Share News

వెలిగొండ చూసేందుకు వెళ్లి చిక్కుకున్నారు!

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:08 AM

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా విడుదలైన నీటి ప్రవాహాన్ని చూడాలన్న ఉత్సాహం వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్కాపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులు..

వెలిగొండ చూసేందుకు వెళ్లి చిక్కుకున్నారు!

  • నీటి ప్రవాహ ఉధృతిలో బొలేరో వాహనం

  • చెట్టుపైకెక్కి ప్రాణాలు దక్కించుకున్న ముగ్గురు

  • రాత్రంతా శ్రమించి ఒడ్డుకు చేర్చిన అధికారులు

  • ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు ద్వారా విడుదలైన నీటి ప్రవాహాన్ని చూడాలన్న ఉత్సాహం వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్కాపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. సోమవారం సీఎం చంద్రబాబు ఫీడర్‌ కాలువ ద్వారా వదిలిన కృష్ణాజలాలు నల్లమల సాగర్‌కు చేరుతున్న తీరును దగ్గర నుంచి చూడాలనుకున్నారు. బొలేరో వాహనంలో సోమవారం రాత్రి 7గంటల సమయంలో ముంపు గ్రామమైన పెద్దారవీడు మండలం కలనూతల వైపు వెళుతుండగా మధ్యలో నీటి ఉధృతికి వాహనం పక్కకు కొట్టుకుపోవటం ప్రారంభమైంది. వెంటనే ముగ్గురూ వాహనంపైన నిలబడి పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కి కూర్చున్నారు. కింద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వారు భయంతో కేకలు వేశారు.

రాత్రి 9 గంటలకు ఈ సమాచారం తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ క్రేన్‌, ఎక్స్‌కవేటర్లను రప్పించారు. రెస్క్యూ టీం కూడా నీటి ప్రవాహం ఉధృతి నేపథ్యంలో వారి వద్దకు వెళ్లలేకపోయింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి నీటి విడుదల తగ్గించారు. దాదాపు 7 గంటల పాటు చీకట్లో శ్రమించిన అధికార యంత్రాంగం ఉదయం 5 గంటల ప్రాంతంలో భారీ క్రేన్‌ను వారికి సమీపంలోకి పంపి దాని మీదుగా వారు ముగ్గురినీ ఒడ్డుకు చేర్చారు. వారిని పట్టణానికి చెందిన ఎన్‌.తిరుపతినాయుడు, నల్లబోతుల శ్రీను, పసుపులేటి రమణగా గుర్తించారు. తమను సురక్షితంగా బయటకు చేర్చిన ఎమ్మెల్యే కందుల, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 05:08 AM