీవనోపాధి దొరుకుతోంది.

- సీఎం చంద్రబాబు

  • తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాల ఏర్పాటు: సీఎం

  • ఫోన్‌చేస్తే చాలు.. కార్మికులను పంపుతారు

  • ఇవి సత్ఫలితాలిస్తే రాష్ట్రమంతటా పెడతాం

  • కార్మికుల పిల్లలు కంపెనీ పెట్టే స్థాయికి ఎదగాలి

  • కార్మికుల సంక్షేమానికి ఏటా రూ.615 కోట్లు

  • అమరావతిలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం

  • కార్మికుల్లో నైపుణ్యం పెంచితే అదనపు ఆదాయం

  • ఇందులో భాగంగా 25 వేల మందికి శిక్షణ

  • వైకుంఠపాళి వద్దు-ఎన్‌డీఏనే ముద్దు

  • కూటమి రాకతో ప్రజలకు స్వాతంత్య్రం

  • కృష్ణా జిల్లాలో ‘పేదల సేవలో’ చంద్రబాబు

  • పింఛన్ల పంపిణీ.. పామర్రు కార్యకర్తలతో భేటీ

  • ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభం

విజయవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్మికులంతా గౌరవంగా జీవించేందుకు లేబర్‌ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 15 నగరాల్లో ఈ అడ్డాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన వారు ఫోన్‌చేస్తే ఇవి కార్మికులను సమకూరుస్తాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వీటిని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లుగా మారుస్తామన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. ఈ అడ్డాలు ఇచ్చే ఫలితాలను పరిశీలించి రాష్ట్రమంతటా వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని తెలిపారు. వారంతా చిన్న, పెద్ద పరిశ్రమలు, షాపుల్లో పనిచేస్తున్నారన్నారు. కార్మిక సంక్షేమానికి ఏటా రూ.615 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవారని, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలని సూచించారు. కార్మికుడి కొడుకు కంపెనీ ప్రారంభించే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు.

2.jpg


ప్రపంచ స్థాయి ఆధునిక పనిముట్లు తీసుకొచ్చి త్వరలో అందజేస్తామన్నారు. కార్మికుల్లో నైపుణ్యం పెంచితే అదనంగా ఆదాయం వస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 25 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమ పథకాలకు జీవం పోశామన్నారు. ‘నిర్మాణ రంగంలోని కార్మికుడు పెళ్లి చేసుకున్నా.. కార్మికుడి కుమార్తెకు వివాహం చేసినా రూ.25 వేలు ఇస్తున్నాం. ఎవరైనా కార్మికుడు చనిపోతే రూ.60 వేలు, అంత్యక్రియలకు తక్షణమే రూ.20 వేలు ఇస్తున్నాం. కార్మికుల కోసం అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీ సిటీలో ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాం. అమరావతిలోనూ ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని హామీ ఇచ్చారు. వైసీపీ అధ్యక్షుడిపై ఆయన మండిపడ్డారు. ‘జగన్‌కు ఒక మానసిక సమస్య ఉంది. అది అందరినీ మోసం చేయడం.. నాశనం చేయడం. వైసీపీ పార్టీ కాదు.. అది గొడ్డలి పార్టీ’ అని ధ్వజమెత్తారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..

నేను టీమ్‌ లీడర్‌ను మాత్రమే

నేను టీమ్‌ లీడర్‌ను మాత్రమే. టీమ్‌ సరిగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. కొద్దిరోజుల క్రితం నాకు బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పనులను దేశమంతా గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. వాస్తవానికి ఇది నాకు వచ్చిన అవార్డు కాదు.. రాష్ట్రానికి వచ్చింది. మంత్రులు, అధికార యంత్రాంగానికి ఈ గుర్తింపు వచ్చింది. చట్టాలను రూపొందించే సభలకు మహిళలతోనే శోభవస్తుంది. రాబోయే రోజుల్లో వారు చట్టసభల్లో 33శాతం ప్రాతినిధ్యం వహించేలా కేంద్రం చట్టంచేస్తుంది. కొంతమంది బిల్లును అడ్డుకున్నా, రాబోయే రోజుల్లో అడ్డుకోవడం అసాధ్యం.

ఆ పార్టీని ఏమనాలో తెలియడం లేదు

నేను అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేయడం, తర్వాత ఎన్నికల్లో ఎవరో గెలిచి విధ్వంసం చేయడం వంటి వైకుంఠపాళి ఆటలు వద్దు. వైకుంఠపాళి వద్దు-ఎన్‌డీఏనే ముద్దు. వైసీపీని ఏమనాలో తెలియడం లేదు. (జనంలో నుంచి ఒక వ్యక్తి నిలబడి కోడికత్తి పార్టీ అని పెద్దగా కేకలు వేశారు). కోడికత్తి పార్టీ, గొడ్డలి పార్టీ. నేర ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ చేసిన నేరాన్ని నా నెత్తిన వేసి అధికారంలోకి వచ్చారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది. వైసీపీ రావడంతో నాశనమైంది. ఎన్ని ఇబ్బందులున్నా 2027లో జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణానదికి అనుసంధానం చేస్తాం. 2028లో కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. బందరు పోర్టు కోసం 2014లో భూ సేకరణ చేస్తే, వైసీపీ వచ్చిన తర్వాత టెండర్లు రద్దుచేసి గందరగోళంలోకి నెట్టింది.

4.jpg


అమరావతి దశ-దిశ మారాయ్‌

29 వేలమంది రైతులు అమరావతికి 33 వేల ఎకరాల భూమిని ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. వారి సహకారంతో అమరావతి దశ, దిశ మారిపోయాయి. నాపై నమ్మకంతో రెండో దశలో మరో 16 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి కూడా అక్కడి రైతులు సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంలో స్టీల్‌ సిటీకి అక్కడి రైతులు రెండు నెలల్లో 3 వేల ఎకరాలిచ్చారు. అక్కడ గూగుల్‌ రూ.1.40 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి ముందుకొచ్చింది. దానిని చూసి రిలయన్స్‌ జియో ఏకంగా రూ.1.70 లక్షల కోట్లు పెట్టడానికి వచ్చింది.

2019లో మీరు ఓట్లు వేయలేదు

2019 ఎన్నికల్లో ప్రజలు పక్కచూపులు చూడడం వల్లే టీడీపీ అధికారం కోల్పోయింది. మీరంతా జగన్‌కు ఓట్లు వేయడంతో అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రాన్ని అంధకారంలో పడేశాడు (ఓ మహిళ స్పందించి..ఆయనకు ఓట్లు వేయలేదని చెప్పింది. వేశారంటూ సీఎం కౌంటర్‌ ఇవ్వగా.. ఆమె మళ్లీ వేయలేదని స్పష్టం చేసింది. నువ్వు వేయకపోవచ్చు. మిగిలిన వాళ్లు వేశారు కదా అని ఆయన అన్నారు).

రూ.63,188 కోట్లు పంపిణీ

కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 62.47 లక్షల మందికి రూ.63,188 కోట్లు పింఛన్ల రూపంలో పం పిణీ చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చేసరికి సాధారణ పింఛన్‌ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, మంచానికి పరిమితమైతే రూ.15 వేలు ఇస్తున్నాం. 263 అన్నక్యాంటీన్ల ద్వా రా డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల కడుపు నింపుతున్నాం. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటే అన్నింటి కంటే పింఛన్ల పంపిణీ టాప్‌లో ఉంది. సర్వేలో 93శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - May 02 , 2026 | 04:24 AM