కలిసికట్టుగా కూటమి
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:01 AM
రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు.
మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలి: బాబు
కూటమి బలం మరింత పెరిగింది
ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు
ఈ ఐక్యత కింది వరకూ కొనసాగాలి
గుజరాత్‌లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం
అదే స్ఫూర్తితో ఇక్కడా గెలవాలి: సీఎం
అర్థవంతంగా మాట్లాడాలని సూచన
మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు
అందరూ అప్రమత్తంగా ఉండాలి: పవన్
ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో.. భవిష్యత్‌లోనూ అదే స్ఫూర్తితో కూటమి ఎమ్మెల్యేలు పనిచేయాలి. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలి.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మా సమస్యలపై మా ఎమ్మెల్యే సభలో మాట్లాడారు. మంత్రులు సమాధానం చెప్పారని నియోజకవర్గ ప్రజలందరూ అనుకోవాలి. వైసీపీ హయాంలో బూతులు తిట్టుకున్నారని.. మనం కూడా బూతులు తిట్టకూడదు. ప్రజామోదయోగ్యంగా సభ జరగాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు. ఇకపైనా ఇదే ఐక్యత కొనసాగాలని, కింది స్థాయి వరకు ఇలాగే ఉండాలని.. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇందుకు తగ్గట్లుగా మంచి పనులు చేసి ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ-జనసేన-బీజేపీలతో కూడిన ఎన్‌డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా పాల్గొన్నారు. ‘‘మొన్నటి ఎన్నికల కంటే నేడు కూటమి బలం, ప్రజల మద్దతు మరింత పెరిగాయి. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేయాలి. మూడు పార్టీలూ ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండాలి. గుజరాత్‌లో వరుసగా ఐదుసార్లు బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతోంది. అదే స్ఫూర్తితో ఇక్కడా విజయాలు సొంతం చేసుకోవాలి. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి’’ అని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత కక్షలను ప్రస్తావించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. ‘సభలో మనం మాట్లాడే ప్రతి మాటా 5కోట్ల మంది ప్రజలు వింటున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సభకు వైసీపీ వారు వచ్చారా లేదా అన్నది లెక్క కాదు. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని సభ్యులందరూ గుర్తుంచుకోవాలి’ అని హితవుపలికారు. అసెంబ్లీ సమావేశాలను సభ్యులందరూ సీరియ్‌సగా తీసుకోవాలని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సభ్యులు అంతా సభలోనే ఉండాలని స్పష్టం చేశారు. తాను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతానని, సభలో సబ్జెక్టుపై అర్థవంతమైన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. సభలో ఆవు కథలు మాట్లాడవద్దని.. అడిగే ప్రతి అంశమూ అర్ధవంతంగా ఉండాలని అన్నారు. అనుకున్న విషయాన్ని 3-5 నిమిషాల్లో చెప్పేలా ప్రతి సభ్యుడూ సన్నద్ధమై రావాలని సూచించారు. తాను ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సభకు వచ్చి ముగిసేవరకు ఉంటానని.. ప్రతి సభ్యుడు, మంత్రి మాట్లాడే అంశాలను నోట్ చేసుకుంటానన్నారు.
సబ్జెక్టు పెంచుకోండి..
మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. తనకు టెక్నాలజీ గురించి లోతుగా తెలియదని.. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో బాగా తెలుసుకుంటానని.. అదే మనకు ఆ అంశంపై అవగాహన కలిగిస్తుందని అన్నారు. ‘క్వాంటమ్‌పై మన రాష్ట్రంలో కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని కోరితే 1.60 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐఐటీ-మద్రాస్ ఈ కోర్సుపై దరఖాస్తులు ఆహ్వానిస్తే మొత్తం 2.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మన రాష్ట్రం వారివే 1.10 లక్షలు ఉన్నాయి’ అన్నారు. ఇక జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్‌తో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని.. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతామని సీఎం చెప్పారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్య క్రమంలో వాటిని పూర్తి చేద్దామన్నారు. ‘మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ వ్యవస్థలను గాడిన పెట్టాం’ అని చెప్పారు.
కేంద్ర సాయంతోనే పురోగతి..
ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందించబట్టే అది సాధ్యమవుతోందని సీఎం తెలిపారు. అందుకే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టగలిగామన్నారు. ‘కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఆ ప్రాజెక్టులు మళ్లీ గాడిన పడేవి కావు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నామంటే కేంద్రం అందిస్తున్న సాయమే కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దాని సాయంతోనే నిలబెట్టాం. మన రాష్ట్రం కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని స్టీల్‌ప్లాంట్‌కు సాయం చేసింది. దీంతో చాలాకాలం తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ రూ.54 కోట్ల లాభాలు ఆర్జించగలిగింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇదే స్థాయిలో పనిచేస్తే దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిలుస్తుంది. విజయవాడ, విశాఖ నడుమ హైస్పీడ్ రైలు కావాలని కేంద్రాన్ని కోరాం. అది కూడా త్వరలో సాకారమయ్యే అవకాశముంది. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు.. రూ.90వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కోరారు.
తమ అరాచకాలు మరిచారు..
ప్రస్తుత సమావేశంలో ఉన్న 90 శాతం మంది వైసీపీ ప్రభుత్వ బాధితులేనని సీఎం అన్నారు. ‘నేడు నీతులు చెబుతున్న వైసీపీ నేతలు.. నాడు అధికారంలో తాము చేసిన అరాచకాలను మరచిపోయారు. వారి హయాంలో పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే కారు కూడా దిగనివ్వలేదు. హోటల్ గది నుంచి బయటకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. నా అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ హైదరాబాద్ నుంచి వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు. ఇలా అనేక సవాళ్లను.. ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచింది’ అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందని, విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం పురోగతి సాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అతి తక్కువ కాలంలో జనం మెచ్చే పాలన అందించామని, వారి అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ఈ విజయాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని కోరారు. గవర్నర్ ప్రసంగం కూడా అదే విధంగా సాగిందన్నారు.
అన్ని మతాలనూ గౌరవిస్తాం..
కూటమి ప్రభుత్వం ఎవరి మతవిశ్వాసాలను, భక్తుల సెంటిమెంటును దెబ్బతీయదని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరిగాయని గుర్తు చేశారు. జగన్‌కు దేవాలయాలంటే గౌరవం లేదని, అందుకే రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూతోపాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు
టీడీపీ ఎమ్మెల్యేలందరూ దాదాపు మంచి పనితీరు కనబరుస్తున్నారన్న సీఎం.. 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. వారి తీరు ఆశించిన స్థాయిలో లేదని.. వారిని ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడతానని చెప్పారు.
15 ఏళ్లు కలిసి ప్రయాణించాల్సిందే
కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేయొద్దు: పవన్
కూటమి ఎమ్మెల్యేలెవరూ తప్పు చేయవద్దని, మనం చేసే తప్పు విపక్షానికి అవకాశం కాకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘మనం ఏ స్ఫూర్తితో కలిశామో దానికి నష్టం కలిగించేలా ఎవ్వరూ పనిచేయొద్దు. 15 ఏళ్లపాటు మనం కలిసి ప్రయాణం చేయాల్సిందే. మన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అందరం అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలి’ అని స్పష్టంచేశారు. వైసీపీ ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమించి, 20 నెలల్లోనే ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని అన్నారు.
