సీఎంపై వ్యంగ్య చిత్రాలా?
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:35 AM
ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో పొలిటికల్ అజెండాతో రాష్ట్ర సదస్సు జరిగిందని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు విమర్శించారు.
ఆయన భార్య వ్యాఖ్యలను స్ర్కీన్‌పై వ్యంగ్యంగా చూపుతారా?
పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలా?
బొప్పరాజుపై రెవెన్యూ ఎంప్లాయిస్
జేఏసీ చైర్మన్ రవీంద్రరాజు ధ్వజం
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో పొలిటికల్ అజెండాతో రాష్ట్ర సదస్సు జరిగిందని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు విమర్శించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు నిర్వహించిన ఈ సదస్సు ఉద్యోగుల సమస్యలపై కాదని శనివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ‘బొప్పరాజు సదస్సులో కొందరు నాయకులతో బయట నుంచి వచ్చిన స్ర్కిప్టుల ప్రకారం మాట్లాడించేందుకు ప్రయత్నించారు. కొందరు స్ర్కిప్టులు యథాతథంగా చదివితే.. కొందరు అందుకు అంగీకరించలేదు. సీఎం చంద్రబాబును విమర్శించడంతోపాటు ఆయనపై వ్యంగ్య చిత్రాలను తెరపై ప్రదర్శించారు. సీఎం సతీమణి వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగా స్ర్కీన్‌పై చూపించారు. ఇది సరికాదు. ఏ ఉద్యోగ సంఘమూ ఎప్పుడూ ఇలా చేయలేదు. అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, హేళనగా మాట్లాడడం కూడా సరికాదు. అలా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలి. బొప్పరాజు పసలేని కార్యాచరణ ప్రకటించారు. ఉద్యోగులను చివరకు కుటుంబ సభ్యులతో సహా రోడ్డుపై కూర్చునే ప్రణాళిక సిద్ధం చేయడం సిగ్గుచేటు. ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు బొప్పరాజు అండ్ టీం పన్నాగం’ అని దుయ్యబట్టారు. రెవెన్యూ భవన నిర్మాణానికి రెవెన్యూ ఉద్యోగుల నుంచి ఒక రోజు వేతనం వసూలు చేసి కోట్ల అవినీతికి పాల్పడడం, రెవెన్యూ స్పోర్ట్స్ పేరుతో రూ.కోట్లు వసూలుకు సంబంధించి బొప్పరాజుపై గతంలోనే ఆ సంఘం నాయకులు కొందరు సీఐడీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఇంత వరకు విచారణ చేయలేదని తెలిపారు. ఆ ఫిర్యాదులపై సీఐడీ, విజిలెన్స్ ఎంక్వైరీ వేసి.. ఉద్యోగులను ఆయన బారి నుంచి రక్షించాలని రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు