ఏఐతో శ్రీవారి దర్శనం మరింత సులభతరం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:02 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో సామాన్య భక్తుడిలా మారిపోయారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, తిరుమల వీధుల్లో కాలినడకన తిరుగుతూ భక్తులతో ముఖాముఖి మాట్లాడారు.
తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో సామాన్య భక్తుడిలా మారిపోయారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, తిరుమల వీధుల్లో కాలినడకన తిరుగుతూ భక్తులతో ముఖాముఖి మాట్లాడారు. భక్తుల కష్టసుఖాలను, టీటీడీ అందిస్తున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తిరుమల ప్రసాదం విశిష్ఠతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని భక్తులతో అన్నారు. గతంతో పోలిస్తే లడ్డూ నాణ్యత, రుచి చాలా బాగుందని భక్తులు ముఖ్యమంత్రికి వివరించారు.
దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. భక్తుల విజ్ఞప్తిపై స్పందించిన చంద్రబాబు, శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వినియోగించబోతున్నామని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
భక్తుల భద్రత, సౌకర్యాల పర్యవేక్షణ కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ ప్రాధాన్యతను సీఎం వివరించారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశాన్ని ఈ వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. మరోవైపు.. తిరుమల పర్యటనను ముగించుకొని రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు మంత్రి లోకేష్, భువనేశ్వరి, దేవాన్ష్.
'వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్' ప్రారంభించిన సీఎం..
తిరుమలలోని పిండి మర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ‘వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్’ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టీటీడీ ఈ ల్యాబ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. సుమారు రూ.25 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రెండు అంతస్తుల్లో ఈ ల్యాబ్‌ను నిర్మించారు.
ల్యాబ్‌లో సుమారు 50 రకాల అత్యాధునిక యంత్రాలను అమర్చారు, ఇవి ఆహార పదార్థాల్లోని అతి సూక్ష్మమైన లోపాలు కూడా గుర్తించగలవు. భక్తులకు అందించే అన్నప్రసాదాలు , లడ్డూ ప్రసాదాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, FSSAI నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..
ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం తీరని లోటు.. మంత్రి నారా లోకేశ్ సంతాపం