Share News

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:21 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల సన్నద్ధత, సీట్ల కేటాయింపు, కూటమి సమన్వయంపై కీలక సూచనలు చేశారు.

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక, కూటమి సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా సీట్ల కేటాయింపు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

టీడీపీ పోటీ చేసే 11 మేయర్ స్థానాలను 11 సామాజికవర్గాలకు కేటాయించినట్లు వెల్లడించారు. కూటమి నేతలంతా మిత్రధర్మాన్ని పాటిస్తూ, పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కూటమి ఐక్యతకు పరీక్షగా నిలుస్తాయని, నేతలంతా వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఉమ్మడి విజయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ప్రతి అంశంలోనూ సమన్వయం ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ కుట్రలను తిప్పికొడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతాన్ని మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు. కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని, సీట్ల కేటాయింపులో కూటమి చూపిన ఐక్యతను ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిబింబించాలని అన్నారు. నేతల మధ్య సమన్వయం, కార్యకర్తల కృషి, ప్రజల విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.


ఈ వార్తలూ చదవండి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం

Updated Date - Oct 17 , 2026 | 09:33 PM