‘అనంత’లో ఎందుకీ ఓటమి?
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:34 AM
‘‘రాష్ట్రమంతటా కూటమి జయభేరి మోగించింది. అయినా... అనంతపురంలో మన మేయర్ అభ్యర్థి ఓడిపోవడమా? ఎందుకిలా జరిగింది?’’ అని బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది.
సీటు అడిగే ముందు సరైన అభ్యర్థిని చూసుకోరా?
బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల అక్షింతలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రమంతటా కూటమి జయభేరి మోగించింది. అయినా... అనంతపురంలో మన మేయర్ అభ్యర్థి ఓడిపోవడమా? ఎందుకిలా జరిగింది?’’ అని బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. సీట్ల సర్దుబాట్లలో భాగంగా వచ్చిన ఒకే ఒక్క నగర పాలక సంస్థలోనూ గెలవలేక పోవడమేమిటని అక్షింతలు వేసినట్లు చర్చ జరుగుతోంది. రెండున్నరేళ్లుగా పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి పెట్టలేదని, ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటే పార్టీ ఎలా బలపడుతుందని ప్రశ్నించినట్లు తెలిసింది. మేయర్ సీటు అడిగే ముందు అక్కడ బలమైన అభ్యర్థిని చూసుకోవాల్సిన బాధ్యత లేదాని నిలదీసినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా అనంతపురం మేయర్ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. మంత్రి సత్యకుమార్ తన సన్నిహితుడైన సందిరెడ్డి శ్రీనివాస్‌ను బరిలో దించాలనే ఆలోచనతో అనంతపురంపై పార్టీలో చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో తన సతీమణి సోదరుడి కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే... అనంతపురం మేయర్ పదవి బీసీ రిజర్వేషన్ కావడంతో సందిరెడ్డికి అవకాశం లభించలేదు. అదే సమయంలో... పార్టీ అధ్యక్షుడి బంధువుకు టికెట్ రాకుండా మరో వర్గం చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. చివరికి... మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు మరో సన్నిహితుడైన అజేశ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. చివరికి... డివిజన్లలో కూటమి అభ్యర్థులు భారీగా గెలిచినా, మేయర్ అభ్యర్థి మాత్రం గెలవలేకపోయారు. కూటమిలోని ఇతర పార్టీల ముఖ్య నేతల నుంచి తగిన సహకారం లభించలేదని, వారి మధ్య ఉన్న గ్రూపులు తమ కొంప ముంచాయని మంత్రి సత్యకుమార్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపికలోనే అసలు లోపం ఉందని మరో వర్గం నేతలు వాదిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో గుడి కూల్చేందుకు ప్రయత్నించిన కమ్యూనిస్టు నాయకుడి కుమారుడిని బీజేపీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు