ఏకగ్రీవాలను ప్రోత్సహిద్దాం!
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:55 AM
పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల పోరు ముగిసిందని, ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని.. ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని, ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు
ఏకగ్రీవాలను ప్రోత్సహిద్దాం!
ఆ నిధులతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చు: సీఎం
ప్రభుత్వ నజరానాలను ప్రచారం చేయండి
గ్రామ స్థాయి నేతలు పోటీపై పట్టుదలగా ఉంటారు
అలాంటి వారితో ఎమ్మెల్యేలు మాట్లాడాలి
పంతాలు, ఈగోలు కాదు.. ఐక్యత కనిపించాలి
పరిషత్ ఫలితాలతో వైసీపీకి పోరుపై ఆసక్తి లేదు
ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతోంది: చంద్రబాబు
మంత్రులు, టీడీపీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల పోరు ముగిసిందని, ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని.. ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని, ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. ఆదివారం టీడీపీ ముఖ్య నేతలు, మంత్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాల గురించి ప్రజలకు వివరించాలి. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 5-10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25లక్షలు, 10వేలపైన జనాభా ఉంటే రూ.50లక్షలు ఇచ్చే విషయాన్ని ప్రచారం చేయాలి.
గతంలో కనిష్ఠంగా రూ.5లక్షలుగా ఉన్న నజరానాను ఇప్పుడు రూ.15లక్షలు చేశాం. గరిష్ఠంగా రూ.20 లక్షలు ఉన్న బహుమానాన్ని రూ.50 లక్షలకు పెంచాం’ అని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలు వేరు, జడ్పీ ఎన్నికలు వేరు.. పార్టీ గుర్తులేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని పునరుద్ఘాటించారు. ఏకగ్రీవాలు జరిగితే.. వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీపై గ్రామ స్థాయి నేతలు చాలా పట్టుదలగా ఉంటారని, పార్టీలో కూడా పోటీ పడతారని.. వారితో మాట్లాడాలని సూచించారు. ‘పార్టీలో నేతల మధ్య పంతాలు, ఈగోలు కాదు.. ఐక్యత కనిపించాలి. గ్రామాల్లో నేతలతో సంప్రదింపులు జరపండి. పరిషత్ ఎన్నికల ఫలితాల దరిమిలా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఆసక్తిగా లేదు.. ఒకే పార్టీలో ఉన్నవాళ్లు రెండు వర్గాలుగా పోటీ చేసే పరిస్థితి రాకూడదు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా ఏకగ్రీవాలను పోత్సహించాలి’ అన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చూపిన స్ఫూర్తినే పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని.. ప్రజల్లో నమ్మకాన్ని ఓట్లుగా మలచుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని, ఈ విజయం రెండున్నరేళ్ల కూటమి పాలనకు దక్కిన గుర్తింపని సీఎం అన్నారు. ‘ప్రజలు మనతోనే ఉన్నారు.. స్థానిక ఎన్నికల ఫలితాలు కూటమి పాలనకు దక్కిన ఆమోదం. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఇది ప్రభుత్వంపై అన్ని వర్గాల నమ్మకాన్నీ చాటింది. అన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్